శ్మశానంలో వదిలేసిన వెళ్లిన వృద్ధురాలిని కొడుక్కి అప్పగింత

శ్మశానంలో వదిలేసిన వెళ్లిన వృద్ధురాలిని కొడుక్కి అప్పగింత

మిర్యాలగూడ, వెలుగు : చెయ్యి విరిగి.. శ్మశానంలో ఆకలితో అలమటిస్తూ పడి ఉన్న వృద్ధురాలికి అధికారులు ట్రీట్​మెంట్​చేయించి కొడుక్కి అప్పగించారు. సర్పంచ్ ధనావత్ రాంచంద్ నాయక్, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఫీల్డ్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన చింతకాయల వెంకటరత్నమ్మ(70)కు భర్త ఏడుకొండలు, కొడుకు వెంకటేశ్, కూతురు ఉన్నారు. నాలుగు రోజుల కింద వృద్ధురాలితో కొడుకు, కోడలు గొడవపడ్డారు. ఈ క్రమంలో ఆమె చెయ్యి విరిగింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ నెల 5న వెంకటేశ్​తల్లి వెంకటరత్నమ్మను ఆటోలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాకు తీసుకొచ్చాడు. 

స్థానిక శ్మశానంలో వదిలేసి వెళ్లిపోయాడు. పంచాయతీ సిబ్బంది రవి, సర్పంచ్ రాంచంద్ నాయక్ గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ‘వీ6 వెలుగు’లో వార్త పబ్లిష్​అయింది. స్పందించిన వికలాంగ వయోవృద్ధుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ రూరల్ ఎస్సై నరసింహులు ... దాచేపల్లి పోలీసుల సహకారంతో వెంకటేశ్​ను రూరల్ పీఎస్ కు పిలిపించారు. అతనికి  కౌన్సిలింగ్ ఇచ్చి, వృద్ధురాలిని అతనితో పంపించారు. దాచేపల్లి పోలీసులు ప్రతి 15 రోజులకు ఓసారి పరిశీలించాలని  కోరారు.