నేత్ర పర్వంగా ..ఎదుర్కోలు ఉత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు :  పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  బుధవారం ఉదయం అర్చకులు భూదేవీ సమేతుడైన నారసింహుడిని సింహవాహనంపై ప్రతిష్ఠించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను అశ్వవాహనంపై ఊరేగించారు. తర్వాత ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో  ఎదుర్కోలు ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల సమయంలో ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్ఠింపజేసి 2 గంటల పాటు ఈ క్రతువును జరిపారు.

స్వామివారి తరఫున ఆలయ ఈవో రామకృష్ణారావు, అమ్మవారి తరఫున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి  పెద్దలుగా వ్యవహరించారు.  అనంతరం వేదపండితులు లక్ష్మీనరసింహుడి కల్యాణానికి గురువారం రాత్రి 8 గంటలను మూహుర్తం నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఏఈవో గజవెల్లి రమేశ్ బాబు, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, శ్రీకాంత్ ఆలయ ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.