యాదగిరీశుడి..బ్రహ్మోత్సవాలు షురూ..

  •     స్వస్తివాచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనంతో శ్రీకారం
  •     ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
  •     పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
  •     నేడు ధ్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనం, విశ్వక్సేన పూజలతో ఆలయ అర్చకులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.  ఆరంభ పూజల్లో  పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గీత దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి స్వస్తివాచన పూజను  ప్రారంభించారు. తర్వాత  స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వీరేశం, మందల సామెల్, యాదాద్రి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,  టెంపుల్ చైర్మన్ నర్సింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

11 రోజుల పాటు ఉత్సవాలు

బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 21 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజైన సోమవారం ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా తెప్పించిన పూలు, వజ్రవైఢూర్యాలు, ముత్యాల హారాలు, బంగారు ఆభరణాలతో అలంకరిచారు. తర్వాత ఆలయ ముఖ మండపంలో లక్ష్మీనరసింహులను బంగారు వేదికపై అధిష్ఠింపజేసి స్వస్తివాచనం, పుణ్యాహవచనం పూజలు నిర్వహించారు.  తర్వాత పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం  విశ్వశాంతి, లోకకల్యాణం కోసం వేదమంత్రాలు పఠిస్తూ విష్వక్సేన ఆరాధన చేశారు.  పుణ్యాహవచనంలో భాగంగా పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసి

గర్భగుడిలో ఉన్న స్వయంభూ లక్ష్మీనరసింహస్వామికి కంకణధారణ చేశారు. తర్వాత ముఖ మండపంలో అధిష్ఠింపజేసిన ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేశారు.  ఇక సాయంత్రం ప్రధానాలయంలో నిత్య ఆరాధనల అనంతరం మృత్సంగ్రహణం, అంకురారోపణం ఉత్సవాలు కన్నులపండువగా జరిపారు.   ఉత్సవాల్లో రెండో రోజై  మంగళవారం  ధ్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం కైంకర్యాలను నిర్వహించనున్నారు.

సీఎం రేవంత్‌‌‌‌కు ఘనంగా స్వాగతం

సీఎం హోదాలో తొలిసారి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ త్రితల గోపుర తూర్పు ద్వారం వద్ద ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఆలయ సంప్రదాయ రీతిలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత సీఎం సతీమణి గీతతో కలిసి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.   అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు.

దర్శనం అనంతరం సీఎం దంపతులతో పాటు  డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సురేఖ, కోమటిరెడ్డి, ఉత్తమ్ కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి నారసింహుడి విగ్రహాన్ని  బహూకరించగా.. ఆలయ ఈవో రామకృష్ణారావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ ఆఫీసర్లు సీఎంకు స్వామివారి ఫొటోను అందజేశారు. తర్వాత బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.