
- బాలుడిని కుక్క కరవడంతో టీకా అవసరం లేదని చెప్పిన
- స్థానిక పీహెచ్ సీ సిబ్బంది
- రేబిస్ లక్షణాలతో మృతిచెందడంతో ఆందోళనకు దిగిన బాధిత కుటుంబ సభ్యులు
- గద్వాల జిల్లా క్యాతూర్ లో ఘటన
అలంపూర్, వెలుగు: బాబు మృతికి వైద్య సిబ్బంది నే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. అలంపూర్ మండలం క్యాతూర్ కు చెందిన సాయికుమార్, వెంకటలక్ష్మి దంపతులకు కొడుకు హర్షవర్ధన్(5), కూతురు హర్షిత ఉన్నారు.
గత నెల 22న ఇంటి ముందు ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా కుక్క కరిచింది. వెంటనే స్థానిక పీహెచ్ సీకి తీసుకెళ్లారు. ఆలంపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పగా అక్కడికి వెళ్లగా కూతురు హర్షితకు మాత్రమే కుక్క కాటు టీకా వేశారు. మరో టీకా బయటకు తీస్తే రూ. 4 వేలు ఖర్చు అవుతుందని బాలుడికి అవసరం లేదంటూ వైద్య సిబ్బంది చెప్పి పంపించారు. శనివారం బాలుడు హర్షవర్ధన్ వింతగా ప్రవర్తిస్తుండడంతో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
డాక్టర్లు పరీక్షలు చేసి రేబిస్ సోకి ఫైనల్ స్టేజ్ లో ఉందని బాలుడు బతకడం కష్టమని చెప్పారు. దీంతో హైదరాబాద్కు వెళ్లగా అక్కడ కూడా అలాగే చెప్పడంతో చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బాబు చనిపోయాడు. వైద్య సిబ్బంది టీకా వేయకపోవడంతోనే బాబు చనిపోయాడని ఆరోపిస్తూ డెడ్ బాడీతో పీహెచ్ సీ వద్దకు ఆదివారం వచ్చి ధర్నాకు దిగారు. బాబు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. ఎస్ఐ వెంకటస్వామి వెళ్లి నచ్చజెప్పినా వినలేదు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.