వృద్ధుడి సజీవ దహనం

ఆస్తి కోసం చంపారా?
బిడ్డలు, మనమడిపై అనుమానాలు
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఘటన

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవలో వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. ఆయన కూతుళ్లు, మనుమడే ఇంటికి నిప్పంటించి ఈ దారుణానికి పాల్పడ్డారని మృతుని తమ్ముని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా  కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులుకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం. కొడుకు రాములు 18 ఏండ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. కూతుళ్లు లక్ష్మీనర్సవ్వ, లీలావతి, గంగామణిలకు పెళ్లిళ్లు అయ్యాయి.

భర్తకు విడాకులు ఇచ్చిన లీలావతి.. తన కొడుకు భానుప్రకాశ్, తల్లి లక్ష్మితో కలిసి ఉంటోంది. ఆంజనేయులు తన రెండో భార్య బాలామణితో కలిసి రాజంపేటలో మరో ఇంట్లో ఉంటున్నాడు. ఆయనకు ఐదెకరాల భూమి ఉండగా అందులో కొంత భూమిని రెండో బిడ్డకు ఇచ్చాడు. ఇటీవల ఆయన ఎకరం భూమి అమ్మగా రూ.10 లక్షలు వచ్చాయి.  ఈ డబ్బుతో పాటు  మిగతా భూమి  విషయంలో గత కొద్ది రోజులుగా కూతుళ్లతో గొడవలు జరుగుతున్నాయి. బోరు విషయంలోనూ వారి మధ్య వివాదాలున్నాయి. ఆదివారం కూడా ఆంజనేయులుతో వారు గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆదివారం కామారెడ్డిలో అంజనేయులు చిన్న బిడ్డ గంగామణి ఇంట్లో ఫంక్షన్​ జరిగింది. తన ఇద్దరు భార్యలు ఫంక్షన్​కు వెళ్లగా ఆంజనేయులు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. రాత్రి ఇంట్లో నుంచి పొగలు రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మంటలు ఆర్పేందుకు వెంటనే ఫైరింజన్​ను రప్పించారు. మంటలు ఆర్పుతుండగా ఇంట్లో మనిషి ఉన్నట్టు గమనించిన ఫైర్  సిబ్బంది.. జేసీబీతో గోడను బద్దలుకొట్టారు. అయితే, అప్పటికే ఆంజనేయులు మంటల్లో కాలిపోయాడు. అతన్ని హాస్పిటల్​కు తరలించగా అప్పటికే చనిపోయాడు. ఇంటి బయట గొళ్లెం పెట్టి ఉండడం, మృతుని తలపై గాయం ఉండడంతో సొంత బిడ్డలే సజీవ దహనం చేశారని ఆరోపిస్తూ  గ్రామస్తులు ధర్నా చేశారు. ఆయన బిడ్డలు, మనవడిపై హత్య కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. డెడ్​బాడీని ఎవరికీ చూపెట్టకుండా పోస్ట్​మార్టం కోసం తరలించిన  రాజంపేట ఎస్సైని సస్పెండ్​ చేయాలన్నారు. గ్రామస్తుల ఆందోళనతో  కామారెడ్డి డీఎస్పీ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. పూర్తి స్థాయిలో   ఎంక్వైరీ చేసి  చర్యలు తీసుకుంటామని చెప్పడంతో  గ్రామస్తులు ఆందోళన విరమించారు.