
ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. అక్షర పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్.. రిషబ్ పంత్ సారధ్యంలోని లక్నో సూపర్ జయింట్స్ తో తలపడుతుంది. ఈ సీజన్ లో రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలిచి గ్రాండ్ గా టోర్నీ ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ బ్లాక్ బస్టర్ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సూపర్ ఫైట్ కు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడం లేదని తెలుస్తుంది.
మరో మూడు గంటల్లో మ్యాచ్ జరగనున్న రాహుల్ ఆడతాడా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. టోర్నీ ప్రారంభానికి ముందు రాహుల్ తొలి రెండు మ్యాచ్ లకు దూరంగా ఉంటాడనే వార్తలు వచ్చాయి. రాహుల్ భార్య అథియా శెట్టి త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. బిడ్డ పుట్టిన సమయంలో అతను ఫ్యామిలీతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా రాహుల్ తొలి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఢిల్లీ మాత్రం రాహుల్ విషయంలో ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.
లక్నోతో మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం రాహుల్ ఆడతాడో లేదో క్లారిటీ ఇవ్వలేదు. రాహుల్ జట్టుతోనే ఉన్నాడని.. అతను ఆడతాడో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదని అక్షర్ అన్నాడు. రాహుల్ అందుబాటులో ఉంటాడో లేదో తమకు తెలియదని కెప్టెన్ అన్నాడు. అక్షర్ పటేల్ మాటలను బట్టి చూస్తే నేడు (మార్చి 24) జరగనున్న మ్యాచ్ లో రాహుల్ ఆడకపోవచ్చని తెలుస్తుంది.
There is uncertainty around KL Rahul's availability for the first match https://t.co/rw1ZiNSYDT #IPL2025 pic.twitter.com/G6clQFlpld
— ESPNcricinfo (@ESPNcricinfo) March 24, 2025
2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రాహుల్ ను రూ. 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అనుభవం ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మీద ఢిల్లీ ఫ్రాంచైజీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2024 ఐపీఎల్ సీజన్ లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడిన కేఎల్ .. కెప్టెన్ గా జట్టును ప్లే ఆఫ్ కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో అతన్ని లక్నో రిటైన్ చేసుకోకుండా వదిలేసి బిగ్ షాక్ ఇచ్చింది.
ఇప్పటివరకు రాహుల్ 132 ఐపీఎల్ మ్యాచ్ ల్లో నాలుగు సెంచరీలు,37 అర్ధ సెంచరీలతో 4683 పరుగులు చేశాడు. ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. మొత్తం 148 పరుగులు చేసి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు.