కరీంనగర్ లో ఇటీవల నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లే అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న కరీంనగర్ కాంగ్రెస్ నగర శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లేదంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రోడ్డును పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు రాష్ర్ట ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
కుంగిపోయి పగుళ్లుబారి ఉన్న రోడ్డును పరిశీలించారు. పగుళ్లు ఏర్పడిన అప్రోచ్ రోడ్డు ఫోటోలు, వీడియోలు తీసి మీడియాకు విడుదల చేశారు. నెల రోజులకే అప్రోచ్ రోడ్డు కుంగిపోయిందని, పగిలిన సైడ్ వాల్స్ కనిపించకుండా కాంట్రాక్టర్ కవర్లు కప్పి ఉంచారని ఆరోపించారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్లే రోడ్డు కుంగిపోయిందని..ఈ విషయంలో విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చెప్పారు. వాహనాలు వెళ్తుంటే రోడ్డు ఇంకా కుంగుతోందని టిప్పర్లను అడ్డుపెట్టి కాపలాగా పోలీసులను పెట్టారని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ ఘటనకు మంత్రి గంగుల కమలాకర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ నగరంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నాణ్యత నాలుగు రోజులకే తేటతేల్లమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని మానేరు నదిపై నిర్మించామని రాష్ర్ట ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా.. ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలోనే క్వాలిటీ బయటపడిందంటున్నారు.