బాధ్యత మరిచిన రాష్ట్ర సర్కారు : ఎం. కోదండ రామ్

విభజన చట్టం హామీల సాధన, కృష్ణా జలాల్లో వాటా పొందడం, జాతీయ పార్టీ అవతారం ఎత్తి.. తెలంగాణ మోడల్​ను దేశమంతటా అమలు చేస్తామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్​ తెలంగాణ మోడల్ నిరంకుశ స్వభావాన్ని దేశ ప్రజలకు వివరించడం కోసం జనవరి 30 నుంచి ఫిబ్రవరి1 తేదీ వరకు ఢిల్లీకి వెళ్లినం. నిజానికి ఈ రెండు సమస్యలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆం ధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మామూలుగా ఏ విభజన చట్టమైనా రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఏర్పడిన రెండు కొత్త రాష్ట్రాలకు కావాల్సిన విభాగాలను ఏర్పాటు చేస్తుంది. ఆ పనితో పాటు రెండు రాష్ట్రాల సమాన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కొన్ని ప్రత్యేక పథకాలను ప్రతిపాదించింది. అయితే అసలు విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలోని 89 పబ్లిక్ రంగ సంస్థల విభజన కానీ,107 రాష్ట్ర స్థాయి సంస్థల విభజన కానీ పూర్తి కాలేదు. అందుకే ఆయా సంస్థలు పూర్తి స్థాయిలో పని చేయలేక పోతున్నాయి. ప్రభుత్వం ఈ విభజన పూర్తి చేయడానికి ఏమాత్రం చిత్తశుద్ధితో పని చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చుకోవాల్సిన విషయంగా కేంద్రం భావిస్తున్నది. అందుకని పబ్లిక్ రంగ సంస్థల, రాష్ట్ర స్థాయి సంస్థల విభజన ఎనిమిదేండ్లుగా పెండింగులోనే ఉన్నది.

విభజన చట్టంలో హామీలు

విభజన చట్టంలోని ఆర్టికల్ 93 ప్రకారం.. పదేండ్లలో రెండు రాష్ట్రాలు నిలకడైన అభివృద్ధి సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం13వ షెడ్యూల్ లో పేర్కొన్న చర్యలను తీసుకోవాలి. 13వ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీని, ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 94(1) రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి కోసం కేంద్రం పన్ను రాయితీలను, తదితర ప్రోత్సాహకాలను ఇచ్చి రెండు రాష్ట్రాల ఆర్థిక పురోగతికి చర్యలు తీసుకోవాలి.  ఆర్టికల్ 94(2)ను అనుసరించి రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తగిన సాయం చేయాలి. చట్టంలో పేర్కొన్న సౌకర్యాలు సమకూరితే తెలంగాణలో  హైదరాబాద్ తో పాటుగా ఇతర జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికీ తెలంగాణ అభివృద్ధి హైదరాబాద్, ఆ చుట్టు పక్కనే  కేంద్రీకృతమైంది. ప్రభుత్వం కీలక ప్రమాణంగా చూస్తున్న తలసరి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే 17 జిల్లాల తలసరి ఆదాయం లక్ష రూపాయల లోపే ఉన్నది. కానీ హైదరాబాద్ తలసరి ఆదాయం రూ. 2,22,371 కాగా, రంగా రెడ్డి జిల్లా తలసరి ఆదాయం 4,18,964 రూపాయలు. వ్యత్యాసం ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు. ఈ భేదాలు అంతరించాలంటే విభజన చట్టంలో హామీ ఇచ్చిన అభివృద్ధి, సహాయక, ప్రోత్సాహక చర్యలను తెలంగాణ ప్రభుత్వం సాధించాల్సి ఉంది. 

కృష్ణా నదీ జలాల వాటా దక్కలేదు  

కృష్ణా నదీ జలాల పంపకాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే ప్రదర్శించింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఆంధ్రా పాలకులు తెలంగాణకు కృష్ణా నదిలో న్యాయమైన వాటా ఇవ్వలేదు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు కృష్ణా నది నుంచి నీటిని పొందలేక పోయాయి. మరోవైపు ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువులు శిథిలమై పోయాయి. తాగు, సాగు నీటి అవసరాలకు పూర్తిగా భూగర్భ జలాల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ నీళ్లు ఇంకిపోయిన కారణంగా మహబూబ్ నగర్ వలసల జిల్లాగా, నల్గొండ ఫ్లోరోసిస్ బాధిత జిల్లాగా మారాయి.  రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయమే కుప్ప కూలిపోయింది. ఈ పరిస్థితిలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో బలమైన జలసాధన ఉద్యమాలు జరిగాయి. ఇవి చివరకు రాష్ట్ర సాధన ఉద్యమాలుగా పరిణమించాయి. అందుకే తెలంగాణ ఉద్యమాన్ని జల సాధన ఉద్యమానికి మరో రూపంగానే చూడాలి. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు కావస్తున్నా ఇప్పటికీ మనకు కృష్ణా నదిలో వాటా దక్క లేదు. తాత్కాలిక ఏర్పాటుగా మనకు 299 టీఎంసీలే ఇచ్చారు. విచిత్రమేమిటంటే చెరువుల్లో వాడుకుంటున్న108 టీఎంసీల నీళ్లను కూడా కృష్ణా నది నుంచి తెలంగాణకు దక్కిన వాటాగానే  చూపిస్తున్నారు. వాస్తవానికి, మన చెరువులకు వాన నీళ్లు, ఆంధ్రాకు నది నీళ్లు దక్కుతున్నాయి. హైదరాబాద్, చెన్నై నగరాలకు ఇస్తున్న నీటిని, నదిలో ఆవిరయ్యే నీటిలో మన వాటాను లెక్కగడితే అది మరో18 టీఎంసీలు ఉంటుంది. ఇవన్నీ పోను మనకు నికరంగా నది నుంచి లెక్కల ప్రకారం ఇస్తున్న నీళ్లు కేవలం171.84 టీఎంసీలే. ఈ నీటినీ కూడా మనం పొందడం   లేదు. రకరకాల కారణాలతో వాస్తవంగా అందుతున్న నీళ్లు తగ్గిపోయాయి. మనకు దక్కుతున్న నీళ్లు140 టీఎంసీలు మించవేమో. ఇదీ వాస్తవం. 

కృష్ణా గెజిట్ సమాధానం కాదు

నీటి పంపిణీ జరగకుండా కృష్ణా నదిపై తెలంగాణ మొదలుపెట్టిన ఎడమ గట్టు కాలువ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు- ఎత్తిపోతల పథకం, డిండి పథకాలకు నీటి కేటాయింపులు సాధ్యం కాదు. వరద నీటిపై ఆధారపడి ఈ ప్రాజెక్టులను కడుతున్నాం. అందుకే అనుమతులు లేవు. అనుమతులు లేని ప్రాజెక్టులన్నింటినీ ఆపాలని కేంద్రం 2021 జులై 15న ఒక గెజిట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రా తనకు కోటాకు మించి దక్కిన నీళ్లను వాడుకునే అవకాశాన్ని పొందింది. దీంతో సుమారు 28 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం అవకాశాన్ని కోల్పోయాం. మరోవైపు ఆంధ్రా–-తెలంగాణల మధ్య ఉన్న వ్యత్యాసాలను పెంచే రీతిలో ఆంధ్ర ప్రభుత్వం పోతిరెడ్డి పాడు తూము వెడల్పు చేసి కృష్ణా నది నుంచి నీళ్లను మళ్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఇది పూర్తయితే తెలంగాణ నీళ్లు పొందే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతుంది. ఇనీళ్లలో వాటాను సాధించాల్సిన సమయంలో కృష్ణ-, గోదావరి అనుసంధానం చర్చను ముందుకు తెచ్చి అసలు విషయాన్ని పక్కకు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా ఈ విషయాలను ప్రస్తావిస్తున్నాను. నీళ్ల పంపకంలో, పెండింగు ప్రాజెక్టుల పర్మిషన్ల విషయంలో రాష్ట్రం నుంచి ఏ సహకారం లేదని కేంద్రం చెబుతున్నది. ఉదాహరణకు రాష్ట్రం ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్ లను సమర్పించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం క్రియా శీలకంగా ఉంటే ఈ విమర్శలకు అవకాశం కలిగేది కాదు. రాష్ట్ర సర్కారు నదీ జలాల వాటా కోసం ఆశించిన స్థాయిలో ప్రయత్నం చేయడం లేదు. అందుకే మేమే ఢిల్లీకి వెళ్లి కృష్ణా నది నీటి వాటా కోసం కేంద్రాన్ని డిమాండ్​చేశాం. కేంద్ర మంత్రిని కలిసి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాం.

మళ్లీ ప్రజలే కొట్లాడాలి

తెలంగాణ వస్తే మన కోసం పని చేసే ప్రభుత్వం వస్తుందని, మన తరఫున కొట్లాడి నీళ్లు తెస్తుందని ఆశించినం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ చాలా ఏండ్లు సఖ్యతగానే ఉన్నది. కానీ నీళ్లు సాధించే విషయంలో కృషి శూన్యం. తెలంగాణ కోసం కొట్లాడినట్టు ఇప్పుడు నీళ్ల కోసం కొట్లాడే బాధ్యత మళ్లీ ప్రజల నెత్తిన పడింది. ప్రజలుగా మనం  న్యాయ, ఇంజనీరింగు అంశాల పైన సమగ్ర సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి అటు కేంద్రంపై, ఇటు రాష్ట్రం పై ఒత్తిడి పెట్టాల్సి ఉన్నది. అందుకోసం అధ్యయనం చేయడమే కాదు, ఆందోళనలకు సిద్ధం కావాల్సి ఉన్నది.

- ఎం. కోదండ రామ్, అధ్యక్షులు, తెలంగాణ జన సమితి