ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన గ్లోబల్ అలుమ్ని మీట్ లో ఓయూ వీసీ రవీందర్ మాట్లాడుతూ.. ఓయూ అంటే ఉద్యమాల గడ్డ కాదు.. ఉద్యోగాల గడ్డగా పేర్కొన్నారు. సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. సమాజంలో ఎక్కడ సమస్య ఉన్నా జ్ఞానంతో ఉద్యమ స్ఫూర్తితో స్పందించడం,పేద,ధనిక, మారుమూల ప్రాంత తేడా లేకుండా అందరినీ అక్కున చేర్చుకుని జ్ఞానం అందించడమే ఓయూ ప్రత్యేకత అన్నారు. ఇందులో ఏది సరైనదన్న ప్రశ్న మొదలైంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానాతో1918లో ఏర్పడిన ఓయూ సమ్మిళిత సంస్కృతికి గుర్తుగా, భారత స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించింది. ఎందరో మేధావులను, నాయకులను అందించిన ఓయూ సామాజిక బాధ్యతగా స్పందించడమనేది మొదటి నుంచి ఉన్న సహజ లక్షణం. విద్య అంతిమ లక్ష్యం వ్యక్తి ప్రవర్తనలో మార్పులు తీసుకువచ్చి ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం. అలాంటప్పుడు సామాజిక అసమానతల వల్ల అన్యాయానికి గురవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల సామాజిక సమస్యల పరిష్కారం, సమాజ మార్పు కోసం ఉద్యమాలు చేయడం విద్యావంతుల కర్తవ్యమే కదా! ఉన్నత విద్యావంతుడిగా భారత సామాజిక సమస్యలను అర్థం చేసుకున్న అంబేద్కర్ ను మహారాష్ట్రలోని ఓ గ్రామంలో జరిగిన సభలో కొల్లాపూర్ సాహు మహారాజ్ ప్రజలకు ఆయనను పరిచయం చేస్తూ ‘అంబేద్కర్ మీ రక్షకుడు.. మీ విమోచకుడు’అని చెప్పి విద్యావంతుని బాధ్యతను గుర్తు చేశాడు. 1953 జనవరి12న అప్పటి ఓయూ వీసీ ప్రొ. సూరి భగవంతం గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ ని అంబేద్కర్ కు ప్రదానం చేశారు. ఉద్యోగ రూపంలోనైనా, ఉద్యమాల రూపంలోనైనా సామాజిక బాధ్యతతో సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడమే విద్యావంతుడి కర్తవ్యంగా ఉండాలనేది అంబేద్కర్ ఆలోచన, ఆచరణ. ఆయన జీవిత ఆదర్శాలే ఓయూ విద్యావంతులకు మార్గదర్శకాలు.
- తాళ్ల అజయ్, ఓయూ