భద్రాచలం, వెలుగు: గోదావరి వెంట చెట్టు, పుట్టలను నమ్ముకొని బతికిన వేలాది మంది గిరిజన, గిరిజనేతర కుటుంబాలను పోలవరం ప్రాజెక్టు పేరుతో వెళ్లగొట్టేందుకు ఆంధ్రా సర్కారు సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, ఉపాధి కోసం 2 ఎకరాల భూమి, ఆర్‌అండ్‌ఆర్ కింద పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు పనులు మొదలుపెడ్తామన్న ప్రభుత్వం అవేం లేకుండానే పొగపెడ్తోంది. కాఫర్‌డ్యామ్‌తో గోదారికి అడ్డు కట్ట వేసి మెయిన్ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేస్తోంది. దీంతో గోదావరి బ్యాక్ వాటర్ గ్రామాల్లోకి చేరుతుండటంతో నిర్వాసితులు, ఆదివాసులు ఆగమాగమవుతున్నారు. వీళ్లలో తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన 5 మండలాల్లోని 44 గ్రామాలకు చెందిన దాదాపు 10 వేల కుటుంబాలు ఉన్నాయి. ఊర్లు మునుగుతుండటంతో కొందరు తమకు కేటాయించిన పునరావాస కాలనీలకు వెళ్లినా అక్కడ తాత్కాలిక షెడ్లు తప్ప వసతుల్లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ నెల చివరికల్లా తరలించే ప్లాన్
పోలవరం ప్రాజెక్టు కింద 373 గ్రామాల్లోని1.06 లక్షల కుటుంబాలకు నిలువనీడ లేకుండా పోతోంది. ఇప్పటికిప్పుడు పనులు స్టార్ట్ చేయడానికని 41.15 మీటర్ల కాంటూర్ లెవల్ వరకు ముంపు గ్రామాల్లోని 17,269 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రవిభజన సమయంలో భద్రాచలం ఏజెన్సీ నుంచి ఆంధ్రాలో కలిసిన 5 మండలాల్లోని 44 గ్రామాలకు చెందిన 9,459 కుటుంబాలు ఇందులో ఉన్నాయి. ఈ కుటుంబాలను ఆగస్టు కల్లా విడతల వారీగా పునరావాస కాలనీలకు తరలిస్తామని ఏపీ షెడ్యూల్ ప్రకటించింది. కానీ ఇప్పటికీ అఫీషియల్‌గా ఏ కుటుంబాన్నీ తరలించలేదు. తాజాగా సర్కారు ఆదేశాలతో ఈ నెల చివరికల్లా విలీన మండలాల్లోని ముంపు బాధితులను తరలించేందుకు రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ ఆఫీసర్లు జాయింట్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈలోపే కాఫర్ డ్యామ్ కారణంగా వల్ల గ్రామాల్లోకి నీళ్లు రావడంతో దిక్కుతోచని నిర్వాసితులు.. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం, వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము తదితర గ్రామాల నుంచి వాళ్లకు కేటాయించిన పునరావాస కాలనీలకు వెళ్లాల్సి వచ్చింది.
రూ.10 లక్షల పరిహారం ఇస్తలే..
నిర్వాసితుల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 6.86 లక్షలు.. నాన్ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.6.36 లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. ఏపీ సర్కారు మరో అడుగు ముందుకేసి దాన్ని రూ.10 లక్షలకు పెంచి ఇస్తామని చెప్పింది. ఈ లెక్కన విలీన మండలాల్లోని నిర్వాసితులకే సుమారు రూ.946 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఏపీ తూర్పుగోదావరి జిల్లా వీఆర్‍పురం మండలం ఇప్పూరు, కల్తనూరు, భీమవరం గ్రామాల్లోని 188 కుటుంబాలకు రూ.12.89 కోట్లే చెల్లించింది. అది కూడా కేంద్రం ప్రకటించినట్లు ఎస్సీ, ఎస్టీ ఫ్యామిలీలకు రూ. 6.86 లక్షలు, మిగిలిన కులాల వారికి రూ. 6.36 లక్షల చొప్పున ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. మిగిలిన కుటుంబాలు పైసా పరిహారం అందుకోకుండానే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
కాలనీల్లో కనీస వసతుల్లేవ్
పోలవరం నిర్వాసితుల కోసం 73 కాలనీలను నిర్మించాలని ఏపీ నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు 26 మాత్రమే కంప్లీట్ చేసింది. అక్కడ కూడా తాత్కాలిక షెడ్లు తప్ప కరెంటు, వేరే వసతులేం లేవు. కాఫర్ డ్యాం కడుతున్నప్పుడే కుక్కునూరు మండలం గొమ్ముగూడెం గ్రామానికి చెందిన 231 మంది నిర్వాసితులు రాయికుంట పునరావాస కాలనీకి తరలివెళ్లారు. ఆ తర్వాత వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము నుంచి కూడా ఖాళీ చేసి వెళ్లారు. తీరా అక్కడికెళ్లి వసతులేం లేకపోవడం చూసి నివ్వెరపోయారు. చేసేదేం లేక అక్కడే ఉంటూ కష్టాలు పడుతున్నారు. టార్పాలిన్లు, లైట్లు ఇస్తామని గత నెలలో చెప్పిన ఆఫీసర్లు ఇప్పటికీ ఇవ్వలేదు. కొత్త ప్లేస్‌లో ఉపాధి అవకాశాలూ లేక ఇబ్బంది పడుతున్నారు. గొమ్ముగూడెం నిర్వాసితులకు ఉపాధి పథకం కింద పనులు కల్పించాలని పశ్చిమగోదావరి కలెక్టర్ ఆదేశించినా స్థానిక ఆఫీసర్లు కల్పించలేదు. సర్కారు నుంచి పైసా సాయం లేదు. రాష్ట్రానికి చెందిన ఓ మిషనరీ వాళ్లు రూ.వెయ్యి విలువైన నిత్యావసర సరుకులను ఇస్తే వాటితో కాలం వెళ్లదీస్తున్నారు. పునరావాసం కింద పక్కా భవనాల నిర్మాణం ఆలస్యం కావడంతో తూర్పుగోదావరి జిల్లా (విలీన) వీఆర్ పురం మండలం రేఖపల్లిలో రూ.5 కోట్లతో టెంపరరీ షెడ్లు నిర్మిస్తున్నారు. పశువుల కొట్టాల్లా ఉన్న వీటిల్లో ఎలా ఉండాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. కాలనీల్లో ఇండ్లు, మౌలిక వసతులను పూర్తి చేసి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చాకే తమను ఖాళీ చేయించాలని, అప్పటిదాక పోలవరం పనులు ఆపేయాలని ఏపీ సర్కారును డిమాండ్ చేస్తున్నారు.
ఎట్ల బతకాలె?
గిరిజనులమంతా పొద్దున లేస్తే అడవికి పోయి కొండ చీపుర్లు, కుంకుళ్లు, దుంపలు, తేనె తెచ్చి అమ్ముకుంటం. అలాంటి మమ్మల్ని పునరావాస కాలనీలకు తీసుకుపోతే ఎట్ల బతకాలె. మాకేం ఉపాధి చూపిస్తారో ఇప్పటికీ చెప్పలే. ఊరు కాని ఊరు పోయి ఎట్ల బతకాలె? అందుకే కొండలెక్కి గుడిసెలు వేసుకుంటున్నం.
- బొప్పెన కిరణ్, నిర్వాసితుడు
అన్నీ తప్పుడు లెక్కలే
పోలవరంపై ఆంధ్రా సర్కారువన్నీ దొంగ లెక్కలే. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‍గఢ్ రాష్ట్రాల్లో 800 గ్రామాలు, 16 లక్షల ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నాయి. 8 లక్షల మంది ఆదివాసీలే నిర్వాసితులవుతున్నారు. భద్రాచలం రామాలయమూ మునుగుతది. సర్కారేమో కాకిలెక్కలు చెబుతూ పని చేసుకుపోతోంది. అందుకే మేం దశలవారీగా పోరాటం చేస్తున్నం. ఈ మధ్యే ఢిల్లీ పోయి నిర్వాసితుల గోడు వినిపించినం. ముంపు తీవ్రత ఎక్కువుంటే తక్కువ చేసి చూపుతున్నరు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలోనూ అన్యాయమే జరిగింది. కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని గిరిజనులకు రూ.6.86 లక్షలే ఇస్తున్నరు. ఈ డబ్బు కూడా ఇప్పటివరకు 188 కుటుంబాలకే ఇచ్చారు. - చందా లింగయ్య దొర, మాజీ జెడ్పీ చైర్మన్