- వానాకాలం సాకుతో పనులు ఆపిన కాంట్రాక్టర్
- నాలుగు నెలలుగా ఏడి పనులు ఆడనే..
- డంప్ యార్డుల్లో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త
- ఇబ్బంది పడుతున్న మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు
హనుమకొండ, వెలుగు: ఓరుగల్లులో రోజూ వెలువడుతున్న చెత్తను ప్రాసెస్ చేసి, సిటీని క్లీన్ గా మార్చేందుకు చేపట్టిన ‘బయో మైనింగ్’ ప్రాజెక్ట్ అర్ధంతరంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో పావువంతు కూడా పూర్తికాకముందే ఏడి పనులు ఆడనే ఆగిపోయాయి. ‘స్మార్ట్ సిటీ’ స్కీమ్ కిందే ఈ ప్రాజెక్టును చేపట్టినా.. ఆ ఫండ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాజెక్టులకు మళ్లించడంతో నిధుల కొరత ఏర్పడింది. దీంతో బడ్జెట్ విడుదల చేస్తలేరని సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ 4 నెలల కిందనే పనులు నిలిపివేసింది. వరంగల్ లో రోజూ వెలువడే చెత్త ప్రాసెసింగ్కాకపోవడంతో మడికొండ డంపింగ్ యార్డులో గుట్టలుగా పోగవుతోంది. ఫలితంగా యార్డుకు ఆనుకుని ఉన్న మడికొండ, రాంపూర్ గ్రామస్తులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు.
నెలకు 15 వేల టన్నుల చెత్త
‘గ్రేటర్’ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.5 లక్షల ఇండ్లు, 11 లక్షల వరకు జనాభా ఉంది. రోజూ తడి, పొడి చెత్త మొత్తం కలిపి సుమారు 450 నుంచి 500 టన్నుల వరకు వెలువడుతోంది. నెలకు సగటున 15 వేల టన్నుల చెత్త పోగవుతోంది. ఆ చెత్తనంతా మడికొండలోని డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా.. ఇప్పటికే యార్డు పూర్తిగా నిండిపోయింది. దాదాపు 32 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ యార్డులో 5 లక్షల టన్నులకు పైగా వ్యర్థాలు పోగయ్యాయి. ఇటు ప్రాసెస్ చేసే ఏర్పాట్లు లేకపోవడంతో కొత్తగా వెలువడే చెత్తను పోసేందుకు జాగా కరువైంది. దీంతో నగరానికి నాలుగు వైపులా కొత్త డంపింగ్ యార్డులను ప్రతిపాదించారు. కానీ వాటికి భూమి కొరత ఉండటం, స్థానికులు వ్యతిరేకించడంతో అవి కూడా ఏర్పాటు కాలేదు. గ్రేటర్ ఆఫీసర్లు వరంగల్ పోతన ఆడిటోరియంతో పాటు ఉర్సు గుట్టు వద్ద ఉన్న కొంతస్థలాన్ని మినీ డంపింగ్ యార్డుగా వినియోగిస్తున్నారు.
ఎన్నికలకు ముందు ప్రారంభించిన కేటీఆర్
మడికొండ డంపింగ్ యార్డులో టన్నుల కొద్ది చెత్త పేరుకుపోవడంతో దానిని క్యాపింగ్ చేయాలని భావించారు. ఆ తరువాత చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్ ప్రారంభించాలనుకున్నారు. ఇక్కడి పరిస్థితులను స్టడీ చేసి చివరకు స్మార్ట్ సిటీ ఫండ్స్ తో ‘బయో మైనింగ్’ చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రాజెక్టుకు మొత్తం రూ.37 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. గ్రేటర్ ఎలక్షన్స్ కు ముందు ఏప్రిల్ 12న వరంగల్ నగరానికి వచ్చిన మంత్రి కేటీఆర్ స్వయంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
పనులు ఆగి 4 నెలలు
పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ 2021 డిసెంబర్ లో వర్క్స్ స్టార్ట్ చేసింది. 2022 డిసెంబర్ లోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆఫీసర్లు టార్గెట్ పెట్టారు. బయో మైనింగ్ ప్రారంభించిన సంస్థ నెలకు 12 వేల టన్నుల చొప్పున దాదాపు ఐదు నెలల్లో 60 వేల టన్నుల వరకు ప్రాసెస్ చేశారు. కానీ ప్రభుత్వం పైసా విడుదల చేయకపోవడంతో పనులు నెమ్మదించాయి. ఆ తరువాత జూన్ నెలలో వర్షాలు మొదలు కావడం, వానలతో ప్రాసెసింగ్ కు అడ్డంకులు ఏర్పడటంతో ఇదే అదునుగా భావించిన సంబంధిత సంస్థ పనులు మొత్తం ఆపేసినట్లు తెలిసింది.
రెండు గ్రామాలకు ముప్పు
డంపింగ్‌యార్డు మడికొండ, రాంపూర్ గ్రామాలకు అతి దగ్గరలో ఉండడంతో ఈ రెండు ఊర్ల ప్రజలు యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నుంచి రసాయనాలు విడుదలై అప్పుడప్పుడు మంటలు, పొగలు వ్యాపిస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. చాలామంది శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. దీంతోనే డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని ఈ రెండు గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు వెల్లువెత్తిన ప్రతీసారి నేతలు వచ్చి హామీలు ఇస్తున్నారే తప్పా సమస్యలు పరిష్కరించడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని బయో మైనింగ్ వర్క్స్ స్పీడప్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వాసులు కోరుతున్నారు.
విన్నవించినా పట్టించుకుంటలేరు
మడికొండ డంపింగ్ యార్డు నుంచి వచ్చే ఘాటు వాసనలు, పొగ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఎంతోమంది శ్వాసకోశ వ్యాధులతో అవస్థ పడుతున్నారు. అందుకే డంపింగ్ యార్డును షిఫ్ట్ చేయాలని లీడర్లు, ఆఫీసర్లకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. అయినా ఎవరూ పట్టించుకుంటలేరు.
- గడ్డం మహేందర్, మడికొండ
త్వరలోనే స్టార్ట్ చేసేలా యాక్షన్ తీసుకుంటం
మడికొండ డంపింగ్ యార్డులో బయో మైనింగ్ పనులు నిలిచిపోయిన విషయం నిజమే. వర్షాల వల్ల ప్రాసెసింగ్ కు ఆటంకాలు ఏర్పడుతుండటంతో పనులు టెంపరరీగా ఆపేశారు. వానలు తగ్గిన వెంటనే మళ్లీ స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకుంటాం.
– డా.జ్ఞానేశ్వర్, మున్సిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్, జీడబ్ల్యూఎంసీ