హెచ్1బీ వీసాదారులకు బిగ్ రిలీఫ్​

  •     వర్క్  ఆథరైజేషన్ బిల్లు ఆమోదానికి  ఓకే  చెప్పిన బైడెన్ ప్రభుత్వం

వాషింగ్టన్: హెచ్ 1బీ వీసాదారులకు బైడెన్ సర్కారు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. వర్క్  ఆథరైజేషన్  బిల్లు ఆమోదానికి ఆమోదం తెలిపింది. దీంతో లక్ష మంది హెచ్ 4 వీసాదారులు (హెచ్ 1బీ వీసాదారుల భాగస్వాములు), హెచ్ 1బీ వీసాహోల్డర్ల పిల్లలకు లబ్ధి కలగనుంది. అధికార డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్ల మధ్య సుదీర్ఘ చర్చ తర్వాత ‘జాతీయ భద్రతా ఒప్పందానికి’ సెనేట్​ ఆమోదం లభించింది.

గ్రీన్ కార్డు కోసం కొన్నేండ్లుగా ఎదురుచూస్తున్న వేల మంది ఇండియన్  టెక్నాలజీ ప్రొఫెషనల్స్​కు సెనేట్  నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. గ్రీన్ కార్డు పొందకపోతే హెచ్ 1బీ వీసాదారుల పిల్లలు నిర్ణీత వయసు దాటాక అమెరికాను వీడాల్సి ఉంటుంది. అమెరికాకు వలస వచ్చిన వారికి పర్మనెంట్ రెసిడెన్సీ హక్కులు కల్పించేదే గ్రీన్ కార్డు.. అలాగే, హెచ్‌‌‌‌-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయడానికి తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్‌‌‌‌ ఆథరైజేషన్‌‌‌‌ డాక్యుమెంట్‌‌‌‌ ఐ-765 పొందాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రాసెస్ పూర్తవడానికి  ఏడాది సమయం పడుతోంది. దీనివల్ల నైపుణ్యం ఉన్న వారు ఇంట్లో కూర్చోవాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్‌‌‌‌-4 వీసాదారులకు ‘ఆటోమేటిక్‌‌‌‌ వర్క్‌‌‌‌  ఆథరైజేషన్‌‌‌‌’ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలుపుతామని బైడెన్  ప్రభుత్వం ప్రకటించింది. ‘వర్క్  ఆథరైజేషన్  బిల్లు కింద ఏటా 18 వేల మందికి వర్క్  బేస్డ్ గ్రీన్‌‌‌‌ కార్డును జారీ చేస్తారు. దీంతో ఐదేళ్లలో సుమారు 1,58,000 మందికి లబ్ధి కలుగుతుంది. అలాగే, ఏడాదికి 25,000 మంది కె1, కే-2, కే-3 నాన్  ఇమిగ్రెంట్ గా ఉన్నవారితోపాటు లక్ష మంది హెచ్‌‌‌‌-4 వీసాదారులకు తమ జీవిత భాగస్వామి పనిచేసే ప్రాంతంలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది’ అని వైట్‌‌‌‌హౌస్‌‌‌‌ వెల్లడించింది. కాగా, కొత్తగా తీసుకొస్తున్న బిల్లు అమెరికాను మరింత బలోపేతం చేయడంతో పాటు సరిహద్దులను మరింత సురక్షితం చేస్తుందని ప్రెసిడెంట్ బైడెన్  పేర్కొన్నారు.