ట్రంప్, కమల​ ఫోన్లపై చైనా హ్యాకర్ల కన్ను

ట్రంప్, కమల​ ఫోన్లపై చైనా హ్యాకర్ల కన్ను

న్యూయార్క్​:  అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో పది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటు రిపబ్లికన్, ఇటు డెమోక్రటిక్​ క్యాండిడేట్లు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇదే అదనుగా చూసుకొని చైనా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. వీరి ఫోన్ ​కమ్యూనికేషన్లే టార్గెట్​గా హ్యాకింగ్​కు  పాల్పడుతున్నారు. వీరి ఫోన్ల డేటాను దొంగిలిస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. డొనాల్డ్​ ట్రంప్​, కమలా హారిస్​కు సంబంధించిన ఫోన్ల వెరిజోన్​ సిస్టమ్​లోకి ప్రవేశించి డేటాను దొంగిలించేందుకు యత్నిస్తున్నట్టు కథనం పేర్కొన్నది. 

ట్రంప్, హారిస్​తోపాటు వీరి రన్నింగ్​ మేట్స్​ జేడీ వాన్స్​,  టిమ్​ వాజ్​​ ఫోన్లను కూడా హ్యాక్​ చేస్తున్నట్టు తెలిపింది. ఎన్నికల క్యాంపెయినింగ్​కు సంబంధించిన డేటాను దొంగిలిస్తున్నట్టు పేర్కొన్నది. అయితే, ఎలాంటి డేటాను వారు తస్కరించారో తెలుసుకునేందుకు పరిశోధన బృందం పని చేస్తున్నదని వెల్లడించింది. ఈ కథనంపై ఎఫ్‌‌బీఐ, సైబర్‌‌ సెక్యూరిటీ ఏజెన్సీ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాయి. 

హ్యాకింగ్ పై స్పందించని ట్రంప్, హారిస్ ​ఎలక్షన్​ క్యాంపెయిన్​ టీమ్ లు

ట్రంప్, వాన్స్​ ఫోన్లు టార్గెట్​అయినట్టు ట్రంప్ క్యాంపెయిన్ ఇప్పటివరకూ​ ధ్రువీకరించలేదు. అయితే, ట్రంప్​ గెలవకుండా యూఎస్​ మౌలిక సదుపాయాలపై దాడి చేసేలా ఇరాన్, చైనాను వైస్​ ప్రెసిడెంట్​ కమలా హారిస్​ ప్రోత్సహించారని రిపబ్లికన్ ​పార్టీ క్యాంపెయిన్​ కమ్యూనికేషన్​ డైరెక్టర్  స్టీవెన్​ చియుంగ్​ ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఈ హ్యాకింగ్​పై అటు హారిస్​ టీం కూడా స్పందించలేదు. ఇంటెలిజెన్స్​ సమచారాన్ని సేకరించేందుకు అమెరికా టెలీకమ్యూనికేషన్​ ప్రొవైడర్లను విదేశీ హ్యాకర్లు టార్గెట్​ చేస్తున్నట్టు తమకు తెలుసని, ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీల దృష్టికి తీసుకెళ్లామని వెరిజోన్​ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్‌‌ ముఠా ‘సాల్ట్‌‌ టైఫూన్‌‌’ ఈ హ్యాకింగ్‌‌కు పాల్పడి ఉంటుందని సైబర్‌‌ సెక్యూరిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికా ఎన్నికల్లో మేం జోక్యం చేసుకోం: చైనా

సైబర్​ అటాక్స్​, సైబర్​ దొంగతనాలను చైనా వ్యతిరేకిస్తుందని, వాటిపై పోరాడుతుందని వాషింగ్టన్​లోని చైనా ఎంబసీ పేర్కొన్నది. ‘ప్రెసిడెంట్​ ఎన్నికలు అమెరికా అంతర్గత వ్యవహారం. అందులో చైనా జోక్యం చేసుకోదు” అని ఎంబసీ స్పోక్స్​ పర్సన్​ స్పష్టం చేశారు.