రెవెన్యూ డివిజన్ల పోరు..ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్న చేర్యాల ప్రజలు

రెవెన్యూ డివిజన్ల పోరు..ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్న చేర్యాల ప్రజలు
  • రామాయంపేటలో 76 రోజులుగా జేఏసీ దీక్షలు
  • రెండు రోజుల బంద్ సక్సెస్
  • తిగుల్ మండలం కోసం 314 రోజులుగా నిరసనలు

సిద్దిపేట, మెదక్, వెలుగు: ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రాలుగా ఓ వెలుగు వెలిగిన రామాయంపేట, చేర్యాల ప్రాంతాలు ఇప్పుడు రెవెన్యూ డివిజన్లకు కూడా నోచుకోవడం లేదు.  డివిజన్ల ఏర్పాటు కోసం జేఏసీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నా సర్కారు స్పందించడం లేదు. రామాయంపేటలో నిర్వహిస్తున్న దీక్షలు 76 రోజులకు చేరాయి.  నిరసనల్లో భాగంగా రెండు రోజుల బంద్‌(శుక్ర,శనివారాలు)కు పిలుపునివ్వగా ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు.  శనివారం పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి.. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు. అలాగే చేర్యాలను డివిజన్‌ చేయాలని అక్కడి ప్రజలు ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో జేఏసీ ఆధ్వర్యంలో మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. 

2019లో నియోజకవర్గం రద్దు

నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేట 2019లో పునర్విభజనలో భాగంగా రద్దయింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌‌ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేసినా రామాయంపేటకు స్థానం దక్కలేదు. కానీ, తూప్రాన్, నర్సాపూర్‌‌లను మాత్రం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రామాయంపేట పట్టణం, మండల పరిధిలోని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. 2017–18 రెవెన్యూ డివిజన్​సాధన కోసం ఏకంగా 183 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశారు.  మంత్రి హరీశ్‌ హామీ ఇవ్వడంతో విరమించారు. కానీ, ఎలాంటి ప్రకటన రాకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 27 నుంచి మళ్లీ రిలే నిరాహార దీక్షలు షురూ చేశారు.  ఈ దీక్షలకు అన్ని పార్టీలు, సంఘాల నేతలు మద్దతు తెలిపారు.  

ఆరేండ్లుగా నానుతున్న చేర్యాల డిమాండ్

గతంలో పంచాయతీ సమితిగా, తాలూకా కేంద్రంగా, నియోజకవర్గంగా ఉన్న చేర్యాలను కనీసం రెవెన్యూ డివిజన్ చేయాలని ఇక్కడి ప్రజలు ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వాణిజ్య వర్గాలు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. 2020  ఫిబ్రవరిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప రెడ్డి ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించినా, కొన్నిరోజులుగా కాంగ్రెస్, సీపీఎం, బీఎస్పీ, బీజేపీ, ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు.  ప్రస్తుతం చేర్యాల, కొమురవెల్లి  మండలాలు సిద్దిపేట డివిజన్‌లో, మద్దూరు, దుల్మిట్ట మండలాలు హుస్నాబాద్ డివిజన్‌లో కొనసాగుతున్నాయి.  స్థానికులకు ఇబ్బందిగా మారడంతో చేర్యాల కేంద్రంగా కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట  మండలాలను కలిపి కొత్త రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పటికే బంద్ లు, ర్యాలీలు నిర్వహించినా..  వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు జేఏసీ సిద్ధం అవుతోంది. 

తిగుల్ కోసం ముడుపు కట్టి ముందుకు

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తిగుల్‌ను కొత్త మండలం చేయాలని చేపట్టిన నిరసనలు 314 రోజులకు చేరాయి.  ఇక్కడి ప్రజలు పోస్ట్ కార్డుల ఉద్యమం, వంటా వార్పు, ఎడ్ల బండ్ల ర్యాలీ లాంటి నిరసనలతో పాటు కొండ పొచమ్మ దేవాలయం వరకు పాదయాత్ర చేసి అమ్మవారికి ముడుపు కట్టారు. ఇప్పటికే  బీజీ వెంకటాపూర్, వట్టిపల్లి, తిర్మల్ నగర్, హన్మాజీపేట,అంగడి కిష్టాపూర్, గణేష్​పల్లి ,తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. తమ డిమాండ్ నెరవేర్చకుంటే  వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా సర్కారు నుంచి స్పందన రావడం లేదు.

కార్యాచరణ సిద్ధం చేస్తున్నం

చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ కోసం గ్రామాల్లో కమిటీలు వేసినం.  పక్కా ప్రణాళిక సిద్ధం చేసి రాజకీయ పార్టీలు, ప్రజా, ఉద్యోగ, కార్మిక సంఘాలతో కలసి ముందుకు వెళ్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించినం. 

రామగళ్ల పరమేశ్వర్, జేఏసీ అధ్యక్షుడు

హామీ నిలబెట్టుకోవాలి

రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు హామీని నిలబెట్టుకోవాలి.  ఒకప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని  అందించిన పేట నేడు వెనుకబాటుకు గురైంది.  మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి  చిత్తశుద్ధి ఉంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలి. 

 శశిధర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే