ప్రేమికుడితో కలిసి ఉండేందుకు.. కొడుకును చంపేసింది
డెడ్‌బాడీని మాయం చేసి కనిపించట్లేదంటూ
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టిన పోలీసులు.. సూరత్‌లో ఘటన
సూరత్ : ప్రేమికుడితో కలిసి ఉండేందుకు ఓ మహిళ తన కన్న కొడుకునే చంపేసింది. ఆ రెండేండ్ల చిన్నారి డెడ్‌బాడీని మాయం చేసి, తన కొడుకు కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో అనుమానించిన పోలీసులు.. గట్టిగా ప్రశ్నించడంతో అసలు నిజం బయటపెట్టింది. తానే చంపేసి పిల్లాడి డెడ్‌బాడీని పాతిపెట్టినట్లు ఒప్పుకుంది. సూరత్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు ఆదివారం మీడియాకు
వెల్లడించారు.
పోలీసులనే పరుగులు పెట్టించింది..
ఝార్ఖండ్‌కు చెందిన నయన మాండవి గుజరాత్‌లోని సూరత్ జిల్లా దిండోలి ప్రాంతంలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తోంది. తన రెండేండ్ల కొడుకు కనిపించట్లేదంటూ గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండుమూడ్రోజుల పాటు పోలీసులు గాలించినా ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. తల్లిని అనుమానించి అరెస్ట్ చేశారు. తొలుత తనకేమీ తెలియదని చెప్పిన మాండవి, ఝార్ఖండ్‌లో ఉంటున్న తన ప్రేమికుడే కిడ్నాప్ చేసుంటాడని చెప్పింది. దీంతో పోలీసులు వెళ్లి ఆరా తీయగా ఈ వ్యవహారంతో అతడికెలాంటి సంబంధం లేదని తేలింది. ఇక ఆ తల్లినే పోలీసులు ఇంటరాగేషన్ చేయగా.. తానే పిల్లాడిన చంపేసి ఓ గుంతలో పాతిపెట్టినట్లు ఒప్పుకుంది.
అక్కడ తవ్వితే ఎలాంటి మృతదేహం దొరక్కపోవడంతో.. మరోచోట ఉందంటూ పోలీసులను పరుగులు పెట్టించింది. అక్కడా డెడ్‌బాడీ దొరకలేదు. చివరికి తాను పనిచేస్తున్న సైట్లోనే పూడ్చిపెట్టినట్లు చెప్పింది. అక్కడ్నుంచి బాలుడి డెడ్‌బాడీని పోలీసులు వెలికితీశారు. ‘‘ఝార్ఖండ్‌లోని ఓ వ్యక్తిని ఆమె ప్రేమించింది. అతనితో కలిసి బతకాలనుకుంది. కొడుకుతో వస్తే ఇంట్లోకి రానివ్వనని అతడు కండిషన్ పెపట్టడంతో ఏం చేయాలో తెలియక బిడ్డను చంపుకుంది”అని మాండవి చెప్పిందని పోలీసులు వెల్లడించారు.