టికెట్ ధరలపై ప్రభుత్వానికి అధికారం  ఉంది

టికెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు.. టికెట్ రేట్లు తగ్గించే అవకాశం ఎపీ ప్రభుత్వానికి ఉంటుందన్నారు  ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.  సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు. ఈ సందర్భంగా  ఏపీలో టికెట్ల ధరల తగ్గింపుపై హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తమ్మారెడ్డి మాట్లాడారు. సినిమా వాళ్లు కష్టపడి డబ్బు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదన్నారు. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత... ఇప్పుడెంత అని ఎమ్మెల్యే నల్లపరెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. సినిమా కోసం వందల మంది కష్టపడుతారని... కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నామని అన్నారు. కానీ మీ లాగా రూపాయి పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు దోచుకోవడం లేదన్నారు. తమను విమర్శించే ముందు  మీ సంగతి మీరు చూసుకోవాలని సూచించారు. చీప్‌గా దొరికామని ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దన్నారు.

సినిమా రంగానికి కులం, మతం ఆపాదించడం సరికాదని అన్నారు. కుల ప్రస్తావన లేకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలిచ్చే ఒకే ఒక్క రంగం సినీ రంగమేనని పేర్కొన్నారు. సినిమా వాళ్లకు దమ్ము, ధైర్యం ఉన్నాయని... తామెవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సినిమా టికెట్ ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. అయితే ప్రొడక్ట్‌కు తామే ధరను నిర్ణయించే హక్కు తమకు కూడా ఉందని అన్నారు.