కామారెడ్డి మార్కెట్‌లో  పేరుకుపోతున్న వ్యర్థాలు

కామారెడ్డి, వెలుగు: పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మార్కెట్‌లో కూరగాయల వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంలో బయో గ్యాస్ ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభం కాకుండానే మూలనపడింది. కామారెడ్డి డెయిలీ కూరగాయల మార్కెట్‌లో వ్యర్థాలను తగ్గించేందుకు ఐదేండ్ల కింద బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు ఏర్పాటు కోసం అప్పటి కలెక్టర్ సత్యానారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపారు. కూరగాయల వ్యర్థాలు మార్కెట్‌లో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా  నివారించడంతో పాటు, గ్యాస్​ఉత్పత్తి చేసి స్థానికంగా ఉండే చిన్న వ్యాపారుల అవసరాల కోసం సప్లయ్ చేయవచ్చని భావించారు.

గ్యాస్ ఉత్పత్తి చేయలే..

ప్లాంట్‌ మిషనరీ తీసుకొచ్చి కొద్ది రోజులు వృథాగా ఉంచారు. ఆ తర్వాత మార్కెట్‌లో షెడ్డును రిపేర్ చేసి మిషనరీ బిగించారు. ఆ తర్వాత వారం పాటు కూరగాయల వ్యర్థాలు సేకరించారు. ప్లాంట్‌ రన్నింగ్​చేసి ఐదారు రోజులు ఎరువు ప్రొడక్షన్ చేశారు. ఎరువు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేయాల్సి ఉన్నప్పటికీ చేయలేదు. గ్యాస్‌ను మార్కెట్ ఏరియాలో ఉండే హోటళ్లు, ఇతర చిన్న షాపులకు సప్లయ్​చేయాలనుకున్నా.. ఇందుకు సంబంధించిన పైపులైన్ ఏర్పాటు చేయలేదు. ఏడాదిన్నర కింద మరో సారి గ్యాస్​ఉత్పత్తి చేసే ప్రయత్నాలు చేసి వదిలేశారు. దీంతో మిషనరీ పాడవడంతో ప్లాంట్‌ను మూసేశారు. ప్రస్తుతం మున్సిపల్ యంత్రాంగం ఆ ప్లాంట్‌ వైపు కూడా చూడడం లేదు. 

ప్రతి రోజు క్వింటాల్ వ్యర్థాలు..

కామారెడ్డి డెయిలీ మార్కెట్‌కు ప్రతి రోజు వివిధ ఏరియాల నుంచి రైతులు, వ్యాపారులు కూరగాయలు అమ్మకానికి తెస్తారు. తీసుకొచ్చిన కూరగాయల్లో పాడైన, కుళ్లిపోయిన వాటిని మార్కెట్ ఏరియాలో పడేస్తారు. ఇలా రోజు క్వింటాల్ వరకు వ్యర్థాలు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు సేకరించి గ్యాస్​ ఉత్పత్తి చేస్తే రెండు విధాలుగా ఫలితం ఉంటుంది. మార్కెట్ ఏరియా క్లీన్​గా ఉండడం, గ్యాస్‌తో స్థానికంగా  కొంత మేర అవసరాలు తీరతాయి. ఇప్పటికైనా మున్సిపల్ ఆఫీసర్లు స్పందించి బయో గ్యాస్‌ ప్లాంట్‌ను తెరిపించాలని పలువురు కోరుతున్నారు. 

షెడ్డు లేకుండా చేశారు

మార్కెట్‌లో ఉన్న షెడ్డులో కూరగాయలు అమ్ముకునేటోళ్లం. కుళ్లిన కూరగాయల నుంచి ఎరువు, గ్యాస్​ఉత్పత్తి చేసేందుకు ఆ షెడ్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి వదిలేశారు. మాకు కూర్చుండి అమ్ముకునే షెడ్డు లేకుండా చేశారు. 
– రాజు, కూరగాయల వ్యాపారి

వినియోగంలోకి తెస్తాం

కూరగాయల వ్యర్థాల నుంచి గ్యాస్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. పాడైన మిషనరీని రిపేర్ చేయిస్తాం. కూరగాయల వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయకుండా చూస్తాం.
– దేవేందర్‌‌, మున్సిపల్ కమిషనర్​