ఒక రోజులో ఒక ప్రదేశానికి సంబంధించిన భౌతిక అంశాలైన పీడనం, ఉష్ణోగ్రత, వర్షపాతం, పవనాల పరిస్థితిని వాతావరణ పరిస్థితి అంటారు. వాతావరణం అనేక పొరలను కలిగి ఉంటుంది. ప్రతి పొరకు ధర్మాల్లో అనేక తేడాలుంటాయి. ఈ తేడాలు ఒక పొర నుంచి ఇంకొక పొరకు పోయే కొద్దీ క్రమంగా మారుతూ ఉంటాయి. పొరల మధ్య కచ్చితమైన సరిహద్దు ఉండక అతిపాతం చెంది ఉంటాయి. ప్రతి పొరలోనూ భౌతిక, రసాయనిక ధర్మాలు తేడాలు ఉండి క్రమంగా మారుతూ ఉంటాయి. ఎత్తుకు పోయే కొలది గురుత్వాకర్షణ శక్తి తగ్గడం వల్ల బరువైనవాయువుల శాతం తగ్గి తేలికైన వాయువుల శాతం పెరగడం వల్ల వాతావరణం లక్షణాలు, ధర్మాల్లో వ్యత్యాసాలు ఉంటాయి.
వాతావరణ సంఘటనము 5460 మీటర్ల ఎత్తు వరకు ఎలాంటి మార్పు చెందకుండా ఉంటుంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ భూమి గురుత్వాకర్షణ బలం తగ్గడం వల్ల, బరువైన వాయువుల శాతం ఎత్తుకు పోయే కొద్దీ తగ్గుతుంది. తేలికైన వాయువుల శాతం పెరుగుతుంది. ఉదా: 126 కి.మీ. ఎత్తు వరకు నైట్రోజన్, ఆపైన హైడ్రోజన్ వాయువులుంటాయి. 1100 కి.మీ. ఎత్తువరకు ఆక్సిజన్, 20 కి.మీ. ఎత్తు వరకు కార్బన్ డయాక్సైడ్ వాయువులుంటాయి. వాతావరణ సంఘటనం ఎత్తును బట్టి కాకుండా అక్షాంశమును బట్టి కూడా మారుతుంది. ఉష్ణోగ్రత, భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు పోయే కొద్ది తగ్గుతుంది. కాబట్టి బరువైన వాయువుల శాతం ధ్రువాల వైపు పోయే కొద్దీ పెరుగుతుంది. వాతావరణంలో ఒక అంశమైన నీటి ఆవిరి భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు పోయే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మేట్యోరాలజీ అని పిలుస్తారు. వాతావరణం 75శాతం 16 కి.మీ. ఎత్తులో 99శాతం 30 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. వాతావరణంలో కింది భాగంలోనే దాదాపు అన్ని వాయువులు విస్తరించి ఉన్నాయి. పైభాగాన చాలా ఎత్తులో తేలికైన హైడ్రోజన్, హీలియంలు ఉన్నాయి. నైట్రోజన్ 78శాతం, ఆక్సిజన్ 21శాతం, మిగిలిన 1 శాతంలో కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, నీటి ఆవిరి, జడ వాయువులైన ఆర్గాన్, హీలియం, నియాన్లు ఉన్నాయి. ఇవే కాకుండా చాలా తక్కువ పరిమాణంలో
ఓజోన్, అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, ధూళి కణాలు ఉంటాయి. నీటి ఆవిరి, ధూళి కణాలు కొంత ఎత్తుకు పోయిన తర్వాత కనిపించవు. పైకి పోయే కొద్దీ కార్బన్ డయాక్సైడ్ శాతం తగ్గుతూ పోతుంది. నైట్రోజన్ 90 కి.మీ. వద్ద 65శాతానికి తగ్గిపోతుంది. ఆక్సిజన్ పైకి పోయే కొలది దాని స్థితి మారిపోయి కొంత ఓజోన్‌గా మారుతుంది. పైభాగాన ఉల్కా ధూళి ఉంటుంది. వాతావరణం ఘన, ద్రవ, వాయు పదార్థాలతో ఏర్పడి ఉంటుంది
ఘన పదార్థాలు: దుమ్ము, ధూళి కణాలు, కాలుష్య కణాలు వాతావరణంలోని ఘన పదార్థాలు. ఇవి పరిమితికి మించి వాతావరణంలోకి చేరితే పారదర్శకత దెబ్బతినడమే కాకుండా వాతావరణ కాలుష్యానికి లోనవుతాయి. వాతావరణంలోని ఘనపదార్థాలు నీటి ఆవిరిని ద్రవీభవనం చెందించడంలో హైగ్రోస్కోపిక్ కేంద్రాలు వ్యవహరిస్తాయి.
ద్రవ పదార్థాలు: నీటి ఆవిరిని ద్రవ పదార్థంగా పేర్కొనవచ్చు
వాయుపదార్థాలు: క్లోరిన్‌ను మినహాయిస్తే మిగిలిన అన్ని వాయు మూలకాల భూవాతావరణంలో ఉన్నాయి. మొత్తం వాతావరణంలో ఐదింట నాలుగు వంతులు నైట్రోజన్, ఒక భాగం ఆక్సిజన్లు ఉన్నాయి.
నైట్రోజన్: వాతావరణంలో అధిక శాతంలో ఉన్న వాయువు. ఆక్సిజన్ దహన ప్రక్రియను స్థిరీకరించే ముఖ్యమైన వాయువు. వృక్షాలు నైట్రేట్‌ను తయారుచేసుకొని వాటి పెరుగుదల్లో వినియోగించుకుంటాయి. ఇవి వృక్ష ప్రపంచానికి ముఖ్యంగా లెగ్యుమినిసి మొక్కలకు వరప్రసాదం లాంటివి.
ఆక్సిజన్: దీనిని ప్రాణ వాయువు అంటారు. జీవుల శ్వాసక్రియలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమి మీదకి రాకుండా హరింపజేసి ఓజోన్ వాయువును ఏర్పరచడంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఆక్సిజన్ ఓజోన్లు రూపాంతరాలు.
ఆర్గాన్: వాతావరణంలో అధిక శాతంలో ఉన్న జడవాయువు ఇది. దీనిని ఎలక్ట్రిక్ బల్బుల్లో ఉపయోగిస్తారు.
కార్బన్ డయాక్సైడ్: దీనిని బొగ్గుపులుసు వాయువు అని కూడా పిలుస్తారు. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన ప్రధాన వాయువు ఇది. కార్బన్ డయాక్సైడ్ ఉండాల్సిన శాతం కంటే ఎక్కువ కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియలో ప్రధాన పాత్ర వహిస్తూ ఆహార ఉత్పత్తిని చేపట్టడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. పగటి సమయంలో భూమి మీద ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ కాకుండా రాత్రి సమయాల్లో మరీ తక్కువ కాకుండా ఉండేటట్లు చేయడంలో ఈ వాయువు ముఖ్యపాత్రను పోషిస్తుంది.
ALSO READ :చంద్రయాన్‑1, చంద్రయాన్‑2 తేడాలివే
వాయువుల విభజన
వాతావరణంలోని వాయు సంఘటన స్థితిని ఆధారంగా చేసుకొని అందులోని వాయువులను రెండు రకాలుగా విభజించవచ్చు.
స్థిరమైన వాయువులు: ఇవి వాతావరణంలో ఎల్లప్పుడు నిర్దిష్టమైన నిష్పత్తిలో ఉంటాయి. అవి.. నైట్రోజన్ (78.07శాతం), ఆక్సిజన్ (20.98శాతం), ఆర్గాన్ (0.93శాతం). ట్రోపో, స్టాటో, మీసో ఆవరణాలు కలిసి సమరూప ఆవరణ అంటారు. ఇది 0 నుంచి 85 కి.మీ.ల ఎత్తువరకు విస్తరించి ఉంటాయి. ఈ ప్రాంతంలో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది.
అస్థిరమైన వాయువులు: వీటి పరిమాణం నిర్దిష్టంగా ఉండక కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అవి.. కార్బన్ డయాక్సైడ్, ఓజోన్, నీటి ఆవిరి, హైడ్రోజన్, హీలియం, నియాన్, మీథేన్. 85 కి.మీ.ల పైగల వాతావరణంలో వాయువుల నిష్పత్తి వేర్వేరుగా ఉంటుంది.