దేవరకొండ, వెలుగు: నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి దారుణం జరిగింది. కాన్పు కోసం వచ్చిన మహిళకు కాన్పు చేయకుండా డ్యూటీ డాక్టర్శ్రీదేవి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గర్భిణికి నర్సులే సాధారణ కాన్పు చేశారు. శిశువును బలవంతంగా బయటకు లాగడంతో శిశువు తల, మెడకు పేగు చుట్టుకుని బయటకు వచ్చింది. దీంతో శిశువు మృతి చెందింది. చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి గ్రామానికి చెందిన మేదరి మనీష తొలి కాన్పు కోసం గురువారం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆమె భర్త నాగరాజుతో పాటు కుటుంబసభ్యులు ఆపరేషన్ చేయాలని డ్యూటీ డాక్టర్ శ్రీదేవిని కోరారు. ఆమె దురుసుగా మాట్లాడి కాసేపు ఆగాలని చెప్పింది.
అర్ధరాత్రి మనీషకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో మరోసారి డాక్టర్‌కు చెప్పారు. కానీ ఆమె కనీసం చూడడానికి రాలేదు. దీంతో నర్సులే కాన్పు చేసి బలవంతంగా శిశువును బయటకు లాగి, శిశువు చనిపోయిందని చెప్పారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే శిశువు మరణించిందని ఆరోపిస్తూ శుక్రవారం కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. దీంతో డాక్టర్ శ్రీదేవి తాను దేవరకొండలో ఇక డ్యూటీ చేయనని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు నాయక్ కు చెప్పి, వెళ్లిపోయింది. ఈమె డిప్యూటేషన్‌పై దేవరకొండ లో విధులు నిర్వహిస్తోందని, ఆమె తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని రాములు నాయక్ చెప్పారు.