కోడల్ని చంపి పాతిపెట్టిన అత్త..రోజంతా తవ్వితే బయటపడ్డ డెడ్​బాడీ

శంషాబాద్, వెలుగు:చుట్టూ పోలీసులు.. గంటల తరబడి భారీ మట్టి దిబ్బను తవ్వుతున్న మూడు జేసీబీలు.. అసలు ఏం జరుగుతున్నదో తెలియక ఆసక్తిగా చూస్తున్న జనాలు.. రాత్రి 7.30 గంటల సమయంలో ఎట్టకేలకు బయటపడ్డ మహిళ డెడ్​బాడీ. శంషాబాద్ పరిధిలోని​ సాతంరాయిలో గురువారం  ఘటన కలకలం సృష్టించింది. మృతురాలిని సొంత అత్తే హత్య చేసి పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని రామంజాపూర్ తండాకు చెందిన సురేశ్, దోళి (36) దంపతులకు ఇద్దరు కొడుకులు.

సురేశ్ తల్లిదండ్రులు అనంత్, తుల్చిని సాతంరాయిలోని ఒకరి వద్ద వాచ్​మెన్​గా పనిచేస్తుండగా, పిల్లలిద్దరూ వారివద్దే ఉంటున్నారు. భర్త తాగొచ్చి గొడవ చేస్తుండడంతో కొన్నినెలల కిందట దోళి సాతంరాయిలోని తన అత్తమామల వద్దకు వెళ్లి అక్కడే పనిచేసింది. కొన్నిరోజులకు పని నచ్చక ఇంటికి తిరిగి వెళ్తానంటే అత్త తుల్చిని (58) కొడల్ని బస్సు ఎక్కిస్తానని శంషాబాద్​కు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి తిరిగొచ్చింది. 

రెండు నెలల కింద మిస్సింగ్​ కేసు

అయితే, రోజులు గడిచినా దోళి తన భర్త వద్దకు చేరుకోకపోవడంతో గతేడాది నవంబర్10న శంషాబాద్ ​పీఎస్​లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో రూరల్ పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె గురించి ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కేసును పక్కన పెట్టారు. ఇటీవల తాత,నానమ్మ ఇంట్లో  సీక్రెట్ గా భయం భయంగా మాట్లాడుకుంటుండడంతో పిల్లలిద్దరికి అనుమానం వచ్చి ఈ విషయాన్ని తమ మేన మామకు చెప్పారు.

అతడు పోలీసులకు తెలపగా, బుధవారం అత్త తుల్చినిని  అదుపులోకి తీసుకొని  విచారించారు. దీంతో దోళిని తానే హత్య చేసి సాతంరాయి వద్ద ఉన్న త్రిలోక్ డెవలప్​మెంట్ ప్రాజెక్టు నిర్మాణాల వద్ద పూడ్చిపెట్టినట్టు అంగీకరించింది. గురువారం ఉదయం రాజేంద్రనగర్ తహసీల్దార్, ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల సమక్షంలో ఉదయం నుంచి నిందితురాలు చూపించిన చోట రాత్రి వరకు మూడు జేసీబీలతో తవ్వారు.

ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా పెద్ద ఎత్తున మట్టి వేయడంతో 12 –-15 ఫీట్ల మేర మట్టిలో మృతదేహం పూడ్చుకుపోయింది. చివరకు 7:30 గంటల సమయంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం బయటపడడంతో అక్కడే తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, దోళిని తుల్చిని ఎందుకు? ఎలా? హత్య చేసిందని పూర్తి వివరాలను నేడు మీడియా సమావేశంలో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.