ఉద్రిక్తంగా నిజామాబాద్ ​కలెక్టరేట్ ముట్టడి .. బీజేపీ లీడర్లు అరెస్ట్

నిజామాబాద్ ​అర్బన్, వెలుగు : బీఆర్ఎస్​  తొమ్మిదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ లీడర్లు నిజామాబాద్ ​కలెక్టరేట్ ను ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్​ సూర్యనారాయణ మాట్లాడుతూ..  ఎన్నికల సమయంలో లెక్కకుమించి హామీలిస్తున్న ప్రభుత్వం, గద్దెనెక్కగానే వాటిని విస్మరిస్తూ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలను గుర్తు చేసి, వాటిని అమలు చేయాలనే డిమాండ్​తో నిరసనలు తెలిపితే, పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం, నిర్బంధించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్ని విధాల ఆపే ప్రయత్నం చేసినా, బీఆర్ఎస్ ​వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కలెక్టరేట్​ను ముట్టడించేందుకు వచ్చిన బీజేపీ లీడర్లను అడ్డుకున్న పోలీసులు, వారిని అక్కడి నుంచి తరలించారు. 

బోధన్ : నిజామాబాద్ ​కలెక్టరేట్​ను ముట్టడించేందుకు వెళ్తున్న బీజేపీ లీడర్లను సోమవారం పోలీసులు అరెస్ట్​ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్​రెడ్డిని హౌస్​ అరెస్ట్ ​చేశారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు కొలిపాక బాలరాజ్, జిల్లా కార్యదర్శి సుధాకర్​చారి తదితరులను అదుపులోకి తీసుకున్నారు.

నవీపేట్ : పార్టీ పిలుపు మేరకు కలెక్టరేట్​ ముట్టడికి బయలు దేరిన బీజేపీ లీడర్లను నవీపేట్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. బీజేవైఎం జిల్లా వైస్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ కేసీఆర్​ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లాంటి అనేక హామీలను నెరవేర్చలేదన్నారు. అరెస్టయిన వారిలో లీడర్లు శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, ఆనంద్, రాజేందర్​గౌడ్ ఉన్నారు.