- ఫండ్స్‌లేవని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
- కేంద్రం నిర్మించాలని నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీల వినతి
- ఆర్మూర్ నుంచి ఉత్తరాదికి భారీగా విత్తనాల రవాణా
- రవాణ సౌలత్ లేక రైతుల ఇబ్బందులు
నిజామాబాద్, వెలుగు: ఆర్మూర్- ఆదిలాబాద్ జిల్లా రైల్వే లైన్ నిర్మాణం12 ఏండ్లుగా పెండింగ్ పడుతూనే వస్తోంది. జిల్లా రైతుల డిమాండ్ మేరకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంక్షన్అయిన రైల్వే లైన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. 2016–17 బడ్జెట్ సమయంలో ప్రపోజల్స్ పంపినా.. వాటా విషయంలో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రైల్వే లైన్ పూర్తి చేయాలని రైల్వే మంత్రికి ఇటీవల వినతి పత్రాలు ఇచ్చారు. దీంతో ‘ఇకనైనా రైల్వే ట్రాక్‌కు మోక్షం కలిగేనా?’ అని జిల్లా రైతులు ఎదురు చూస్తున్నారు.
అగ్రి మార్కెటింగ్ కు రైల్వే లైన్..
విత్తన ఉత్పత్తులకు పేరుగాంచిన ఆర్మూర్‌లో రైల్వే లైన్లు విస్తరించాలని 30 ఏండ్లుగా డిమాండ్ ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బాగా పండే పసుపు, సజ్జ, ఎర్ర జొన్న , మొక్క జొన్న , సోయాబిన్ పంటలను ఉత్తరాది ప్రాంతాలకు తరలిస్తారు. నిజామాబాద్, హైదరాబాద్ మీదుగా రైల్వే రవాణ చార్జీల భారం ఎక్కువవుతుండడంతో ఇక్కడి నుంచి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 136 కిలోమీటర్లు రూ. 1,050 కోట్ల బడ్జెట్ తో రైల్వేలైన్ కు కేంద్రానికి ప్రపోజల్స్ పంపింది. దీంతో కేంద్ర రైల్వేశాఖ ఆర్మూర్– ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు సర్వే చేసింది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఘాట్ ఏరియాతో బడ్జెట్ డబుల్ అవుతుందని రైల్వేశాఖకు రిపోర్టు ఇచ్చింది.
అడుగేసి.. వెనక్కి తగ్గి..
2016–-- 17 కేంద్ర బడ్జెట్ కు ముందు సీఎం కేసీఆర్ సూచనలతో అప్పట్లో రాష్ట్ర మంత్రులుగా ఉన్న జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ తో కలిసి నాటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభును కలిశారు. -ఆర్మూర్- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణంలో రాష్ట్ర వాటా కింద 50 శాతం నిధులను భరిస్తామని తెలిపారు. దీంతో అప్పటి కేంద్ర బడ్జెట్లో క్యాస్టెల్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ కింద శాంక్షన్ చేసింది. 198 కిలోమీటర్ల పరిధిలో రూ.2,720 కోట్ల అంచనా వ్యయంతో ఈ లైన్‌ను ప్రతి పాదించింది. ఇందులో రాష్ట్రం వాటా 50 శాతం అంటే.. సుమారుగా రూ.1380 కోట్లు భరించాలి. ఆ తర్వాత కాలంలో రెండు ప్రభుత్వాలు దీని ఊసే ఎత్తలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ఎంపీ అరవింద్ ధర్మపురి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు జిల్లా ప్రజల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం వందశాతం ఫండ్స్‌తో రైల్వే లైన్నిర్మించాలని రైల్వే మంత్రికి ఇటీవల వినతి పత్రం ఇచ్చారు. బడ్జెట్ లో నిధు లు మంజూరు
లభిస్తుందా అనేది చూడాల్సిందే.
ఉద్దేశపూర్వకంగానే ప్రపోజల్స్ పంపుతలేరు..
రాష్ట్రంలో రైల్వే లైన్ల విస్తరణలో కేసీఆర్ సర్కార్ఫెయిలయ్యింది. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనని ఉద్దేశపూర్వకంగానే ప్రపోజల్స్ పంపుతలేరు. రవాణ సౌకర్యం లేక ఆర్మూర్రైతులు చాలా నష్టపోతున్నారు. ఆర్మూర్– ఆదిలాబాద్ రైల్వే లైన్ వల్ల విత్తనోత్పత్తి పంటలకు రేటు వచ్చి రైతులు లాభపడుతారు.
- పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు
రైల్వే బడ్జెట్ లో ప్రాజెక్ లపై వివక్ష
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రాజెక్టులపై వివక్ష కొనసాగుతోంది. ఆర్మూర్– ఆదిలాబాద్ రైల్వే లైన్‌ను కేంద్రమే నిర్లక్ష్యం చేస్తోంది. బీఆర్ఎస్కు లబ్ధి జరుగుతుందని ఫండ్స్కేటాయించడం లేదు. ఈ బడ్జెట్లో ఫండ్స్కేటాయించి రైల్వే లైన్నిర్మించాలి.
- మార గంగారెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్