
- చంద్రుడిపైకి ఆర్టెమిస్ 1
- సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించిన నాసా
- 50 ఏండ్ల తర్వాత మూన్‌పైకి అమెరికా రాకెట్
- ఓరియన్ క్యాప్సుల్‌ను తీసుకెళ్లిన ఎస్ఎల్ఎస్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేపట్టింది. అపోలో ప్రాజెక్టు తర్వాత 50 ఏండ్లకు మళ్లీ చంద్రునిపైకి రాకెట్‌ను పంపింది. మెగా మూన్ రాకెట్ ఆర్టెమిస్ 1.. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం తెల్లవారుజామున నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ మూడు టెస్ట్ డమ్మీలను మోసుకెళ్లింది. చంద్రునిపైకి మళ్లీ ఆస్ట్రోనాట్లను పంపడానికిగానూ అమెరికా ఈ ప్రయోగం చేపట్టింది. ఇది 3 వారాలు కొనసాగనుంది. చంద్రునికి సమీపంలోని కక్ష్యలో ఖాళీ క్రూ క్యాప్సుల్‌ను రాకెట్ విడిచిపెట్టనుంది. డిసెంబర్లో ఈ క్యాప్సుల్ పసిఫిక్ మహాసముద్రంలో పడుతుంది. దీనికి నాసా ఆర్టెమిస్ లూనార్ ఎక్స్ ప్లోరేషన్ ప్రోగ్రాంగా పేరు పెట్టింది.
ప్రాజెక్ట్ అపోలోకు సీక్వెల్
1969 నుంచి 1972 మధ్య నాసా చేపట్టిన ప్రాజెక్ట్ అపోలోకు ఇది సీక్వెల్. అప్పట్లో 12 మంది ఆస్ట్రోనాట్స్ చంద్రునిపై నడిచారు. ప్రస్తుత ప్రయోగం ఒక ట్రయల్ రన్. దీని ఆధారంగా 2024లో చంద్రునిపైకి నలుగురు అస్ట్రోనాట్స్‌ను పంపాలని స్పేస్ ఏజెన్సీ భావిస్తోంది. 2025 ప్రారంభంలో మనుషులు చంద్రునిపై అడుగుపెడతారు. ఓరియన్ క్యాప్సుల్ లూనార్ ఆర్బిట్ వరకే ఆస్ట్రోనాట్స్ ను తీసుకెళుతుంది. చంద్రుని ఉపరితలంపైకి తీసుకెళ్లదు. లూనార్ ల్యాండింగ్ కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో నాసా ఒప్పందం చేసుకుంది.
అత్యంత శక్తివంతమైన రాకెట్
నాసా ఇప్పటి వరకు తయారు చేసిన రాకెట్లలో అత్యంత శక్తివంతమైనది ఈ స్పేస్ లాంచ్ సిస్టం(ఎస్ఎల్ఎస్). 322 అడుగుల ఎత్తుతో ఈ రాకెట్ ను నాసా నిర్మించింది. దీనిని స్పేస్ షటిల్‌గా లేదా భవిష్యత్‌లో మనుషులను చంద్రునిపైకి తీసుకెళ్లే స్పేస్ షిప్‌గా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నాటికి ఓరియన్ చంద్రుడిని చేరుకుంటుంది. ఈ ప్రయోగాని కి నాసా 4.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. చివరగా, చంద్రునిపై ఒక బేస్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి 2040ల ప్రారంభంలో మార్స్‌పైకి ఆస్ట్రోనాట్లను పంపాలనేది నాసా ప్లాన్. అయితే దీనికి అనేక అడ్డంకులు ఉన్నాయి.
ఎన్నో అడ్డంకుల తర్వాత..
ఈ మిషన్ కోసం నాసా ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తోంది. కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. తొలుత రాకెట్ నుంచి ఇంధనం లీక్ అవుతున్నట్టుగా గుర్తించారు. దీంతో ప్రయోగం వాయిదా పడింది. ఆ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా ఆగిపోయింది. ఆర్టెమిస్ 1 మూన్ మిషన్ లాంచ్ చేయడానికి ముందు కూడా కొన్ని సాంకేతిక లోపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. లోపాలను సరిచేసి ప్రయోగాన్ని విజయవంతం చేసినట్టు నాసా ట్విట్టర్లో ప్రకటించింది. ఈ ప్రయోగం చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. లాంచ్ సైట్ దగ్గరకే 15 వేల మంది వరకు వచ్చినట్టు అంచనా.