బీపాస్ కు ట్రబుల్.. ఆందోళనలో బాధితులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీపాస్ నిరుపయోగంగా మారుతోంది. బీపాస్ ద్వారా ఇళ్ల నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే…అనుమతి వచ్చినట్టే వచ్చి మళ్లీ రద్దు అవుతున్నాయి. అనుమతి కోసం తీసుకుంటున్న ఫీజు రిఫండ్ కావడం లేదు. దీంతో బాధితులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. బీపాస్  సాంకేతిక సమస్యల  పరిష్కారానికి మరో మూడు నెలలు పడుతుందంటున్నారు అధికారులు.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో 58 డివిజన్ లున్నాయి. వీటిలో కొత్తగా  భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇళ్లు కట్టుకున్న వాళ్లంతా పర్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటే అధికారులకు చేరటం లేదు. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించినప్పటికీ అకౌంట్ లో జమ కావటం లేదంటున్నారు అధికారులు. తాము చెల్లించే డబ్బులు ఎటు వెళ్తున్నాయో అర్ధం కావటం లేదంటున్నారు దరఖాస్తుదారులు.

ప్రజల సందేహాలు తీర్చేందుకు బల్దియా ఆఫీస్ లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు అందుబాటులో ఉండటం లేదంటున్నారు దరఖాస్తుదారులు. తమ దరఖాస్తులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియడం లేదంటున్నారు బాధితులు. సకాలంలో అనుమతులు రాకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయంటున్నారు దరఖాస్తుదారులు. సాంకేతిక సమస్యలు త్వరగా  పరిష్కరించాలంటున్నారు.