ఇస్కాన్​ మత ఛాందసవాద గ్రూప్!.. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులోఆ దేశ ప్రభుత్వం అఫిడవిట్​

ఇస్కాన్​ మత ఛాందసవాద గ్రూప్!.. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులోఆ దేశ ప్రభుత్వం అఫిడవిట్​

న్యూఢిల్లీ:  ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్​ క్రిష్ణ కాన్సియస్​నెస్(ఇస్కాన్​)’ అనేది  మత ఛాందసవాద సంస్థ అని బంగ్లాదేశ్​ ప్రభుత్వం పేర్కొన్నది. ఆ సంస్థపై అధ్యయనం చేస్తున్నామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దేశంలో ఇస్కాన్​ సంస్థను నిషేధిచాలంటూ కోర్టులో ఓ పిటిషన్​ దాఖలైంది. దీనిపై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఇస్కాన్​ వల్ల అల్లర్లు జరుగుతున్నాయని పిటిషనర్​ తరఫు లాయర్​ వాదించారు.  సనాతన్‌‌ జాగరణ్‌‌ మంచ్‌‌ ప్రతినిధి,  ఇస్కాన్​ సంస్థకు చెందిన చిన్మయ్​ కృష్ణదాస్ బ్రహ్మచారి బెయిల్​ నిరాకరణ తర్వాత చెలరేగిన ఘర్షణలు, లాయర్ మృతిచెందిన విషయాన్ని ప్రస్తావించారు. 

దీంతో  ఇస్కాన్​ గురించి అటార్నీ జనరల్​ను కోర్టు ఆరా తీయగా, ఆయన ప్రభుత్వం తరఫున అఫిడవిట్​ సమర్పించారు. ఇస్కాన్​ ఒక మత ఛాందసవాద సంస్థ అని తెలిపారు. ఆ సంస్థను నిషేధించే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. దీంతో.. ఇస్కాన్‌‌పై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాన్ని గురువారం ఉదయం కల్లా  తెలపాలని కోర్టు ఆదేశించింది. కాగా, కృష్ణదాస్ అరెస్ట్ కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఓ లాయర్ హత్యకు గురైన ఘటనకు సంబంధించి 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అవినీతి కేసులో నిర్దోషిగా ఖలీదా జియా..

అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్​ మాజీ ప్రధాని, బీఎన్​పీ చైర్​పర్సన్​ ఖలీదా జియాను ఆ దేశ సుప్రీంకోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. జియా చారిటబుల్​ ట్రస్ట్​ అవినీతి కేసులో 2018లో జియా (79)కు ఢాకా కోర్టు ఏడేండ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించింది. దీంతో ఆమె ఓల్డ్​ ఢాకా సెంట్రల్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో మరో ఇద్దరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.  

 మైనార్టీల పరిస్థితి ఆందోళనకరం: మాజీ మంత్రి 

బంగ్లాదేశ్​లో మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి హసన్​ మహ్మద్​ ఆందోళన వ్యక్తం చేశారు.  మహ్మద్​ యూనస్​ నేతృత్వంలోని తాత్కాలిక సర్కారు ప్రజాస్వామ్య దేశంలో అసమ్మతిని రాజేస్తున్నదని మండిపడ్డారు. అజ్ఞాతంలో ఉన్న ఆయన బుధవారం పీటీఐతో టెలిఫోన్​ ఇంటర్వ్యూలో మాట్లాడారు.  యూనస్ సర్కారు కారణంగా బంగ్లాదేశ్ లో టెర్రరిస్టు సంస్థలు రెచ్చిపోతున్నాయని, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని హసన్ మహ్మద్ తెలిపారు.