ఆధ్యాత్మికం: యుద్దభూమే..మంచి శిక్షణా కేంద్రం

ఆధ్యాత్మికం:  యుద్దభూమే..మంచి శిక్షణా కేంద్రం

భగవద్గీత అనగానే అది ఒక మతపరమైనది మాత్రమే అనే అభిప్రాయం ఉంది. చాలా మందికి, అది పొరబాటు. అది ఆధ్యాత్మిక గ్రంథం అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాని దానికి ఒక మతం ముద్ర వేయటం సమంజసం కాదేమో...  మతం, ఆధ్యాత్మికత ఒకటి కావు అన్న సంగతిని గుర్తుంచుకోవలసి ఉంటుంది. 

ఆధ్యాత్మికతకి మతం లేదు. అది మనిషి ఔన్నత్యానికి దోహదం చేస్తుంది. ఆధ్యాత్మికత ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు. మతపరమైన బోధలు, ఉపదేశాలు ఎక్కడ జరుగుతాయి? సాధారణంగా ఏదైనా దేవాలయంలో కానీ, నదీతీరాల్లో కానీ, పుణ్యక్షేత్రాల్లో కానీ, ఇంకేదయినా పవిత్ర స్థలంలోకానీ, ఉపదేశాలు చేస్తారు. ఇది ఒక మతానికో, విశ్వాసానికో మాత్రమే పరిమితమైనది కాదు కనుక అటువంటి ప్రదేశాల్లో ఉపదేశం చేయటం జరుగలేదు. అంతే కాదు, దానికొక మంచి సమయం చూసుకుంటారు. దానికి ఎన్ని విషయాలనో పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుంది (తిథి, వారం, వర్షం, నక్షత్రం మొదలైనవి).

 కాని, భగవద్గీత ఉపదేశానికి ముహూర్తం పెట్టలేదు.. స్థలాన్ని ఎన్నుకోవటం జరగలేదు. యుద్ధం మొదలుపెట్టడానికి కొద్ది సమయం ముందు యుద్ధభూమిలో యుద్ధానికి సిద్ధంగా బారులు తీర్చి ఉన్న ఇరు సైన్యాల మధ్య చెప్పటం జరిగింది. వింతగా అనిపించటం లేదూ? 

ఆంగ్లంలో ఒక సామెత ఉంది- ఇనుముని వేడిగా ఉన్నప్పుడే కొట్టి వంచాలని చల్లబడితే ఎంత కొట్టినా అది వంగదు. తప్పదనుకుంటే మళ్ళీ కొలిమిలో పెట్టి ఎర్రగా కాల్చవలసినదే. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు అని మాత్రమే కాదు. ..అమావాస్య వచ్చే వరకు అయ్యవారు కూడా ఆగరు అని తెలుసుకోవాలి. సమయం మించిపోకుండా పని జరగాలి. ఇది సమయానికి సంబంధించింది.

ఇంక ప్రదేశం విషయానికి వస్తే ... పిరికితనంతో పారిపోయే వాడికి బోధ చేయవలసినది అక్కడే. ప్రశాంతంగా భోజనం చేసి, తాంబూలం వేసుకుని, చల్లగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చెపితే వినటానికి కమ్మగా, హాయిగా ఉంటుంది. తరువాత ఏమాత్రం గుర్తు ఉంటుందో తెలియదు. కాని, అత్యవసర పరిస్థితిలో, దిక్కు తోచని స్థితిలో, సముద్రంలో మునిగి పోతున్నవాడు గడ్డిపరక దొరికినా ఏదో ఆధారం దొరికిందని భావించే పరిస్థితిలో భుజం తట్టి ధైర్యం చెపుతూ ఏమి చెప్పినా మనసుకెక్కుతుంది. మంత్రం లాగా పనిచేస్తుంది. 

అర్జునుడి మానసికస్థితి ఆ సమయంలో అట్లాగే ఉంది. కనుక ఏం చెప్పినా మనసుకి హత్తుకుపోతుంది. ఉదాహరణకి సంవత్సరం అంతా తరగతి గదుల్లో చెప్పిన దానికన్నా పరీక్షలకి ఒకటి రెండు రోజుల ముందు చెప్పినది బాగా తలకెక్కుతుంది. చదవటం కూడా అంతే. పరీక్షలకి ముందు చదివినది బాగా గుర్తు ఉంటుంది. అవసరం నెత్తిన కూర్చుంటే ఎటువంటిదైనా బాగా అర్థం అవుతుంది. 

సిద్ధాంతపరంగా ఎంత నేర్చుకున్నా వంటపట్టేది మాత్రం అనుభవంలోకి వస్తేనే. అది కూడా అత్యవసర పరిస్థితుల్లో యుద్ధం అంటే తాత్కాలికంగా భయపడుతున్న వారికి బోధించటానికి తగిన చోటు యుద్ధ భూమి మాత్రమే. నిజానికి యుద్ధం చేసేవారికి మాత్రమే కాదు. ఎవరికైనా ఆధ్యాత్మికత వంటపట్టటానికి వైరాగ్యం స్థిరపడటానికి యుద్ధభూమి తగినచోటు. జీవితం ఎంత అశాశ్వతమైనదో ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది. శాశ్వతమైన దానిని తెలుసుకుని సాధించటానికి ప్రేరణ కలగటానికి తగిన తావు అది. ఈ కాలంలో అందరు యుద్ధభూమికి వెళ్ళలేరు. ఏ  కాలంలోనైనా అందరికీ అవకాశం రాదు. మరి, అటువంటప్పుడు వైరాగ్యం కలగాలంటే ఒక్కసారి ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే చాలు. 

తన సమకాలిక చరిత్రని గ్రంథస్థం చేస్తూ ప్రసంగవశాన వ్యాసమహర్షి ఎన్నో గీతలని కూర్చటం జరిగింది. కాని, అన్నిటికన్న ప్రఖ్యాతి పొందింది. ప్రత్యేక గ్రంథ స్థాయిని సంతరించుకున్నది శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో బోధించినది మాత్రమే..అర్జునుడు ఒక వంక, ఒక ప్రతీక. అంతే యుద్ధభూమి కూడా ప్రతీకయే. మన శరీరం, జీవితం అన్నీ కూడా యుద్ధరంగాలే. శరీరంలో నిరంతరం మంచి, చెడు కణాలకి, ప్రజ్ఞలకి, ఆరోగ్యానికి, అనారోగ్యానికి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. జీవితం నిరంతరం యుద్ధమే అని అనటం మనం వింటూనే ఉంటాం. 

ఎప్పుడు ఏదో ఘర్షణ - ఆశ, నిరాశ, కష్టాలు, సుఖాలు, మంచి చెదులు, శుభాశుభాలు మొదలైనవాటి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. పరిస్థితులతో యుద్ధం చేస్తున్నాను అంటూ ఉంటారు క్లిష్ట పరిస్థితులని ఎదుర్కొంటున్నప్పుడు సాధించటానికి చేసే ప్రయత్నాలన్నింటిని యుద్ధంతో పోల్చి చెప్పటం పరిపాటి. ఎవరు ఏ యుద్ధం చేస్తుంటే, ఆచరణ రంగస్థలంలోనే బోధ చేస్తే వెంటనే ఆచరణలోకి వస్తుంది. 

ఇక బయటి ప్రపంచంలోకి వస్తే.. మంచి, చెడు శక్తుల మధ్య జరిగే ఘర్షణకి అందరూ సాక్షులే.. మానవజాతిలో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండే ధర్మాధర్మాల సంఘర్షణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే భౌతికలోకంలోని వ్యక్త సన్నివేశము ప్రతిదానికి సూక్ష్మ లోకాలలో జరుగుతూ ఉండే కథ ఒకటి ఉంటుంది. అది అర్ధం అవటానికే పరమమైన జ్ఞానబోధకి తగిన వేదికగా యుద్ధ భూమిని ఎన్నుకోవటం జరిగింది.

–వెలుగు,లైఫ్​‌‌–