పావురాలతో పందెం గుట్టురట్టు.. ఏపీ నుంచి తీసుకొచ్చిన 280 కపోతాలు స్వాధీనం​

పావురాలతో పందెం గుట్టురట్టు.. ఏపీ నుంచి తీసుకొచ్చిన 280 కపోతాలు స్వాధీనం​

పరిగి, వెలుగు: పందేలు నిర్వహించేందుకు ఏపీలోని అనంతపురం నుంచి తీసుకొచ్చిన 280 ట్రైన్డ్​పావురాలను వికారాబాద్ జిల్లాలోని పరిగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి గేమింగ్​యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్.. పందేల్లో పాల్గొనే పావురాలకు ట్రైనింగ్​ఇస్తుంటాడు. అతని వద్ద శిక్షణ పొందిన పావురాలు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి, అప్పగించిన పని పూర్తిచేస్తాయి. 

పావురాల పందేల్లో భాగంగా ప్రేమ్..10 బాక్సుల్లో 280 పావురాలను ఉంచి, వాటికి స్పెషల్ ట్యాగ్స్​వేసి పరిగికి పంపించాడు. మునావర్, బాబా జానీ అనే వ్యక్తులు వాటిని ఆటోట్రాలీలో శనివారం ఉదయం పరిగికి చేర్చారు. పావురాలను గాల్లోకి వదిలే టైంలో మార్నింగ్​వాకింగ్​ చేస్తున్న స్థానికులు వారిని పట్టుకున్నారు. పరిగి ప్రాంతంలో వైరస్ లు ప్రబలేలా చేసేందుకు పావురాలు తెచ్చారా అంటూ మునావర్, బాబా జానీని నిలదీశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు అక్కడికి చేరుకుని 10 బాక్సుల్లో  ఉంచిన  280 పావురాలను గుర్తించారు. వాటిని పరిశీలించగా.. ప్రతి పావురానికి స్పెషల్​కోడ్​తో ట్యాగ్ వేసి ఉంది. వాటి బాక్సులపై స్పెషల్ నంబర్లు ఉన్నాయి. పందేలు వేసేందుకే పావురాలను తీసుకొచ్చామని మునావర్, బాబా జానీ తెలిపారు. పరిగిని స్టార్టింగ్​పాయింట్​గా ఎంచుకున్నామని, ముందుగా ఏ పావురం గోరంట్లకు చేరుకుంటుందో.. దానికి సంబంధించి వారికి ప్రైజ్​మనీ ఇస్తారని చెప్పారు. 

ఒక్కో పావురం కనీసం100కి.మీ, గరిష్ఠంగా 300 కి.మీ. ప్రయాణించేలా ప్రేమ్​కుమార్​ ట్రైనింగ్​ఇచ్చాడని వెల్లడించారు. బాబా జానీ, మునావర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరితో పాటు ప్రేమ్ కుమార్ పైనా గేమింగ్​యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు. ప్రేమ్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.