ముంబై : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. మేకలను, పావురాలను దొంగతనం చేశారనే అనుమానంతో నలుగురి బట్టలు విప్పి..చెట్టుకు వేలాడదీసి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన మహారాష్ర్టలో ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
అసలేం జరిగింది..?
అహ్మద్‌నగర్ జిల్లా హారేగావ్ గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన మేక, పావురాలు కనిపించకుండా పోయాయి. దీంతో తమ ఇంటికి సమీపంలో ఉండే నలుగురిపై (ఒక యువకుడు, ముగ్గురు మైనర్లు) వారికి అనుమానం కలిగింది. దీంతో అనుమానంతో మరికొంతమందితో కలిసి నలుగురిని బలవంతంగా యువరాజ్ గలాండే అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లారు.
వీడియో వైరల్
దొంగతనం చేశారనే అనుమానంతో షుభమ్ మఘడే అనే వ్యక్తి దుస్తులు విప్పించారు. ఆ తర్వాత కాళ్లు, చేతులను కట్టేసి.. ఓ చెట్టుకు వేలాడదీశారు. అంతేకాదు.. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీన్ని తమ సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల వద్దకు చేరింది.
పరారీలో నిందితులు
బాధితుల్లో ఒకరైన20 ఏళ్ల షుభమ్ మఘడే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాము తక్కువ కులం (మహర్ ) వాళ్లమని బాధితుడు షుభమ్ మఘడే చెప్పారు. తమపై నిందితులు మూత్ర విసర్జన చేశారని, ఉమ్మి వేసి.. నాకమని చెప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో పాటు ముగ్గురు చిన్న పిల్లలను కూడా కొట్టారని చెప్పాడు.
హరేగావ్ లో బంద్
బాధితుడి ఫిర్యాదుతో పప్పు పర్ఖే, రాజు బోర్గే, యువరాజ్ గలాండే, నానా పాటిల్ అనే వ్యక్తులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు నిరసనగా హరేగావ్ గ్రామంలో బంద్ పాటించారు.
రాజకీయ దుమారం
ఈ ఘటన మానవత్వానికి మచ్చ అని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి మహేశ్ తపసే ఆరోపించారు.