వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో దారుణం జరిగింది. అక్కడి పేషెంట్లపై ఎలుకలు దాడి చేశాయి. ఐసీయూలో ఉన్న శ్రీనివాస్ అనే పేషెంట్ కాలు, చేతులను ఎలుకలు కొరికేశాయి. దీంతో శ్రీనివాస్ కు తీవ్ర రక్తస్రావం అయింది. నాలుగు రోజుల క్రితం భీమారానికి చెందిన శ్రీనివాస్ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఆస్పత్రిలో చేరిన మొదటి రోజే శ్రీనివాస్ ను ఎలుకలు కరిచాయని, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇవాళ ఉదయం కూడా శ్రీనివాస్ ను తీవ్రంగా గాయపరిచాయన్నారు. దీంతో శ్రీనివాస్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని హాస్పిట్ యాజమాన్యం తెలిపింది. బాధితుడు శ్రీనివాస్ కు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
ఎంజీఎం ఘటనపై మంత్రి హరీష్ రావు సీరియస్
వరంగల్ ఎంజీఎం దవాఖానలో పేషెంట్ పై ఎలుకలు దాడి చేసి కొరికిన ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను సూచించారు. ఇప్పటికే వార్డును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్..త్వరలో మంత్రి హరీష్ రావుకు నివేదికను అందజేసే అవకాశం ఉంది. దీని ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
మరిన్నివార్తల కోసం