విశ్లేషణ: ఓట్లు గావాలె.. కానీ బీసీల లెక్కలొద్దా?

రాజకీయ నాయకులకు బీసీల ఓట్లు కావాలి కానీ, వారి లెక్కలు వద్దా? స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయినా బీసీల జనాభాను లెక్కించేందుకు పాలక వర్గాలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయి. ఓటు బ్యాంకు చీలిపోతుందని, పెద్ద కులాలకు అధికారం దూరమవుతుందనే బీసీ కులాల లెక్కలు తీసేందుకు ముందుకు రావడం లేదా? కులాలవారీ లెక్కలు లేకుంటే వెనుకబడిన తరగతుల సామాజిక పరిస్థితులు ఎలా తెలుస్తాయి? అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనే విషయం తెలియాలంటే కులాల లెక్కలు తీయాల్సిందే. ఈసారి మీకు ఓట్లు కావాలంటే.. బీసీ కులాల వారీగా లెక్కలు తేలాల్సిందే.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆరుసార్లు తీసిన జనాభా లెక్కల్లో బీసీ కులాల వారి లెక్కల తీయలేదు. కానీ ఈసారి బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలనే డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. మన దేశంలో కులం ఉంది.. కులమే అన్నింటినీ శాసిస్తోంది. రాజ్యాంగంలో కులాల పేరు మీద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాల జనాభా లెక్కలను మొదటి నుంచి తీస్తున్నారు. అలాగే స్త్రీ, పురుషుల జనాభా లెక్క ఉంది. కానీ, బీసీ కులాల జనాభా వివరాలు కావాలని డిమాండ్​ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. 

సంక్షేమ పథకాల అమలు ఎట్లా?

కులాల వారీగా జనాభా లెక్కలు లేకుండా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా అమలుపరచాలి. ఏ కులమైనా లెక్కలు ఉంటేనే సంబంధిత కులాల పరిస్థితులను బట్టి పేదవారికి రిజర్వేషన్‌ను అందించే వీలుంటుంది. ఆనాటి బ్రిటిష్ పాలకులు కూడా సమాజాభివృద్ధికి కులాల లెక్కలు అవసరమని భావించి, 1872 నుంచి జనాభా లెక్కలతో పాటు కులాల వారీగా లెక్కలను తీయడం మొదలుపెట్టారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం చివరిసారిగా 1931లో కులాల వారీగా లెక్కలు తీసింది. కులాల వారీ సమాచారంతోనే విద్యలో శూద్రులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. 2021లో జనాభా లెక్కలు చేపట్టడానికి 32 కాలమ్స్ తో కూడిన నమూనా పత్రం విడుదల చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల వివరాల కాలం అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల వివరాలు, ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ ఉన్నాయి కానీ, బీసీ కులాల వివరాలకు సంబంధించిన కాలం పెట్టలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధి కోసం అనేక స్కీమ్‌లు ప్రవేశపెట్టాయి. బడ్జెట్ కూడా కేటాయిస్తున్నాయి. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు.. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల సందర్భంలో బీసీల లెక్కల వివరాలు అవసరం పడుతున్నాయి.

మన దేశంలో బీసీ జనాభా లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా లెక్కలు లేనందున రిజర్వేషన్లకు సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టులు కొట్టేస్తున్నాయి. ఏ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను బీసీలకు కేటాయించాలి. ఎంత శాతం కేటాయించాలనే విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక న్యాయపరమైన, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా కూడా బీసీ జనాభా లెక్కలు లేక సమస్యలు వస్తున్నాయి. గ్రామీణ అభివృద్ధి పథకాలు, ఇండ్ల పథకాలు, స్వయం ఉపాధి పథకాలకు బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా ప్రభుత్వాలే ఇబ్బందులు పడుతున్నాయి.

జాతీయ స్థాయిలో ఒకేరకంగాలేని లెక్కలు..

కులాల వారీగా జనాభా లెక్కలు లేనందు వల్ల రిజర్వేషన్లు ఎంత శాతం నిర్ణయించాలని అంశంపై మొదటి నుంచి కన్‌ఫ్యూజనే. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన కులాల వారీ లెక్కలపై ఆధారపడి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కలు జాతీయస్థాయిలో ఒకేలా లేవు. జనాభా అభివృద్ధి రేటు కూడా అన్ని కులాల్లో ఒకే రకంగా లేదు. అందుకే జనాభా లెక్కలను కులాల వారీగా చేపట్టాలని 1953లో కేంద్రం నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్ సిఫార్సు చేసింది. అలాగే 1978లో కేంద్రం నియమించిన మండల్ కమిషన్ కూడా కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని సిఫార్సు చేసింది. ఉమ్మడి ఏపీ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్‌లు కూడా కులాల వారిగా బీసీల లెక్కలు తీయాలని సిఫార్సు చేశాయి.

అదనపు ఖర్చు ఉండదు..

బీసీ రిజర్వేషన్లలో గ్రూపుల వర్గీకరణ కోసం కేంద్రం జస్టిస్ రోహిణి చైర్మన్​గా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. కులాలవారీగా జనాభా లెక్కలు లేకపోవడంతో ఏ గ్రూపునకు ఎంత శాతం రిజర్వేషన్​ నిర్ణయించాలో తెలియక ఈ కమిటీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2010లో కులాల వారీగా బీసీల లెక్కలు తీయడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం అంగీకరించింది. అయితే అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ప్రత్యేకంగా బీసీ జనాభా లెక్కలు తీయడానికి నిధులు కేటాయించింది. బీసీ కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ బాధ్యతను కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పింది. చాలా రాష్ట్రాలు బీసీల లెక్కలను సేకరించినా.. నిబంధనలను పాటించలేదు. కొన్ని చోట్ల ఉపాధి కూలీల ద్వారా, మరికొన్ని చోట్ల అంగన్​వాడీ టీచర్ల ద్వారా, ఇంకొన్ని చోట్ల ఎన్జీవోల ద్వారా సమాచార సేకరణ జరిపారు. మొక్కుబడిగా సేకరించిన ఈ లెక్కల్లో వేల తప్పులు దొర్లాయి. వీటి ఆధారంగా సమగ్ర జాబితా తయారు చేయడానికి ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్‌తో ఒక కమిటీ వేశారు. కానీ, ఆ తర్వాత వాటి వివరాలను ప్రకటించలేదు. వాస్తవానికి ఇందులో శాస్త్రీయత లేదు, కోర్టులో నిలబడదు, అమలులో ఉపయోగపడదు.

కులాల వారీగా బీసీ జనాభా లెక్కలు తీయాలని 2010లో పార్లమెంట్​లో బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్నందున తమ డిమాండ్​ను నెరవేర్చుకోవాలి. సమయం మించిపోలేదు. పైగా దీనికి ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదు. 2018లో అప్పటి హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నిర్వహించిన సమావేశంలో కూడా బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారు? స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని కూడా రాజ్యాంగం చెబుతోంది. కానీ, జనాభా లెక్క లేకుండా రిజర్వేషన్ల శాతం ఎలా నిర్ణయిస్తారు. బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ఏ సిఫార్సు చేయాలన్నా కులాల వారీగా లెక్కలు కావాలి. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు, రక్షణలు, రిజర్వేషన్ల కోసం కూడా ఈ లెక్కలు అవసరం.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆరుసార్లు తీసిన జనాభా లెక్కల్లో బీసీ కులాల వారి లెక్కల తీయలేదు. కానీ ఈసారి బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలనే డిమాండ్ బలంగా ముందుకొచ్చింది. మన దేశంలో కులం ఉంది.. కులమే అన్నింటినీ శాసిస్తోంది. రాజ్యాంగంలో కులాల పేరు మీద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాల జనాభా లెక్కలను మొదటి నుంచి తీస్తున్నారు. అలాగే స్త్రీ, పురుషుల జనాభా లెక్క ఉంది. కానీ, బీసీ కులాల జనాభా వివరాలు కావాలని డిమాండ్​ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. 

కోర్టు తీర్పుల ప్రకారం లెక్కలు తీయాలి

రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జోక్యం చేసుకుని కులాల వారీగా జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచారని/పెట్టారని ప్రభుత్వాలను ప్రశ్నించాయి. మండల్ కమిషన్ కేసు సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 1986లో ఎన్టీఆర్ మురళీధర్ రావు కమిషన్ సిఫారసు ప్రకారం బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచినప్పుడు లెక్కలు లేకుండా ఎలా పెంచారని ఏపీ హైకోర్టు కూడా ప్రశ్నించింది. పెంచిన రిజర్వేషన్లను కొట్టివేసింది. 2010లో కర్నాటక ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% కోటా పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా పెంచిన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు కొట్టేసింది. జనాభా లెక్కల వివరాలు శాస్త్రీయంగా ఉంటే ఆ మేరకు పెంచవచ్చని తీర్పు చెప్పింది. కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని 1996లో బీసీ సంక్షేమ సంఘం కేసు వేసింది. స్పందించిన హైకోర్టు బీసీ కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని చెప్పింది.

మన్నారం నాగరాజు, 

సోషల్ ఎనలిస్ట్