ఒక నగరాన్ని నిట్టనిలువుగా పంచుకుని అడ్డంగా గోడ కట్టేయడమనేది ఒక్క జర్మనీలోనే జరిగింది. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక… అటు సామ్రాజ్యవాదులు, ఇటు సామ్యవాదులు పెత్తనం సాగించారు. వీరిద్దరి మధ్య నలిగిపోయిన దేశం జర్మనీ. నాజీ నాయకుడు, జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఆనవాళ్లను తుడిచేయాలన్న కసితో జర్మనీని నాలుగు జోన్లుగా విడదీశారు. ఒక భాగాన్ని సోవియట్ రష్యా, మిగిలిన మూడు భాగాలను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు పంచుకున్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో (1946లో) ఇంపీరియల్ స్టేట్స్ (సామ్రాజ్యవాద దేశాలు)గా పిలిచే ఈ మూడు దేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్) నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)తో ఒక పవర్‌గా తయారయ్యాయి. తమ ఆధిపత్యంలోని జర్మనీ భాగాల్ని 1947లో ఒకటిగా చేసుకుని, వెస్ట్ జర్మనీగా పేరు పెట్టారు. సోవియెట్ రష్యా తన వాటాని ఈస్ట్ జర్మనీగా వ్యవహరించింది. ఈస్ట్ జర్మనీని అధికారికంగా జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ (జీడీఆర్)గా, వెస్ట్ జర్మనీని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ (ఎఫ్డీఆర్)గా పిలవసాగారు.
నాటో దేశాలు వెస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించడానికి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టాయి. వెస్ట్రన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం, మెరుగైన లైఫ్ స్టయిల్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వగైరాల్లో వెస్ట్ జర్మనీ పోటీ పడసాగింది. దీంతో సోవియెట్ యూనియన్ తన అధీనంలోని ఈస్ట్ జర్మనీపై ఆ ప్రభావం పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. దీనిలో భాగంగానే బెర్లిన్ నగరాన్ని రెండుగా చీలుస్తూ గోడ కట్టాలని నిర్ణయించింది. 1961 ఆగస్టులో గోడ కట్టడం పూర్తయ్యింది. జర్మనీ దేశం తూర్పు దేశాల కమ్యూనిజం, పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యం నడుమ రెండుగా అక్షరాలా భౌగోళికంగా చీలిపోయింది.
పేరుకే డెమొక్రటిక్ జర్మనీ
ఇదిలా ఉంటే, పేరుకు డెమొక్రటిక్ రిపబ్లిక్ అయినప్పటికీ ఈస్ట్ జర్మనీ జనాలకు ప్రజాస్వామ్యం అనేది లేదు. కమ్యూనిస్టు భావజాలంతో పనిచేసే అన్ని ప్రభుత్వాల మాదిరిగానే వీళ్లుకూడా నిఘా నీడలో బతికేవారు. వెస్ట్ జర్మనీలో అభివృద్ధిని, స్వేచ్ఛను గమనిస్తున్న ఈస్ట్ జర్మనీ ప్రజలు అటువైపు వెళ్లిపోవడానికి చాలా ప్రయత్నాలు చేసేవారు. మొత్తం 30 మైళ్ల నిడివిగల బెర్లిన్ గోడకు కిందనుంచి సొరంగాలు తవ్వుకుని, లేదా కొన్నిచోట్ల ఫెన్సింగ్‌ను దాటుకుని పారిపోవాలనుకునేవారు. అదృష్టం బాగుంటే అవతలివైపునున్న వెస్ట్ జర్మనీలో అడుగుపెట్టేవారు. లేదంటే, సైనికుల కాల్పుల్లో ప్రాణాలొదిరేవారు. కొంతమంది పట్టుబడిపోయి ఈస్ట్ జర్మనీ పోలీసుల చేతిలో నానారకాల ఇంటరాగేషన్‌కి, చిత్రహింసలకు గురయ్యేవారు. ఆ రకంగా 28 ఏళ్ల పాటు జర్మనీ ప్రజలు అమెరికా, సోవియట్ల మధ్య నలిగిపోయారు.
గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికాల ప్రభావం
1985 వచ్చేసరికి ప్రపంచం పూర్తిగా స్వేచ్ఛావాణిజ్యం, ఆర్థికంగా అనువుగా ఉండే విధానాలవైపు మొగ్గు చూపింది. మరోపక్క ఆసియాలోని గల్ఫ్ దేశాల్లో విపరీతంగా పెట్రోలియం గనులు పడ్డాయి. ఇండియాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వలసలు బాగా పెరిగాయి. మరోవంక బయటి ప్రపంచానికి దూరంగా ‘మనం ఉన్నదే స్వర్గం’గా ఫీలయ్యే సోషలిస్టు దేశాల్లో ఆలోచనలు మారిపోయాయి. అక్కడి ఆర్థిక, సామాజిక పరిస్థితులు తారుమారయ్యాయి. కనీస అవసరాలైన తిండికి, బట్టకు, తలదాచుకునే చోటుకుసైతం ఇబ్బంది పడ్డారని అప్పటి పరిణామాలు తెలిసినవాళ్లు చెబుతుంటారు. సోవియెట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా మిఖాయిల్ గోర్బచెవ్ వచ్చాక ఆయన గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా పాలసీలను ప్రకటించారు. గ్లాస్‌నోస్త్ అంటే తేటతెల్లంగా అని అర్థం చెప్పుకోవచ్చు. ప్రజలు తమ సమస్యలపైనా, పరిష్కారాలపైనా ఓపెన్‌గా డిస్కస్ చేసుకోవాలని; ప్రభుత్వంలోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ జరిగేవన్నీ ట్రాన్స్ఫరెన్సీగా ఉండాలని గోర్బచెవ్ ఉద్దేశం. ఇక, పెరిస్త్రోయికా అంటే సోవియట్ యూనియన్ని కంట్రోల్ చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలో రాజకీయంగా కొత్త ధోరణి రావాలని, పార్టీని కొత్తగా తయారు చేయాలని అనుకున్నారు. ఈ రెండింటి ప్రభావంతో అప్పటివరకు సోషలిస్టు దేశాల్లో, ముఖ్యంగా సోవియట్ యూనియన్‌లో పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఏర్పడిన ఇనుప తెర తొలగిపోయింది. ఆ ప్రభావం ఈస్ట్ జర్మనీపైకూడా బలంగా పడింది.
ఈస్టూ… వెస్టూ వేరే వేరే
గోడ కూలిపోయి 30 ఏళ్లయింది. కోల్డ్ వార్ ముగిసిపోయింది. తమను 40 ఏళ్లపాటు చీల్చి పాలించిన సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. అయినాగానీ జర్మన్ల మధ్య ‘అందరమూ ఒక్కటే’ అనే భావన రాలేదు. ఇప్పటికీ తాము సెకండ్ క్లాస్ సిటిజన్లమేనని ఫీలింగ్‌తో ఈస్ట్ జర్మనీ జనాలు బతుకుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. రెండు జర్మనీ ప్రజల మధ్య యాటిట్యూడ్, మెంటాలిటీ పరంగా చాలా వ్యత్యాసం కనబడుతుందని సర్వేల్లో తేలింది. ఈస్ట్ జర్మన్లు తాము ఇప్పటికీ పొలిటికల్ ఐడియాలజీలో చాలా గొప్పవాళ్లమనే ఆలోచనతో ఉంటారు. జీడీపీ, ఆదాయం విషయాల్లో ఈస్ట్ జర్మనీ ఏరియా ఇప్పటికీ బాగా వెనకబడే ఉంది. జర్మన్లలో బాగా డబ్బున్నవాళ్లందరూ పశ్చిమ ప్రాంతంలోనే ఉంటారని బెరెన్బర్గ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ హోల్గర్ ష్మీడింగ్ అన్నారు. జర్మనీలో 500 పెద్ద కంపెనీలుండగా, వాటిలో 36 కంపెనీలకే తూర్పు ప్రాంతంలో హెడ్క్వార్టర్లున్నాయి. దీనిని బట్టి, ఇప్పటికీ సోవియట్ రష్యా హయాంలో ఏర్పడ్డ సోషలిజం భయం జర్మన్లను వెంటాడుతూనే ఉందని సర్వేలు తేల్చాయి.
ఇక, ఉద్యోగాల విషయానికొస్తే… తూర్పు ప్రాంతంవాళ్లకంటే మెరుగైన అవకాశాలు పశ్చిమ ప్రాంత జర్మన్లకే ఉన్నాయి. ఈస్ట్ జర్మనీలో మంచి మంచి పొజిషన్లలో ఉన్నవాళ్లలో దాదాపు మూడొంతులమంది వెస్ట్ జర్మనీ ఏరియాకి చెందినవాళ్లేనని తేలింది. ఈస్ట్ సైడ్ కోటి 25 లక్షల మంది నివసిస్తుంటే, వెస్ట్ సైడ్ ఆరు కోట్లకు పైగా జనాలు ఉంటున్నారు. మొత్తంగా చూసుకుంటే.. తూర్పు జర్మన్లు బాగా వయసు మీరినవాళ్లు, పేదలు, మగవాళ్లు ఎక్కువగా ఉన్నారు. బెర్లిన్ గోడ కూలిపోయాక 20 లక్షల మంది వెస్ట్ ఏరియాకి వెళ్లిపోగా, వాళ్లలో 66 శాతం మంది (దాదాపు 14 లక్షలు) ఆడవాళ్లే ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో తోడు లేకుండా మిగిలిపోయిన మగవాళ్ల సంఖ్య ఈస్ట్ జర్మనీలో ఎక్కువైంది.
జర్మనీ మహిళల్లో ప్రోగ్రెసివ్ ఆలోచనలు, కెరీర్లో సెటిల్ కావాలనే కోరిక బాగా ఉంటుందని, వాళ్లు తమ గురించే ఎక్కువగా ఆలోచించడంవల్ల ఈస్ట్ జర్మనీలో ఉండడానికి అంతగా ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఈ 30 ఏళ్లలోనూ కుదిరిన సంబంధాలను పరిశీలిస్తే ఈస్ట్ అమ్మాయి–వెస్ట్ అబ్బాయి పెళ్లిళ్లే ఎక్కువని సోషియాలజీ డిపార్టుమెంట్ చెబుతోంది. జీతభత్యాల్లో జెండర్ వ్యత్యాసం పెద్దగా లేనందువల్ల ఈస్ట్ జర్మనీ మహిళలు ఉద్యోగాలకోసం ముందుకు వస్తున్నారు. ఆఖరికి కంపెనీల డైరెక్టర్ల బోర్డులోనూ ఈస్ట్ జర్మన్ ఆడవాళ్లదే ఆధిపత్యమని అంటున్నారు. వెస్ట్ జర్మనీలో ఉండేవాళ్లు సొంతంగా కార్లు కొనుక్కోవడానికి ఇష్టపడితే, ఈస్ట్లోవాళ్లు పెద్దగా ఆసక్తి చూపరట. వీళ్లు తరచు షాపింగ్‌కి వెళ్లరు. ఒకేసారి హైపర్ మార్కెట్లకు వెళ్లి నెలకు సరిపడా సామాన్లు తెచ్చుకుంటారు. వెస్ట్‌లో ఉండేవాళ్లు మాత్రం చీటికిమాటికీ షాపింగ్‌కు వెళ్తుంటారు.
బెర్లిన్ గోడ కట్టాక…
ఈస్ట్ జర్మనీ తనకు వచ్చిన తూర్పు బెర్లిన్ని కేపిటల్‌గా చేసుకోగా, వెస్ట్ జర్మనీ బాన్ నగరాన్ని రాజధానిగా చేసుకుంది. బెర్లిన్ గోడ కట్టిన తర్వాత సోషలిజం చెరలో ఉండలేక దాదాపు లక్షా 85 వేల మంది ఈస్ట్ జర్మన్లు బెర్లిన్ గోడను దాటినట్లుగా లెక్కలున్నాయి. వీళ్లలో 2,746 మంది సైనికులు, పోలీసులుకూడా ఉన్నారు. కొందరు బెర్లిన్ గోడ కింద టన్నెల్ తవ్వుకుని పారిపోగా, మరికొందరు సరిహద్దుల్లోని సరస్సులు ఈదుకుంటూ దాటేశారు. నడుస్తున్న రైళ్ల నుంచి దూకినవాళ్లు కొందరైతే, కార్లలో రహస్య కంపార్టుమెంట్లలో దాక్కుని మరికొందరు పారిపోయారు.
28 ఏళ్ల తర్వాత ఏకమయ్యారు
1989లో అప్పటి జర్మనీ సోషలిస్ట్ యూనిటీ పార్టీ ఫస్ట్ సెక్రటరీ గుంతర్ ష్వాబోస్కీ అడ్డుగోడ లేకుండా చేశారు. రెండు జర్మనీల మధ్య రాకపోకలకు అనుమతించారు. ఆర్థిక వ్యత్యాసాల్లేకుండా సాలిడారిటీ ట్యాక్స్నుకూడా తొలగించారు. అదే ఏడాది నవంబర్ 9న, 28 ఏళ్లపాటు అడ్డంగా నిలబడ్డ గోడను, ప్రజలు కేరింతలతో బద్దలుగొట్టారు. రెండు దేశాల మధ్య ఈ 30 ఏళ్లలోనూ అరమరికలు లేని వాతావరణమేర్పడింది.
అయితే, దేశాల మధ్య ఆర్థిక సమానత్వం, ఉద్యోగ అవకాశాలు మాత్రం ఏర్పడలేదని అనేక సర్వేలు చెబుతున్నాయి. పశ్చిమ ప్రాంతంతో పోలిస్తే ఈస్ట్ జర్మనీలో నిరుద్యోగం 50 శాతం ఎక్కువగా ఉంది. బెర్లిన్ గోడ పగలగొట్టే సమయానికి ఈస్ట్ జర్మనీ తలసరి ఆదాయం 73 శాతం ఎక్కువగా ఉండేది. విలీనమయ్యాక ఎకానమీ గ్రోత్ కొంతవరకు ఆగిపోయిందని తెలుస్తోంది. ఈస్ట్ జర్మనీ ఏరియాకి ఎలాంటి పెద్ద కంపెనీలు రాలేదు. ఇక్కడున్న కంపెనీలేవీ జర్మనీ స్టాక్ మార్కెట్ డ్యాక్స్లో నమోదు కాలేదు. వెస్ట్ ఏరియాలో కార్మిక సంఘాల కంటే ఈస్ట్ జర్మన్ కార్మికులు ఎక్కువగా శ్రమ పడినా సదుపాయాల్లేవు.
పండగ వాతావరణం
బెర్లిన్ గోడ బద్ధలై రెండు జర్మనీలు ఒక్కటైన చారిత్రక సందర్భాన్ని రాజధాని నగరంలో గొప్పగా నిర్వహిస్తున్నారు. డిక్టేటర్షిప్కి బలైనవాళ్ల త్యాగాల్ని గుర్తుచేసే ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశారు. తూర్పు, మధ్య యూరప్‌లలో శాంతియుతంగా జరిగిన తిరుగుబాటులోని ముఖ్య ఈవెంట్లను నేటి తరానికి కళ్లకు కట్టినట్లు చూపాలనే లక్ష్యంతో వందకు పైగా ప్రోగ్రామ్‌లను వండర్‌ఫుల్‌గా రూపొందించారు. సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఈ నెల 4న ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగుస్తాయి. ఈ 30వ యానివర్సరీ కోసం గ్రూప్ డిస్కషన్లు, కన్సర్ట్లు, టూర్లు, వర్క్‌షాప్‌లు, ఫిల్మ్ సిరీస్‌లు, కవి సమ్మేళనాలు, నాటకాలు తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ వేడుకలకు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా