పాక్ చొరబాటుదారులను మట్టుబెట్టిన సైన్యం పూంఛ్ సరిహద్దు వద్ద ఏడుగురి కాల్చివేత

పాక్ చొరబాటుదారులను మట్టుబెట్టిన సైన్యం పూంఛ్ సరిహద్దు వద్ద ఏడుగురి కాల్చివేత

శ్రీనగర్: పాకిస్తాన్ కు చెందిన ఏడుగురు చొరబాటుదారులు జమ్మూకాశ్మీర్‌‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌‌లో ఉన్న నియంత్రణ రేఖ(ఎల్వోసీ)ను దాటి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కదలికలను పసిగట్టిన ఇండియన్ ఆర్మీ.. వారిపై మెరుపు వేగంతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో  ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. 

అందులో ముగ్గురు పాక్ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖ(ఎల్వోసీ)ను దాటి భారత ఫార్వర్డ్ పోస్ట్ పై దాడికి యత్నించిన పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీమ్(బీఏటీ)పై ఇండియన్ ఆర్మీ మెరుపుదాడికి పాల్పడిందని తెలిపాయి. మృతుల్లో ముగ్గురు పాకిస్తానీ సైనికులు ఉన్నట్లు పేర్కొన్నాయి. మిగతా వారు అల్-బదర్ గ్రూపుకు చెందిన టెర్రరిస్టులై ఉంటారని వివరించాయి. కాశ్మీర్ సహా సమస్యలన్నింటిని భారత్ తో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

కాగా.. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి టెర్రర్ గ్రూపులు ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో  కాశ్మీర్ సాలిడారిటీ డే(కశ్మీర్ సంఘీభావ దినం) పేరుతో సదస్సు నిర్వహించాయి. దీనికి హమాస్ కూడా హాజరైనట్లు ప్రచారం జరిగింది. దీంతో భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూకాశ్మీర్, లడఖ్ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగంగా ఉంటాయని భారతదేశం పదే పదే చెబుతోంది. శాంతియుత వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్‌‌తో చర్చలు సాధ్యమని స్పష్టం చేసింది.