చండ్రుగొండ, వెలుగు : చండ్రుగొండ శివారు లంకలవాగు సమీపంలో మంగళవారం కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల గ్రామం నుంచి పత్తి తీసేందుకు పది మంది కూలీలను ఎక్కించుకొని ఆటో రావికంపాడు గ్రామం వైపు వెళ్తుండగా చండ్రుగొండ శివారులో ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఆటో లో ప్రయాణిస్తున్న సానిక కృష్ణమ్మ, భవాని, లావణ్య, సౌజన్య, వెంకటలక్ష్మికి గాయాలయ్యాయి. వారిని చండ్రుగొండ పీహెచ్ సీకి తరలించి చికిత్స చేశారు. తీవ్రగాయాలైన ముగ్గురిని 108 అంబులెన్స్ లో కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
కూలీ ఆటోను వ్యాన్ఢీకొని..
తల్లాడ : కూలీల ఆటోను మినీ వ్యాన్ ఢీకొని ఎనిమిది మందికి గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఈ ఘటన తల్లాడ మండలం అన్నారుగూడెం, బిల్లుపాడు గ్రామాల మధ్య మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన 20 మంది కూలీలు ఆటోలో పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా అన్నారుగూడెం, బిల్లుపాడు గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీ కొట్టింది.
దీంతో ఆటోలోని ఎనిమిది మందికి గాయాలు కాగా, పడాల ధనమ్మ, కందుల ఈశ్వరమ్మ, పులి లక్ష్మికి సీరియస్ గా ఉంది. వారిని 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.