ఫారెస్ట్ ఆఫీసర్ల అత్యుత్సాహం..ఇటీవల కాలంలో మారిన పంథా

 ఫారెస్ట్ ఆఫీసర్ల అత్యుత్సాహం..ఇటీవల కాలంలో మారిన పంథా
  • మొన్నటికి మొన్నవలసజీవులపై వ్యవహారంపై కోర్టు మొట్టికాయలు
  • తాజాగా అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి నిర్మాణం కూల్చేసిన అధికారులు
  • ఒంటెద్దు పోకడలపై ప్రజల్లో నిరసన 

ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు :  కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్​లో కొన్ని నెలలుగా అటవీ శాఖ ఆఫీసర్ల వైఖరి విమర్శలకు దారి తీస్తున్నది. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ పేరుతో అమాయకులు, పేదలపై ప్రతాపం చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్​కు చెందిన వలస జీవులను ఆగమేఘాల మీద అదుపులోకి తీసుకోవడం, చట్ట ప్రకారం వ్యవహరించకపోవడంతో జిల్లా జడ్జి జోక్యం చేసుకొని మందలించారు. తాజాగా దశాబ్దాల కిందట నిర్మించుకున్న ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి జేసీబీలు పెట్టి కూల్చి వేయడంపై నిరసన వ్యక్తమవుతున్నది. 

వివాదాస్పదంగా ఆఫీసర్ల తీరు

అటవీ శాఖ అధికారులు, ప్రజలకు మధ్య గతంలో మంచి సంబంధాలు ఉండేవి. పోడు భూముల ఇష్యూలో కాగజ్ నగర్ మండలం సార్సాల ఘటన తర్వాత ఈ దూరం పెరుగుతూ వస్తున్నది. పోడు భూములను రైతుల నుంచి తీసుకొని మొక్కలు నాటడం, వాటికి బౌండరీ వేయడం ఇలా అన్నింట్లో గొడవలు సాధారణం అయ్యాయి. అంకుశాపూర్​లో పోడు భూముల్లో హద్దుల ఏర్పాటు అంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు పలుమార్లు సాగు భూముల్లోకి వెళ్లగా, రైతులు అడ్డు తిరిగారు. ఈ ఘటనలో ఆఫీసర్లు ఏకపక్షంగా వ్యవహరించడం ఆందోళనకు దారి తీసింది. పెంచికల్ పేట్ రేంజ్​లో ఇటీవల ఫారెస్ట్ ఆఫీసర్లు ఓ ఇంట్లోకి చొరబడి వాళ్లను అదుపులోకి తీసుకోవడం వివాదానికి దారి తీసింది. 

స్వయంగా దీక్షకు దిగిన ఎమ్మెల్యే

ఇక టైగర్ రిజర్వ్​లోని బఫర్ ప్రాంతం కావడంతో పులి రక్షణ పేరుతో గ్రామాలను తరలించే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని నెలల కిందట కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ ఆఫీస్​కు పాదయాత్రగా వచ్చి తమ ఊర్లను తరలిస్తే ఊరుకోబోమని ఆయా గ్రామాల రైతులు, గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీంతో ఊర్ల తరలింపు, టైగర్ జోన్ ప్రతిపాదన ఏదీ లేదని సబ్​కలెక్టర్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో అడవుల సమీపంలోని గ్రామాల ప్రజల ఆధార్ కార్డులు ఇవ్వాలని చెప్పడం, ఇంటి కుటుంబ వివరాలు సేకరించడంతో ఆందోళన నెలకొన్నది. 

Also Read :- వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వండి

కొన్ని నెలల కింద సిర్పూర్ టీ రేంజ్ లోని లక్ష్మీ పూర్​గ్రామంలో అడవి పందిని వేటాడి చంపిన కేసులో ఫారెస్ట్ ఆఫీసర్ల తీరు ఆందోళనకు దారి తీసింది. అనుమానితుల పేరిట ఫారెస్ట్ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్న వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని స్వయానా ఎమ్మెల్యే హరీశ్ బాబు రెండు రోజుల పాటు రేంజ్ ఆఫీస్ ఎదుట దీక్షకు దిగారు. 

జేసీబీలతో అర్ధరాత్రి కూల్చివేతలు

తాజాగా కౌటాల మండల కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో వసంత్ అనే వ్యక్తి  ఇంటి నిర్మాణం కోసం కట్టిన ప్రహారీ, పిల్లర్లను జేసీబీలతో శుక్రవారం  అర్ధరాత్రి కూల్చి వేయడం కలకలం రేపింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే వందల సంఖ్యలో పక్కా భవనాలు, పేదల గుడిసెలు నిర్మాణమై ఉన్నాయి. అధికారులు రెండు నెల కింద నోటీసు ఇవ్వడంతో ఇంటి నిర్మాణం పనులు ఆపేశామని అయినా అర్ధరాత్రి వచ్చి పడగొట్టడంపై బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. 

దీనిపై ఫారెస్ట్ ఆఫీసర్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు. ‘‘అవును రాత్రే కూల్చినం ఎవరూ అడ్డం రావొద్దు’’ కదా అంటున్నారు. ఇంతేగాక ఆ భూమి మొత్తం ఫారెస్ట్ దేనని మిగిలిన ఇండ్లకు సైతం నోటీసులు ఇచ్చి తీసేస్తామని చెప్తుతుండడం  గమనార్హం. ఇలా అన్ని శాఖలు వేరు మేం వేరనే రీతిలో ఫారెస్ట్ ఆఫీసర్ల తీరు మారడం ఇబ్బందిగా మారుతోంది. 

కోర్టు చీవాట్లు పెట్టే స్థితికి.. 

వన్యప్రాణులను వేటాడే ముఠా అనే అనుమానంతో ఈ నెల 2న కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో మధ్యప్రదేశ్ కు చెందిన 32 మందిని (8 కుటుంబాలు) రైల్వే పోలీస్, స్థానిక పోలీసుతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు 24 మంది ఉండగా, వారిని రాత్రంతా అదుపులో ఉంచుకొని ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ లో పెట్టారు. మూడురోజులైనా వీరిలోని 8 మంది అనుమానితులను కోర్టులో ప్రవేశపెట్టలేదుA దీంతో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి యువ రాజ్ స్పందించి ఫారెస్ట్ ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో హుటాహుటిన సిర్పూర్ టీ కోర్టు జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. 

ఆయన సైతం చట్టం ప్రకారం వ్యవహరించనందుకు కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లను తీవ్రంగా మందలించాడు. ఈ కేసులో అనుమానితులను సైతం కాగజ్ నగర్ డివిజన్​కు చెందిన అధికారులను కాదని ఆసిఫాబాద్ డివిజన్ లో పనిచేస్తున్న కొందరు అధికారులను పిలిచి ఇంటరాగేషన్ చేసినట్లు తెలుస్తున్నది. అయినా ఇప్పటివరకు నేరం నిరూపించే ఆధారాలు సమగ్రంగా సేకరించలేదు. అనుమానితుల దగ్గర దొరికిన ఫుట్ ట్రాప్, కొన్ని వెంట్రుకలను నాగ్ పూర్ లోని సీసీఎంబీకు టెస్టుల కోసం పంపారు. ఈ నివేదిక ప్రకారం ముందుకు వెళ్తామని ఎఫ్​డీఓ సుశాంత్ సుఖ్ దేవ్ తెలిపారు.