పొలిటికల్​  హీట్​ పెంచనున్న ‘ఆజాద్​’ ఆత్మకథ 

పొలిటికల్​  హీట్​ పెంచనున్న ‘ఆజాద్​’ ఆత్మకథ 

ఇందిరా గాంధీతో వ్యూహం రచించడం నుంచి రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావడం, పార్టీ అధినేత్రిగా సోనియా గాంధీని ఒప్పించడం వరకు, రాహుల్ గాంధీ, హిమంత బిస్వా శర్మ మధ్య పోరులో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు, కాంగ్రెస్‌‌లో గులాం నబీ ఆజాద్ పాత్ర అపారమైనది. ఆయన ట్రబుల్ షూటర్ నుంచి పార్టీలో ఇబ్బందుల్లో పడేదాక..50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం చేసి  పార్టీని విడిచిపెట్టారు.  ఆజాద్ తన  సుదీర్ఘమైన ఇండియన్​ పాలిటిక్స్‌‌ యాత్రలో గత ఐదు దశాబ్దాలుగా  పరివర్తన చెందిన రాజకీయనాయకుడి పాత్ర పోషించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐసీసీ ఇన్‌‌ఛార్జ్‌‌గా ఆజాద్‌‌కు హైదరాబాద్, తెలంగాణ, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌‌తోనూ సుదీర్ఘ అనుబంధం ఉంది.

హిమంత బిస్వా శర్మ ఎపిసోడ్​పై..

2015లో కాంగ్రెస్‌‌ను వీడి బీజేపీలో చేరిన ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఎపిసోడ్‌‌ను రాహుల్ గాంధీ ఎలా తప్పుగా నిర్వహించారో ఈ పుస్తకం వెల్లడించింది. అందులో చెప్పబడిన ప్రకారం – ‘‘మేము మరుసటి రోజు ఉదయం రాహుల్‌‌ నివాసానికి చేరుకున్నప్పుడు, తరుణ్ గొగోయ్, అతని కుమారుడు గౌరవ్ గొగోయ్ అతనితో కూర్చొని ఉండటం చూశాం. నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదని రాహుల్‌‌ సూటిగా చెప్పారు. హిమంత్‌‌కు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని, తిరుగుబాటు చేసి పార్టీని వీడతారని మేము ఆయనకు సూచించాం. ‘అతన్ని వెళ్ళనివ్వండి’ అని రాహుల్ అన్నాడు. సమావేశం ముగిసింది. రాహుల్ గాంధీ తనను తాను నొక్కి చెప్పుకోవడానికే ఇలా అన్నారా లేక తన నిర్ణయం తీవ్ర పరిణామాలకు దారితీయదనే అజ్ఞానం వల్లనో నాకు ఖచ్చితంగా తెలియదు. నేను సోనియా జీని కలిసి కథలోని తర్వాతి ట్విస్ట్ గురించి చెప్పాను. ఆమె మున్ముందు జరగబోయే విపత్కర పరిణామాలను అర్థం చేసుకున్నప్పటికీ, పార్టీ అధ్యక్షురాలిగా ఆమె  తానుగా చెప్పుకోలేకపోవటం దురదృష్టకరం. బదులుగా, ఈ అంశాన్ని పెద్దది చేయొద్దని హిమంత్‌‌ను అభ్యర్థించమని ఆమె నన్ను కోరారు’’– పుస్తకంలో వివరించిన కొన్ని సంఘటనలు అవి. 

ఆజాద్ తన రాజకీయ జీవితాన్ని భారత జాతీయ కాంగ్రెస్‌‌తో ప్రారంభించి, 1973లో కాశ్మీర్‌‌లో బ్లాక్ సెక్రటరీ అయ్యాడు. తన ఐదు దశాబ్దాల రాజకీయాల్లో, అతను భారత యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, జాతీయ అధ్యక్షుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు వంటి అనేక పదవులను నిర్వహించడమే కాక మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సభ్యుడుగా కొనసాగారు. ఆజాద్ 1982 నుంచి 2014 వరకు ప్రధానమంత్రులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.  అతను పంచ్‌‌లు వేయకపోయినా, ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో పనిచేయడం, ప్రధాని పీవీ నరసింహారావు, సీతారాం కేసరి వంటి రాజకీయ నాయకులతో అనుభవాలు, ఎన్‌‌డీ తివారీ, తో ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆడిన రాజకీయ ట్రిక్స్ గురించి, ప్రధాని మోదీ పట్ల తన వ్యక్తిగత దృక్పథాన్ని పుస్తకంలో అందించారు. ఆజాద్​2021 వరకూ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పదవీ విరమణ చేశారు. ఆగస్టు 2022లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని విడిచిపెట్టారు. గులాం నబీ ఆజాద్ (74), 50 ఏండ్ల అనుబంధాన్ని కలిగి ఉన్న మాతృసంస్థ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచే అవమానాలను ఎదుర్కొంటున్నాను అంటూ వైదొలగారు, తన సొంత రాజకీయ పార్టీ ‘డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ’ని స్థాపించారు.

పొలిటికల్​ సర్కిల్స్​లో మంచి పేరు

పార్టీ నాయకత్వం చేస్తున్న అవమానం  కారణంగా గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌‌ను విడిచిపెట్టారని రాజ్యసభ మాజీ కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ చెప్పారు. ‘ఐదు దశాబ్దాల పాటు పార్టీకి సేవ చేసిన ఆయనను అవమానించారు. అంతేకాదు బయటకు పొమ్మని తలుపు చూపించారు. దేశంలోని అతికొద్ది మంది లౌకిక నాయకుల్లో గులాం నబీ ఆజాద్ ఒకరు. ఈయనకు దేశమే ముఖ్యం. అతను అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను కొనసాగించాడు’ అని ఖాన్ చెప్పారు.

ఆత్మకథలో గాంధీలు

‘ఆజాద్’ ఆటోబయోగ్రఫీ.. కాంగ్రెస్ పార్టీతో అతని 50 ఏళ్ల అనుబంధానికి అంకితం చేయబడింది. ఇందులో అతను గాంధీ కుటుంబ సభ్యులైన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్‌‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో తన సంబంధాన్ని నిజాయితీగా, ఆకర్షణీయంగా వివరించారు. అంతేకాదు ఆయనొక ట్వీట్‌‌లో  ‘నేను నా పుస్తకంలో నిజాయితీగా ఉన్నాను. రాజకీయ నాయకుడిగా ఇది నా ప్రయాణం.. మరీ ముఖ్యంగా ప్రజల ప్రేమ నా వ్యక్తిత్వాన్ని, పాత్రను ఎలా తీర్చిదిద్దిందనే కథ ఇది’ అని పేర్కొన్నారు.

రాహుల్​ అవగాహనా రాహిత్యం​పై చర్చకు అవకాశం

కాంగ్రెస్‌‌ మాజీ సీనియర్‌‌ నాయకుడు, జమ్మూ కాశ్మీర్‌‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌‌ ఆత్మకథ‘ ఆజాద్‌‌’, రాహుల్‌‌ గాంధీ ఎపిసోడ్‌‌లో రాజకీయ వేడిని పెంచడం ఖాయంగానే కనిపిస్తున్నది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని గుజరాత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ తర్వాత లోక్‌‌సభ ఎంపీ సీటును కోల్పోవడంతో ప్రతిపక్ష పార్టీలను కుదిపేసింది. ఇది మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసిన కొన్ని పొరపాట్లకు ‘ఆజాద్’ ఆటోగ్రఫీ పుస్తకం కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ఉష్ణోగ్రతను మరింత పెంచేలా ఉంది! ‘ఆజాద్​’ ఆత్మకథ పుస్తకం ఏప్రిల్ 5న పాఠకుల ముందుకు రానుంది.  ఈ పుస్తకం  ముఖ్యంగా గాంధీ కుటుంబంతో మాజీ యూపీఏ చైర్‌‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆజాద్ అనుభవాలను వివరిస్తుంది, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఎపిసోడ్‌‌తో సహా సున్నితమైన అనేక విషయాలు అర్థంచేసుకోవడంలో రాహుల్​ కు అనుభవం లేకపోవడం, ఇది హిమంత్​బిస్వా  కాంగ్రెస్‌‌ను విడిచి బీజేపీలో చేరడానికి దారితీసింది అన్న అంశాలను అందులో  స్పష్టంగా చెప్పారు.
–సీఆర్​ గౌరీశంకర్, సీనియర్​ జర్నలిస్ట్​