హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లు కట్టలేక ఓ కూలీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా నేరడి గొమ్ములో చోటుచేసుకుంది. బాధితుడు అన్నెపాక ఎల్లయ్య (52) ఆయన భార్య మల్లమ్మ బతుకుదెరువుకోసం హైదరాబాద్ వచ్చి ఐఎస్ సదన్ డివిజన్ చింతల్ బస్తీలో నివాసం ఉంటున్నారు. హమాలీగా పనిచేస్తున్న ఎల్లయ్య ట్రాఫిక్ పోలీసులు వేసిన చలాన్లు రూ. 10 వేలుపెండింగ్ ఉండటంతో మీర్ చౌక్ పోలీసులు బైక్ సీజ్ చేశారు. దాంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంటికి వచ్చి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లయ్యను గమనించిన కుటుంబ సభ్యులు డీఆర్ డీ ఒవైసీ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఎల్లయ్య మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
ట్రాఫిక్ ఎస్సై గణేష్ ఎల్లయ్య బండిపై ఉన్న చలాన్లను కడితేనే బండి అప్పగిస్తానని బెదిరించాడు. కూలీ పనులు చేసుకునే ఎల్లయ్య అంత డబ్బు చెల్లించలేనని, బండి తిరిగి ఇవ్వాలని ఎంత బ్రతిమిలాడినా ఎస్సై గణేష్ వినిపించుకోలేదు. పైగా టార్చర్ పెట్టాడని ఎల్లయ్య సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇష్టారీతిన వేస్తున్న చలాన్ల వల్ల తనలాంటి వాళ్లు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, కేటీఆర్ కు లేఖ ద్వారా విన్నవించుకున్నాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జ్ అలుగోలు రమేష్ ట్రాఫిక్ ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సైదాబాద్ పీఎస్ లో ఫిర్యాదు కూడా చేశాడు.