
పోటీ పరీక్షల్లో గవర్నెన్స్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 10 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. ఇది గవర్నెన్స్లో భాగమే. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తెలంగాణలోని కొన్ని మండలాలు, జిల్లాలు అవార్డులను గెలుచుకున్నాయి. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 10 జిల్లాలు ఉండేవి. 2016 అక్టోబర్ 11 నాడు కొత్తగా 21 జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రతి జిల్లాను కనీసం రెండు జిల్లాలుగా, అత్యధికంగా ఐదు జిల్లాలుగా విభజించారు. హైదరాబాద్ జిల్లాలో మార్పులు చేయలేదు. ఆ తర్వాత మార్పులతో 31 జిల్లాలు ఏర్పడ్డాయి. చివరగా ములుగు, నారాయణపేట జిల్లాలను 2019 ఫిబ్రవరి 17న ఏర్పాటు చేశారు. వీటితో కలిపి మొత్తం 33 జిల్లాలు ఏర్పడ్డాయి. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలు ఐదు అవి.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు మాత్రమే తెలంగాణకు సరిహద్దుగా ఉన్నాయి. ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో తెలంగాణతో ఒడిశాకు సరిహద్దు లేదు. జిల్లాల పునర్విభజన తర్వాత ప్రస్తుతం 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 594 మండలాలు, 13 మున్సిపల్ కార్పొ రేషన్లు, 128 మున్సిపాలిటీలు, 10,909 రెవెన్యూ గ్రామాలు, 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
పట్టణ స్థానిక సంస్థలు
మున్సిపాలిటీ లేని ఏకైక జిల్లా ములుగు. రాష్ట్రంలో అత్యధికంగా అర్బన్ లోకల్ బాడీలు గల జిల్లా రంగారెడ్డి. ఈ జిల్లాలో మొత్తం 16 అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 13, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో 8, మంచిర్యాల జిల్లాలో 7 అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, హైదరాబాద్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో ఒకే ఒక అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయి. రెండు లోకల్ అర్బన్ బాడీలు గల ఏకైక జిల్లా సిరిసిల్ల. భారతదేశ జిల్లాల సరాసరి జనాభా (ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన కాకముందు) 14.5లక్షలు. తెలంగాణ రాష్ట్ర సరాసరి జిల్లాల జనాభా 11.5 లక్షలు. దేశ సరాసరి మండలాల జనాభా 1.47 లక్షలు. తెలంగాణ రాష్ట్ర సరాసరి మండలా జనాభా 63,600.
పట్టణ జనాభా
తెలంగాణ రాష్ట్ర సరాసరి పట్టణ జనాభా 38.9 శాతం. దేశ పట్టణ జనాభా కంటే రాష్ట్ర పట్టణ జనాభా అధికం. జాతీయ జనాభా కమిషన్ ప్రొజెక్షన్ ( కేంద్ర ప్రభుత్వ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ) 2011–36 ప్రకారం 2022 నాటికి తెలంగాణ జనాభాలో 46.84శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని అంచనా వేసింది. జాతీయ జనాభా కమిషన్ ప్రకారం 2022 నాటికి 1.79 కోట్ల ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది.2036 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి జనాభా 57.32శాతం ఉంటుందని జనాభా కమిషన్ అంచనా వేసింది. 2036 నాటికి జనాభా కమిషన్ ప్రకారం దేశ జనాభాలో 39.06శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని తెలిపింది. 2022 నాటికి దేశంలో పట్టణ జనాభా 34.75శాతానికి చేరుకుంటుందని జనాభా కమిషన్ అంచనా వేసింది.
హైదరాబాద్‌లోనే 20శాతం జనాభా
2011 జనగణన ప్రకారం 29 జిల్లాల్లో 50శాతం కంటే తక్కువ జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అత్యధిక పట్టణ జనాభా గల ఐదు జిల్లాలు వరుసగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, హన్మకొండ, రంగారెడ్డి, మంచిర్యాల. అత్యల్ప పట్టణ జనాభా గల 5 జిల్లాలు వరుసగా ములుగు, వరంగల్, నారాయణపేట, మెదక్, మహబూబాబాద్. రాష్ట్ర మొత్తం భూ వైశాల్యంలో హైదరాబాద్ జిల్లా భూ వైశాల్యం 0.6శాతం. రాష్ట్ర జనాభాలో 20శాతంపైన ప్రజలు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 142 అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయి. 2022 నాటికి రాష్ట్ర జనాభా, దేశ పట్టణ జనాభాతో పోలిస్తే 12.1శాతం పాయింట్లు పెరుగుతుందని జనాభా కమిషన్ అంచనా వేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ములుగు జిల్లా పట్టణ జనాభా 3.9శాతం.
సరిహద్దు జిల్లాలు
నాలుగు రాష్ట్రాలతో సరిహద్దును తెలంగాణ కలిగి ఉంది. 21 జిల్లాలు నాలుగు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి. మహారాష్ట్రతో ఏడు జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి.. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి. ఆంధ్రప్రదేశ్‌తో 7 జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల. కర్ణాటకతో నాలుగు జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి.. సంగారెడ్డి, వికారాబాద్, నారాయపేట, జోగులాంబ గద్వాల రాష్ట్రంలోని 3 జిల్లాలు ఛత్తీస్‌గఢ్ తో సరిహద్దును కలిగి ఉన్నాయి. అవి.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. కొన్ని జిల్లాలు రెండు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దును కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో భద్రాద్రికొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో జోగులాంబ గద్వాల, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కామారెడ్డి జిల్లా సరిహద్దును కలిగి ఉన్నాయి.
మండలాలు, రెవెన్యూ డివిజన్లు
ప్రస్తుతం తెలంగాణలో 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. (హుజూర్నగర్, వేములవాడ, ఆందోల్– జోగిపేట కలుపుకొని) 594 మండలాలు (మసాయిపేట మండలం(మెదక్ జిల్లా), చౌటకూర్ మండలం(సంగారెడ్డి జిల్లా)లను కలుపుకొని) ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెవెన్యూ డివిజన్ గల జిల్లా రంగారెడ్డి. ఈ జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అవి.. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్, షాద్‌నగర్. ఆరు జిల్లాల్లో ఒక్కో రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉన్నాయి. అవి.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట. రాష్ట్రంలో అత్యధికంగా మండలాలు గల జిల్లా నల్లగొండ. ఈ జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి. అత్యల్ప మండలాలు గల జిల్లా ములుగు. ఈ జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి.