
అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు రహదారుల వెంబడి అడుక్కుంటున్నారు. ఆటపాటలతో గడపాల్సిన బాల్యంలో యాచక జీవితం కొనసాగించవలసి వస్తోంది. మన దేశంలో యాచననే వృత్తిగా మార్చుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో చిన్నపిల్లల సంఖ్య మరీ ఎక్కువ. యాచక నిషేధ చట్టం 1975 నుంచి అమలులో ఉన్నప్పటికీ, ఈ వృత్తి పెరుగుతూనే ఉంది. వర్ధమాన, పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యాచకుల సమస్య కలవరానికి గురిచేస్తోంది. ఆయా దేశాల్లో కఠినతరమైన చట్టాలు చేశాయి. శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేనివారు భిక్షాటన చేయడాన్ని నేరంగా పరిగణించాలని మన న్యాయస్థానాలు పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మందికిపైగా యాచకులున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 80 వేలకు పైగా భిక్షాటన చేస్తున్నారు. బెగ్గింగ్ మాఫియా ద్వారా ఏడాదికి దేశవ్యాప్తంగా రూ.260 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయంటే, ఈ అనాగరిక వ్యవస్థ సమాజంలో ఏ మేరకు వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
నిరుపేద కుటుంబాలే లక్ష్యం
కాలిన గాయాలు, ఎండిన డొక్కలు, తలకు రక్తం కారుతూ, ఒళ్లంతా సునేరు పూసుకుని కదలకుండా నిలబడడం... ఇలా రకరకాల విన్యాసాలతో హైదరాబాద్ వంటి పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద నిత్యం కనిపించే పిల్లల దృశ్యాలివి. ఇందులోని వాస్తవాలను పక్కనబెడితే, వీరి వెనుక బలమైన బెగ్గింగ్ మాఫియా పనిచేస్తోందనేది అసలైన వాస్తవం. వీరిలో కొందరు మాత్రమే అవసరాలరీత్యా యాచకవృత్తిని ఎంచుకుంటే, చాలామంది బలవంతంగా వచ్చినవారు. అభాగ్యులను చేరదీసినట్లు నటించి వారిని ఈ వృత్తిలోకి దింపుతున్నారు. ఏమీ తెలియని వయసులోనే పిల్లలను యాచకులుగా మార్చి వారికి నరకం చూపిస్తూ అక్రమ ఆర్జనకు పూనుకుంటున్నారు. బెగ్గింగ్ మాఫియా ముఠాలు.
నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని వారి పిల్లలను యాచకులుగా మారుస్తున్నారు. డబ్బు అవసరమున్న తల్లిదండ్రులు పిల్లలను వీరికి అప్పగిస్తున్నారు. ఈ పిల్లలకు మద్యం, మత్తు పదార్థాలను అలవాటు చేస్తూ డ్రగ్ పెడ్లర్లుగా మార్చుతున్నారు. హృదయ విదారకంగా మార్చి యాచకవృత్తిలోకి దించుతున్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలతో భిక్షాటననగరాలలోని ప్రధాన కూడళ్లలో ఎవరికీ అనుమానం రాకుండా, కొద్దిదూరంలో పిల్లలను వదిలేస్తారు. మధ్యాహ్నం, సాయంత్రం రెండుసార్లు, ఆ చిన్నారులపై నిఘా వేసేందుకు వాహనంలో కొందరు వ్యక్తులు తిరుగుతుంటారు. చీకటి పడగానే పిల్లలను బండిలోకి ఎక్కించుకుని తీసుకెళ్లిపోతారు. ఇవన్నీ గమనిస్తున్నా అలా చూస్తూ ఉండిపోతుంటారు ట్రాఫిక్ సిబ్బంది.
ఈ పిల్లలంతా బెగ్గింగ్ మాఫియా చేతిలో చిక్కుకున్నవారే. ప్రజాప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి2017లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ నగరానికి వచ్చిన సందర్భంలో యాచకరహిత నగరంగా మార్చారు. దాదాపు 150 మందిని చర్లపల్లి జైలుకు, మరో 400 మందిని చంచల్‌గూడ ఆనందాశ్రమానికి తరలించారు. తర్వాత నిర్వహణ భారమై వదిలేశారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల పనితీరు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి.
‘ఆపరేషన్ భిక్షాటన్’ పేరుతో కీలకమైన ప్రాంతాలను గుర్తించి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు, పోలీస్ అధికారులు భిక్షాటన చేస్తున్న పిల్లలను వారితోపాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులను తీసుకొచ్చి ఒకటి, రెండు రోజులు బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించిన అనంతరం వారి సొంత గ్రామాలకు పంపిస్తున్నారు. ఇది తాత్కాలిక ఉపశమనంగా ఉందే తప్ప, శాశ్వత పరిష్కారంగా లేదు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో బెగ్గింగ్ మాఫియాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.
- కోడం పవన్‌కుమార్,
సీనియర్ జర్నలిస్ట్