చిన్నఇన్వెస్టర్లకు పెద్ద దెబ్బ

బిజినెస్‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు:  బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లయిన సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీలు తమ ఆల్‌‌‌‌టైమ్ హై నుంచి  7 శాతం మేర నష్టపోయి ట్రేడవుతున్నాయి. గ్లోబల్‌‌‌‌గా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడాయిల్ రేట్లు పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అనేక అంశాలు మార్కెట్‌‌‌‌ను కిందకి లాగాయి. తాజా మార్కెట్ల పతనంతో ఎక్కువగా నష్టపోయింది చిన్న ఇన్వెస్టర్లే. బీఎస్‌‌‌‌ఈ 500 లోని షేర్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ ఇండెక్స్‌‌‌‌లో ఎక్కువగా స్మాల్ క్యాప్‌‌‌‌, మిడ్‌‌‌‌ క్యాప్ షేర్లే ఉంటాయి. ఈ ఇండెక్స్‌‌‌‌లోని మెజారిటీ షేర్లు తమ ఆల్‌‌‌‌టైమ్ హై నుంచి 20 శాతం మేర నష్టపోయి ప్రస్తుతం ట్రేడవుతున్నాయి. బీఎస్‌‌‌‌ఈ 500 లోని 47 షేర్లలో రిటైల్ ఇన్వెస్టర్ల షేరు హోల్డింగ్‌‌‌‌ 20 శాతం కంటే ( డిసెంబర్ క్వార్టర్ నాటికి) ఎక్కువగా ఉంది. ఇందులో 35 షేర్లు తమ ఆల్‌‌‌‌టైమ్ హై కంటే  20 శాతం నుంచి 63 శాతం పతనమయ్యాయి.  
ఈ షేర్లే ఎక్కువగా పడ్డాయి..

సెక్వెంట్‌‌‌‌ సైంటిఫిక్‌‌‌‌  షేరు తన ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ హై నుంచి 63 శాతం పతనమయ్యింది. ఫార్మా కంపెనీ వోఖర్డ్​ 61 శాతం, బజాజ్ కన్జూమర్ కేర్‌‌‌‌‌‌‌‌ 50 శాతం మేర నష్టపోయాయి.  ఎక్స్చేంజి డేటాను చూస్తే  రిటైల్ వాటా ఎక్కువగా ఉన్న 35 షేర్లలో 25 షేర్లు  తమ ఆల్‌‌‌‌టైమ్ హై కంటే  30 శాతం ఎక్కువ పతనమయ్యాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌‌‌‌, ఆర్తి డ్రగ్స్‌‌‌‌, ఐఓఎల్‌‌‌‌ కెమికల్స్‌‌‌‌, పీటీసీ ఇండియా, ఇండియాబుల్స్‌‌‌‌ రియల్‌‌‌‌ఎస్టేట్‌‌‌‌ షేర్లు 43 శాతం నుంచి 49 శాతం మేర నష్టపోయాయి. వెంకీస్‌‌‌‌ (ఇండియా), జుబిలియంట్‌‌‌‌ ఇంగ్రేవియా, టాటా మెటాలిక్స్‌‌‌‌, బాలాజి అమైన్స్‌‌‌‌, డీసీబీ బ్యాంక్‌‌‌‌, ఎన్‌‌‌‌సీసీ, ఎన్‌‌‌‌బీసీసీ (ఇండియా) షేర్లు 35–41 శాతం మేర నష్టపోయాయి. మార్కెట్‌లోని ప్రతీ నలుగురులో ముగ్గురు చిన్న ఇన్వెస్టర్లు నష్టపోతున్నారనే విషయం దీన్ని బట్టి అర్థమవుతోంది.

సోషల్ మీడియా టిప్స్ ఫాలో కావడమే..

కంపెనీలపై సరిగ్గా రీసెర్చ్ చేయకపోవడం, ఎక్కువ వాల్యుయేషన్ దగ్గర కొనుగోలు చేయడం, సోషల్ మీడియాలో టిప్స్‌‌‌‌ను ఫాలో అవ్వడంతో చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టపోతున్నారు.  సోషల్ మీడియా ఆధారంగా స్టాక్స్‌‌‌‌ టిప్స్‌‌‌‌ ఇచ్చే ఓ గ్యాంగ్‌‌‌‌ను కిందటి వారం సెబీ పట్టుకుంది.  ఈ గ్యాంగ్ మొత్తం తొమ్మిది టెలిగ్రామ్ ఛానెల్స్‌‌‌‌ ద్వారా తమ ఫాలోవర్లను మానిప్యూలేట్‌‌‌‌ చేస్తోందని సెబీ గుర్తించింది. తాము  పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన షేర్లను ప్రమోట్ చేసి ఇతర ఇన్వెస్టర్లు కూడా డబ్బులు పెట్టేలా ఈ గ్యాంగ్ మానిప్యూలేట్ చేస్తోంది.  షేర్లు పెరిగాక తమ వాటాను  ఈ గ్యాంగ్ అమ్ముకుంటోందని సెబీ గుర్తించింది. గతంతో పోలిస్తే ఈ సారి సోషల్ మీడియా ఇటువంటి స్కామ్స్‌‌‌‌కు ఎక్కువగా వేదికవుతోంది. రిటైల్‌‌‌‌ ఇన్వెస్టర్లు సొంతంగా రీసెర్చ్ చేయకపోవడం, ఏ యూట్యూబ్‌‌‌‌లోనో, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లోనో, టెలిగ్రామ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌లోనో వచ్చే స్టాక్ టిప్స్‌‌‌‌ను ఫాలో అయ్యి హై వాల్యుయేషన్‌‌‌‌  షేర్లలో ఇరుక్కుంటున్నారు.  మార్కెట్‌‌‌‌ పడినప్పుడు ఎక్కువగా నష్టపోయేది వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్న షేర్లే కాబట్టి ఇటువంటి ఇన్వెస్టర్లే ఎక్కువగా నష్టపోతున్నారని నిపుణులు  చెబుతున్నారు.  
చిన్న షేర్లతోనే ధనవంతులు.. 
ప్రస్తుత మార్కెట్‌‌‌‌‌‌లో  స్మాల్ క్యాప్ షేర్లు ఓవర్ వాల్యుయేషన్‌‌‌‌లో లేవని, ఇంకో 20–30 శాతం పడకపోవచ్చని  సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌ శంకర్ శర్మ పేర్కొన్నారు. ‘మిగిలిన కంపెనీలతో పోలిస్తే లార్జ్‌‌‌‌ క్యాప్ కంపెనీలపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం తక్కువగా ఉంటుందని తెలుసు. ఎందుకంటే వీటి దగ్గర క్యాష్‌‌‌‌ నిల్వలు ఉంటాయి. ఇదంతా అర్థం చేసుకోగలం. కానీ,  దేశంలోని వాస్తవ పరిస్థితులను చూస్తే, మార్కెట్‌‌‌‌లో ఓవర్ వాల్యూ అయిన షేర్లపై వడ్డీ రేట్ల పెంపు ఎఫెక్ట్​ ఎక్కువగానే ఉంటుంది. మార్కెట్‌‌‌‌లో ఓవర్ వాల్యూ అయినవి రెండే..అవి ఒకటి.. లార్జ్ క్యాప్ షేర్లు, రెండు.. కొత్త తరం కంపెనీల షేర్లు. మరోవైపు స్మాల్ క్యాప్ షేర్లు ఓవర్ వాల్యుయేషన్‌‌‌‌లో లేవు’ అని శర్మ వివరించారు. కంపెనీల ఎర్నింగ్స్ కంటే 40 నుంచి 50 రెట్లు ఎక్కువగా ట్రేడయ్యే షేర్లను తాను పట్టించుకోనని అన్నారు.

స్టాక్​ మార్కెట్‌లోకి వచ్చే చిన్న  ఇన్వెస్టర్లందరూ తక్కువ టైములోనే ఎక్కువ సంపాదించేయాలని కోరుకుంటారు..ఈ ఆతృతతో పెద్దగా రీసెర్చ్​ చేయకుండానే ఫ్రెండ్స్​ చెప్పారనో, ఆ కంపెనీలో ఉద్యోగులు చెప్పారనో, సోషల్​ మీడియా టిప్స్​ చూసో..షేర్లను కొనేస్తుంటారు. మార్కెట్లు చతికిలపడినప్పుడు మాత్రమే వారి ఎంపిక తప్పనేది అర్ధమవుతుంది. కానీ, అప్పటికే చేతులు కాలిపోతాయి. షేర్​ మార్కెట్‌లో డబ్బు పెట్టాలనుకునే వారెవరైనా సరే..డైలీ కొంత టైము మార్కెట్​ స్టడీ చేయడానికి కేటాయించుకుంటే మేలని నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు. అప్పుడే గొప్ప భవిష్యత్​ ఉండే చిన్న షేర్లను గుర్తించడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు.