నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారుల నిలదీత
వెనుదిరిగిన ఆఫీసర్లు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని దరఖాస్తుదారులు మండిపడ్డారు. సొంత ఇండ్లు ఉన్నా కూడా...కిరాయి ఇండ్లలో ఉన్నట్లు చూపించి అనర్హులకు కేటాయించారని ఆరోపించారు. గట్టిగా నిలదీయడంతో అధికారులు లేచి వెళ్లిపోయారు. సోమవారం నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దనూరులోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు.
కొందరు లబ్ధిదారులకు సొంత ఇండ్లు ఉన్నప్పటికీ కిరాయి ఇండ్లల్లో ఉన్నట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు వేరే గ్రామాల్లో ఉంటున్నా పెద్ద ముద్దునూరులో ఉన్నట్లు చూపించారని ఆరోపించారు. దీంతో స్పందించిన అధికారులు...అభ్యంతరాలు ఏమైనా ఉంటే రాసి ఇవ్వాలని వారం రోజుల్లో ఎంక్వయిరీ చేస్తామని హామీ ఇచ్చారు. అయినా గ్రామస్తులు వినకపోవడంతో అధికారులు లేచి వెళ్లిపోయారు. ఆర్డీఓ నాగలక్ష్మి, తహసీల్దార్ భాస్కర్, జడ్పీటీసీ శ్రీశైలం, ఎంపీటీసీ రమణ, ఎంపీడీవో కోటేశ్వర్ పాల్గొన్నారు.