- ‘బి-21 రైడర్’ యుద్ధవిమానం తయారు చేస్తున్న అమెరికా
- శత్రువులకు చిక్కదు.. టార్గెట్ మిస్సవదు
- 2025 నాటికి సిద్ధం.. కనీసం100 విమానాలతో ఫ్లీట్
సైనిక బలంలో ఇప్పటికే వరల్డ్ నెంబర్ వన్ గా ఉన్న అమెరికా మరో పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేస్తోంది. అది.. శత్రువుల నిఘాకు చిక్కదు. భూమిపై ఎక్కడైనా సరే.. ఎలాంటి టార్గెట్ అయినా సరే.. మెరుపువేగంతో దూసుకెళ్లి తుత్తునియలు చేసి రాగలదు! ఇప్పటివరకూ అమెరికా వద్ద ఉన్న అన్ని బాంబర్ల కంటే చాలా శక్తిమంతమైన బాంబర్‌గా రంగంలోకి దిగనున్న ఆ యుద్ధవిమానం పేరు ‘బి-21 రైడర్’! ప్రస్తుతం అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న బాంబర్లలో 90శాతం విమానాలను పక్కన పడేసి, సుమారు 100 బి 21 రైడర్లను మోహరించాలని ఆ దేశం ఆలోచిస్తోంది. అన్నీ అనుకున్నట్లు సాగితే 2025 నాటికి తొలి బి21 రైడర్ సిద్ధం కానుందని చెబుతున్నారు. దీనిని అమెరికాకు చెందిన నార్త్ రాప్ గ్రమ్మన్ కంపెనీ తయారు చేస్తోంది. ఒక్క యూనిట్ తయారీకే దాదాపు 564 మిలియన్ డాలర్లు అవుతుందని అంచనా. మన రూపాయల్లో చెప్పుకోవాలంటే.. రూ. 4 వేల కోట్ల పైమాటే అన్నమాట! అమెరికా తన లాంగ్ రేంజ్ బాంబర్లను ఇప్పటివరకూ మిత్రదేశాలకు సైతం అమ్మలేదు. కానీ బి21 బాంబర్లను ఆస్ట్రేలియాకు అమ్మే చాన్స్ ఉందని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఎప్పటినుంచో కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని అమెరికా ఇకపై బ్రేక్ చేయనుందని, దీర్ఘకాలికంగా నమ్మకమైన మిత్రదేశంగా ఉంటూ వస్తున్న ఆస్ట్రేలియాకు బి21 రైడర్లను అమ్మే అవకాశం ఉందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సీనియర్ అనలిస్ట్ మార్కస్ హేలర్ పేర్కొంటున్నారు. బి21 రైడర్ లాంటి అధునాతన టెక్నాలజీని హ్యాండిల్ చేయగలిగే సత్తా ప్రస్తుతం అమెరికా తర్వాత ఆస్ట్రేలియాకు మాత్రమే ఉందన్నారు.