- డార్క్ వెబ్‌లో ఆర్డర్.. క్రిప్టో కరెన్సీలో పేమెంట్
- సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు.. టీన్యాబ్,
- ఖమ్మం పోలీసుల జాయింట్ ఆపరేషన్
ఖమ్మం, వెలుగు: డార్క్ వెబ్ ద్వారా జరుగుతున్న డ్రగ్స్ దందాపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘా నెట్టింది. ఖమ్మం పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టి, ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను అరెస్టు చేసింది. ఈ కేసు వివరాలను టీన్యాబ్ అధికారులు శనివారం వెల్లడించారు. ఖమ్మం పట్టణంలోని రోటరీ నగర్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గత నెల 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేశాడు. అతడు క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయగా, అవి అస్సాంలో ఉన్న వ్యక్తికి వెళ్లాయి. డ్రగ్ సప్లయర్ ఆన్లైన్ ద్వారానే కన్ సైన్మెంట్ నెంబర్‌ను సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు షేర్ చేశాడు.
అయితే డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసినట్టు గుర్తించిన టీన్యాబ్ అధికారులు.. నిందితుడిని పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్ సప్లయర్ నుంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు వచ్చిన కన్ సైన్ మెంట్ నెంబర్ ను ట్రాక్ చేశారు. ఈ నెల 8న స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ డెలివరీ అయిన టైమ్ లోనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పట్టుకున్నారు. ఆ స్పీడ్ పోస్ట్ అస్సాంలోని సిల్పుఖురి నుంచి వచ్చిందని, అందులో హెరాయిన్ ఉందని పోలీసులు తెలిపారు.
ప్లాస్టిక్ కవర్‌లో ప్యాకింగ్..
ఓ ప్లాస్టిక్ కవర్ లో డ్రగ్స్ ఉంచి, జిప్ లాక్ చేశారు. న్యూస్ పేపర్ లో డ్రగ్స్ పెట్టి, దానికి ప్లాస్టర్ అంటించారు. ఆ పార్సిల్ ను స్పీడ్ పోస్ట్ చేశారు. రెండున్నర గ్రాముల బరువున్న ఈ హెరాయిన్ విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి వివరాలను రహస్యంగా ఉంచారు. అతనికి, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రగ్స్‌కు బానిస కావడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నారు. ఈ డ్రగ్స్ దందాలో చైన్ లింక్ ద్వారా రహస్యంగా పని చేస్తున్నోళ్ల వివరాలు సేకరిస్తున్నారు. చైన్ స్టిస్టమ్ ను బ్రేక్ చేసేందుకు డార్క్‌వెబ్‌పై నిఘా పెట్టారు.
మీకు తెలిస్తే చెప్పండి..
ఇటీవల కాలంలో అనేక మంది యువతీ- యువకులు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ కు అలవాటు కావడంపై టీన్యాబ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే 87126 71111 నంబర్ కు లేదా టోల్ ఫ్రీ నెంబర్1908కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.