- అడ్డూ అదుపు లేకుండా అలవి వలల వాడకం
- చూసీ చూడనట్లు వదిలేస్తున్న అధికారులు
- జాయింట్ ఆపరేషన్ ఎన్నడో?
నాగర్‌కర్నూల్, వెలుగు: కృష్ణానది తీరం చేపపిల్లల అక్రమ దందాకు అడ్డాగా మారింది. కొల్లాపూర్,పెంట్లవెల్లి మండల కేంద్రాల్లో తిష్టవేసిన అక్రమార్కులు పక్క రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించి కృష్ణాతీర గ్రామాల్లో క్యాంపులు వేస్తూ నదిని జల్లెడ పడుతున్నారు. కృష్ణానదిలో అలవి వలల వాడకంపై నిషేధం ఉన్నా.. విచ్చలవిడిగా వాడుతున్నారు. ఫారెస్ట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్లు అప్పుడప్పుడు దాడులు చేసి వలలు స్వాధీనం చేసుకుని హెచ్చరికలతో వదిలిపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బ్యాక్‌వాటర్‌లో వందల కోట్లు వెచ్చించి నదిలో వదులుతున్న చేపపిల్లలు అలవి వలలకు బలవుతున్నాయి.
కృష్ణా తీరంలో ఉన్న కొల్లాపూర్, పెంట్లవెల్లి, చిన్నంబావి మండలాల్లోని ఏటి ఒడ్డు గ్రామాలైన అమరగిరి, సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, ఏమ్కల్, జటప్రోల్, చెల్లపాడు, కాలూరు, పెదమారూర్, చిన్న మారూర్, వెల్టూరు, గూడెం, బెక్కెం, పెంట బస్వాపూరం గ్రామాల్లో అలవి వలల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మహారాష్ట్ర, నుంచి చేపలు పట్టేవారిని కాంట్రాక్ట్ మీద రప్పిస్తున్న బ్రోకర్లు వారికి బోట్లు, నాటు పడవలు, అలవి వలలు సమకూరుస్తున్నారు. రాత్రి నదిలో వేటాడుతున్న మత్య్సకారులు భారీ వలలు వేసి అన్ని సైజుల చేపలను వేటాడుతున్నారు. నది తీరంలో గుడిసెలు వేసుకుని ఉండే వారి కుటుంబాలు చేపలను ఎండబెట్టి ఒట్టి చేపలుగా మారుస్తున్నారు. జిల్లాలోని 1, 060 చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో దాదాపు 2.50 కోట్ల చేపపిల్లలు వదిలేందుకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేయగా కొల్లాపూర్, పెంట్ల వెల్లి మండలాల్లోని కృష్ణా బ్యాక్ వాటర్‌లో దాదాపు 30 లక్షల చేపపిల్లలు వదిలేందుకు సిద్ధమయ్యారు. మరో 15 రోజుల్లో చేప పిల్లలు వదలనున్నట్లు సమాచారం. ప్రభుత్వం కోట్లు వెచ్చించి వదులుతున్న చేపపిల్లలు ఎదగకుండానే దళారులు అండతో ఆంధ్రా మత్య్సకారులు అలవి వలలు వినియోగించి అడుగు నుంచి లాగేస్తున్నారు.
క్వింటాల్‌కు రూ.30వేలు..
చేపలను ఎండబెట్టిన తర్వాత ఆంధ్రా, రాయలసీమ, ఒడిశా, మహారాష్ట్ర, కోల్‌కతా వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. క్వింటాల్ ఒట్టి చేపల ధర దాదాపు రూ.30 వేల వరకు పలుకుతుందని సమాచారం. స్థానికంగా చేపలు పట్టే మత్స్యకారులు లోకల్ మార్కెట్‌తో పాటు బయటకు ఎగుమతి చేస్తుండగా ఒట్టి చేపలను మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అమ్ముతున్నారు.
నిషేధించినా చర్యలేవి?
కృష్ణా నదిలో అలవి వలల వాడకంపై నిషేధం ఉందా.. అంటే ఉంది..! లేదు అంటే లేదు..! అన్నట్లు గా ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారు. ఫారెస్ట్, రెవెన్యూ, ఫిషరీస్, పోలీస్ శాఖల నిఘా ఉన్నా టన్నుల కొద్ది చేపలను బాహాటంగా ఎండబెట్టి ట్రాన్స్పోర్ట్చేస్తున్నారంటే సహకారం ఎంత పక్కాగా ఉందో అర్థమవుతుంది. నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణానదిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్పర్మిషన్లేకుండా పడవలు, బోట్లు నడపడం ఇంత ఈజీనా? అనే విధంగా ఆపరేషన్ చేస్తున్నారు. 4 లైన్ డిపార్ట్మెంట్లలో ఏ ఒక్క శాఖ కూడా దాడులు చేయలేదంటే దళారులు ఎంత పవర్‌ఫుల్‌గా మేనేజ్చేస్తున్నారో అర్థమవుతుంది.
జాయింట్ ఆపరేషన్ చేపడతాం
కృష్ణానదిలో అలవి వలల వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఎవరు వాడినా కఠినచర్యలు తీసుకుంటాం. త్వరలో కృష్ణా బ్యాక్‌వాటర్‌లో 30లక్షల చేపపిల్లలు వదలనున్నాం. ఎస్పీ, కొల్లాపూర్ ఆర్డీవోకు లెటర్స్ రాసినం. త్వరలో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తాం. – లక్ష్మప్ప, ఫిషరీస్ ఏడీ