విశ్లేషణ: సమగ్ర సర్వే బీసీ లెక్కలు బయట పెట్టాలి

ఈసారి తీసే జనాభా లెక్కల్లో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. తీర్మానం చేయడం వరకు బాగానే ఉన్నా.. నాలుగేండ్ల క్రితం రాష్ట్రంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను సర్కారు ఎందుకు బయటపెట్టడం లేదు. ఆ లెక్కలు బయటపెడితే రాష్ట్రంలో బీసీల వాస్తవ జనాభా ఎంతో తెలుస్తుంది కదా! తమ ప్రభుత్వం సమగ్ర సర్వే ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా బీసీ జనాభా లెక్కలను కేసీఆర్​ ముందు బయట పెట్టాలి. ఆ తర్వాత కేంద్రాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది. అంతేకానీ, తన దగ్గర ఉన్న డేటా దాచిపెట్టి కేంద్రాన్ని డిమాండ్ చేయడం కరెక్ట్​ కాదు. 

దేశ జనాభాలో మా వాటా ఎంతో తేల్చండంటూ బీసీలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. జనాభా లెక్కలు తీసే సమయంలోనే కులాల వారీగా ఎవరెంత మంది అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ, ఇతర అభివృద్ధి చెందిన కులాల జనాభా లెక్కలను కూడా తేల్చాల్సి ఉంది. ఎవరి జనాభా ఎంతో తేలితేనే వారికి రాజ్యాంగం ప్రకారం వాటాలను కేటాయించే వీలుంటుంది. 
 

దేశ జనాభాలో బీసీలు 50 శాతంపైనే..
ప్రస్తుతం దేశ జనాభాలో ఓబీసీలు 52 నుంచి 56 శాతానికి మధ్య ఉంటారని అంచనా. అయినా ఈ వర్గాలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అభివృద్ధి చెందిన కులాల్లోని పేదల కోసం ఈబీసీ పేరిట పది శాతం రిజర్వేషన్లు అమలులోకి తీసుకు వచ్చారు. అంటే 15 శాతం కూడా లేని వారి కోసం 80 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇది చట్టరీత్యా వ్యతిరేకం. అయినా కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలు వీటిని అమలు చేస్తున్నాయి. కారణం ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన కులాలకు చెందిన వారే అధికారంలో కొనసాగడమే. ‌‌‌‌15  శాతం కూడా లేని వారికి విద్య, ఉద్యోగాల్లో 80 శాతం రిజర్వేషన్‌‌‌‌ కల్పిస్తున్న ప్రభుత్వాలు 56 శాతంగా ఉన్న ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే సాకును చూపుతున్నారు. అదే అభివృద్ధి చెందిన కులాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఈ తీర్పు ఎందుకు అడ్డురాలేదు. ఓబీసీల విషయంలోనే చట్టాలు అడ్డువస్తాయా? తమిళనాడు వంటి రాష్ట్రాలు 60 శాతానికి పైగా రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయి కదా? ఇక్కడ మాత్రమే అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి. 

బీసీల లెక్కలను అడ్డుకునే కుట్ర

ఓబీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడాన్ని ఇన్నేండ్లుగా అధికారంలో కొనసాగుతూ వస్తున్న అభివృద్ధి చెందిన కులాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జనాభా లెక్కలు తీసే సమయంలో కులాలవారీగా లెక్కలు తీసినట్లయితే బీసీలు 56 నుంచి 60 శాతం వరకు తేలే అవకాశం ఉంటుంది. దీంతో తమ హక్కుల సాధనకు ఉద్యమిస్తూనే.. ఒక్క శాతం కూడా లేని వాళ్లు అధికారంలోకి వస్తున్నప్పుడు 60 శాతానికి దరిదాపుల్లో ఉన్న మేమెందుకు రాలేమనే ఆలోచన, రాగలుగుతామనే ఆత్మవిశ్వాసం ఓబీసీల్లో పెరుగుతాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓబీసీలు సత్తా చాటే అవకాశం ఉంటుంది. అదే జరిగితే పాలకులుగా చెలామణి అవుతూ వస్తున్న కులాలు పాలితులుగా మిగిలి పోవలసి వస్తుంది. ఊహలో కూడా ఈ విషయాన్ని ఆధిపత్య కులాలు తట్టుకోలేవు. ఓబీసీలను రాజ్యాధికారం ఆలోచన నుంచి దృష్టి మళ్లించాలంటే వారెంతో.. వారి బలమెంతో తెలియకుండా చేయాలి. అలా చేయాలంటే జనాభా లెక్కల్లో బీసీ కులాల వారీగా లెక్కలు ఉండకూడదు. సరిగ్గా ఇదే ఆలోచనతో ఆధిపత్య కులాల నాయకులు అడుగులు వేస్తున్నారు.

ఆధిపత్య కులాలకు ఎందుకంత బాధ?

జనాభా లెక్కల్లో బీసీలను కులాల వారీగా తేల్చాలనే డిమాండ్ పై ఆధిపత్య కులాలు విషం కక్కుతున్నాయి. బీసీ జనాభాను లెక్కించకుండా రాజ్యాంగాన్ని కించ పరిచేలా ఆధిపత్య కులాల నాయకులు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారు. ఇటు కేసీఆర్, అటు జగన్  ఆధిపత్య కులాలకు చెందిన వారే కావడంతో తమ వర్గాల ఒత్తిళ్లకు లొంగి బీసీల జనాభా లెక్కలను తీయడానికి ముందుకు రావడం లేదు. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 ఏండ్లు పూర్తయ్యాయి. ఇన్నాళ్లుగా ఆధిపత్య కులాల పాలనలో రిజర్వేషన్లు అమలవుతూనే ఉన్నాయి. కానీ ఆధిపత్య కులాల మాదిరిగా దళిత, బహుజనులు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎందుకు ఎదగలేక పోయారు? దీనికి కారణం ఆధిపత్య కులాల వాళ్లకు రాజ్యాంగం ప్రకారం రావలసిన అవకాశాలను అందకుండా చేయడమే. కులాల లెక్కన జనాభా లెక్కలు తీస్తే వారి మధ్య ఘర్షణలు పెరుగుతాయనేది పచ్చి అబబద్ధం. బీసీలు 55 శాతం ఉన్నారని ఇన్నాళ్లూ వాళ్లకు తెలియదా? 3 శాతం కూడా లేని కులాలు పాలకులుగా చెలామణి అవుతున్నారని తెలియదా? తెలిసి కూడా ఆధిపత్య కులాలతో ఏనాడూ ఘర్షణ పడలేదు కదా? బీసీల్లో 5 కులాలు మాత్రమే మెజారిటీ జనాభా కలిగి ఉన్నాయి. మిగిలిన కులాలు తక్కువ జనాభాతో ఇప్పటికీ అసెంబ్లీ మెట్లెక్కని స్థాయిలోనే ఉండిపోయాయి. మరి ఈ కులాలు పై 5 కులాలతో ఘర్షణలకు దిగలేదు కదా? తమ హక్కుల పరిరక్షణ కోసం ఎంబీసీలుగా కొనసాగుతున్నారు. ఏడున్నర దశాబ్దాల కాలంలో జరగని ఘర్షణలు ఇప్పుడు బీసీ కులాల వారీగా లెక్కిస్తే మొదలవుతాయా? అసలు ఈ వాదనే కరెక్టు కాదు. 

పోరాటం కొనసాగాలె

కులాల వారీగా కాకుండా వర్గాల వారీగా జనాభాను లెక్కించాలని కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కొందరు ముందుకు తెస్తున్నారు. అంబేద్కర్ వర్గాలను కాకుండా కులాలకు రిజర్వేషన్లను ఎందుకు కల్పించారో కూడా ఆ మేధావులకు తెలియకపోతే ఎలా? సమాజంలో వివక్షత, అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీలకు తొలుత రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన బీసీలను ఓబీసీలుగా గుర్తించి వారికి సమాన అవకాశాలు కల్పించాలని అంబేద్కర్ ప్రతిపాదించారు. రిజర్వేషన్ల విధానాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వర్గాల మధ్య జనాభా లెక్కలు ఉండాలని కోరుకోవడం ద్వారా ఆ కొందరు రిజర్వేషన్లకు ఎంత వ్యతిరేకమో చాటుకుంటున్నారు. రిజర్వేషన్ల వల్ల దళిత, బహుజనులు బాగుపడ్డారో లేదో పక్కన పెడితే.. ఏ రిజర్వేషన్లతో పిడికెడు కూడా లేని ఆధిపత్య కులాలు స్వాతంత్ర్యం తర్వాత నుంచి అధికారంలో కొనసాగుతున్నాయి. ఉద్యోగాలు, పరిశ్రమలు, వ్యాపారాలు, భూములు  ఆధిపత్య కులాల చేతుల్లోనే ఎందుకు చిక్కుబడి పోయాయి‌‌‌‌.‌‌‌‌ ఈ విషయంలో వారు ఎప్పుడైనా పోరాటం చేశారా? అటు సంపద వారి చేతుల్లోనే ఉండాలి.. ఇటు శ్రామిక వర్గాల తరపున పోరాటాలు సాగిస్తూ వారిపై ఆధిపత్యం ఆ కొందరి చేతుల్లోనే ఉండాలి. ఇదే వారి కుట్ర. ఏది ఏమైనప్పటికీ కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని బీసీలు కేంద్ర, రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ఆందోళనలు చేపడతారు. అయినా ప్రభుత్వాలు వినకుంటే రాబోయే ఎన్నికల్లో సత్తాను చాటుతారు.

సమగ్ర సర్వే రిపోర్ట్ బయటపెట్టాలె
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చి తప్పిన సీఎం కేసీఆర్ బీసీల జనాభా లెక్కలు తీయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనివల్ల ఒరిగేదేమీ లేదు. కేసీఆర్​కు బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే తన కేబినెట్ లో వారికి పెద్దపీట  వేసేవారు. కానీ ఆయన కేబినెట్ లో ఎవరెక్కువగా ఉన్నారో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో నాలుగేండ్ల క్రితం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు. ఆ సర్వే ద్వారా కులాల వారీగా సేకరించిన సమాచారంలో రాష్ట్రంలో బీసీలు ఎంత మంది అని లెక్కలు తేలి ఉండాలి కదా? జనాభా లెక్కల్లో బీసీ కులాలవారీగా లెక్కలు తీయాలని‌‌‌‌ కేంద్రంపై విమర్శలు చేస్తున్న కేసీఆర్.. తమ ప్రభుత్వం చేపట్టిన సర్వే వివరాలను ఎందుకు వెల్లడించలేదో సమాధానం చెప్పాలి. తాను బీసీ జనాభా లెక్కలను బయట పెట్టి కేంద్రం ఎందుకు తీయడంలేదో ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది. కానీ, తన దగ్గర ఉన్న సమాచారాన్ని దాచిపెట్టి కేంద్రం బీసీ లెక్కలు తీయాలని డిమాండ్ చేయడం అర్థరహితం. ‌‌‌‌అసలు సమగ్ర కుటుంబ సర్వే చేయించడానికి కారణం ఏమిటి? ఆయా కులాలకు ఉపయోగపడనప్పుడు ఒక్క రోజులో ఈ సర్వే చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా వారికి న్యాయం చేయాలనే మనసు ఉంటే కేసీఆర్ బీసీ బంధును ప్రవేశపెట్టేవారు. ఇప్పటికైనా కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలి.

జంగిటి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక