వేములవాడ, వెలుగు : ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ గర్భంలోనే శిశువు మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన చందు-, అమూల్యకు మూడు సంవత్సరాల క్రితం పెండ్లయింది. తొలి కాన్పుకు సమయం కావడంతో వేములవాడ ఏరియా హాస్పిటల్ లో మూడు రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. ఆపరేషన్ చేయాలని అమూల్య బంధువులు వేడుకున్నారు.
అయితే, అనస్తీషియా చేసే డాక్టర్ అందుబాటులో లేడని, ఆపరేషన్ చేసే డాక్టర్ లేడని డాక్టర్లు పొంతనలేని సమాధానాలు చెప్పారు. అమూల్య అప్పటికే తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోంది. బాధితులు మొరపెట్టుకోవడంతో డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. అప్పటికే గర్భంలోని శిశువు చనిపోయింది. ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ఏరియా హాస్పిటల్ ముందు ధర్నాకు దిగి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేశ్ రావును వివరణ కోరగా నార్మల్ డెలివరీ చేసే క్రమంలో కడుపులో శిశువు అడ్డం తిరిగిందన్నారు. వెంటనే ఆపరేషన్ చేసే క్రమంలో శిశువు చనిపోయిందని, డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.