మమత కోటను బీజేపీ బద్దలు కొడ్తదా!

పశ్చిమబెంగాల్‌‌‌‌లో 34 ఏండ్లపాటు అధికారంలో ఉన్న లెఫ్ట్‌‌‌‌ ప్రభుత్వంపై ఒంటరిగా వీధి పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చారు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్‌‌‌‌ మమతాబెనర్జీ. ఇప్పుడు ఆమెను గద్దె దించడానికి బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. బహుశా ఒక రాష్ట్రంలో పాగా వేయడానికి ఇన్ని ప్రయత్నాలను బీజేపీ మరెక్కడా చేసి ఉండదు. లెఫ్ట్‌‌‌‌ పార్టీలను గద్దె దింపిన మమత బెంగాల్‌‌‌‌లో ప్రధాన రాజకీయ పార్టీలైన సీపీఎం, కాంగ్రెస్‌‌‌‌లను నిర్వీర్యం చేశారు. వారి పునాదులను కదిలించడమే కాక.. వారి పంథాలోనే అన్ని వ్యవస్థలపై పట్టు సాధించారు. అయితే బీజేపీ.. మమతకు ఎదురునిలిచి ఆమె పునాదులను కదిలించే ప్రయత్నం చేస్తున్నది.

 

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అయితే దేశ ప్రజల దృష్టి మాత్రం పశ్చిమబెంగాల్‌‌‌‌పైనే ఉన్నది. బెంగాల్‌‌‌‌లో తిరిగి మమత అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలో కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంటుంది. ఆమెను గద్దె దించగలిగితే మరో రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే మానసిక స్థైర్యాన్ని ఎవరూ నిలుపుకోలేకపోవచ్చు. ఒకవేళ బీజేపీని పక్కకు తోసేసి కాంగ్రెస్, సీపీఎం కూటమి రెండో స్థానంలోకి రాగలిగితే, జాతీయ స్థాయిలో తిరిగి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు  చాన్స్ లేకపోలేదు. అందుకే బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలకు కీలకం కానున్నాయి.

2016లో మూడే సీట్లు

బెంగాల్‌‌‌‌లో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మూడే సీట్లు గెల్చుకున్న బీజేపీ.. ఇప్పుడు 200 సీట్లను గెల్చుకుంటామనే ధీమాతో ఉంది. 2019 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 సీట్లకు 18 సీట్లు గెల్చుకోవడంతో బీజేపీలో ఆ భరోసా ఏర్పడింది. ఎన్నికల వ్యూహరచనలో సాటిలేని నేతగా పేరొందిన కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌షా స్వయంగా బెంగాల్ ఎన్నికలపై ఫుల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టారు. బీజేపీ ప్రధాని మోడీ ఇమేజ్‌‌‌‌తో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నా.. ఈ ఎన్నికలు మమత-అమిత్‌‌‌‌షా మధ్య పోరుగా కనిపిస్తోంది. తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రంలో ఒకేరోజు ఎన్నికలు జరుపుతూ బెంగాల్‌‌‌‌లో 8 విడతలుగా ఎన్నికలను ప్రకటించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

బీజేపీకి కలిసి వస్తున్న రాజకీయ శూన్యత

పదేండ్లపాటు అధికారంలో ఉన్న మమత సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. బీజేపీ పెద్ద ఎత్తున జంపింగ్‌‌‌‌లను ప్రోత్సహిస్తుండడంతో ఆమె పార్టీ కొంత బలహీనపడింది. మరోవైపు కాంగ్రెస్, సీపీఎం నేతలను ఆమె గతంలోనే ఆకర్షించడంతో ఆ పార్టీలు డీలాపడ్డాయి. ఇటువంటి సమయంలో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడంలో బీజేపీ విజయం సాధిస్తోంది. ఇప్పటి వరకూ కీలకంగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్‌‌‌‌ పార్టీలు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యేలా బీజేపీ చేయగలిగింది. ఐదేండ్ల వ్యవధిలో మహా శక్తిగా ఇక్కడ బీజేపీ ఎదిగింది. రాష్ట్రంలో 70% ఉన్న హిందువులపై బీజేపీ దృష్టి సారించింది. మమత పాలనలో వారేవిధంగా వివక్షతకు గురవుతున్నారో తెలియచెప్పగలిగింది. దాంతో గత లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో 40.64% ఓట్లతో 18 స్థానాలను గెలుచుకోగలిగింది. 43.69% ఓట్లు పొందిన తృణమూల్ కన్నా కొంచెమే వెనుకబడింది.

మమతలో కలవరపాటు

బీజేపీ పుంజుకోవడం తృణమూల్‌‌‌‌ పార్టీలో కలవరం పెంచింది. లోక్‌‌‌‌సభ ఎన్నికల తర్వాత రాజకీయంగా మమత నిలదొక్కుకోవడం కష్టమనే సందేశం జనంలోకి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో పాలనపై దృష్టి సారించి, ప్రజల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేయకుండా రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనేందుకు గతంలో మాదిరిగా వీధి పోరాటాలకు మమత దిగే ప్రయత్నం చేయడంతో ఆమెకే చేటు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకే ముకుల్ రాయ్ వంటి నేత టీఎంసీ నుంచి బీజేపీలో చేరగా తాజాగా మాజీ మంత్రి సువేందు అధికారితోపాటు రెండు డజన్ల మందికిపైగా ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారు. ఎన్నికల నాటికి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరతారని, చివరికి మమత మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అమిత్‌‌ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ దూకుడును స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్‌‌‌‌లో జరిగిన దాడిని బీజేపీ చాలా సీరియస్‌‌‌‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. మమతను ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు.

అన్ని వర్గాల్లో బీజేపీ పట్ల సానుకూలత

బెంగాల్‌‌‌‌లో ముస్లింలు తప్ప అన్ని వర్గాలు మార్పుకు సానుకూలంగా ఉన్నట్లు హైదరాబాద్‌‌కు చెందిన పోల్ మానిటరింగ్ ఏజెన్సీ పీపుల్స్ పల్స్ ‘పశ్చిమబెంగాల్ మూడ్ రిపోర్ట్ 2021’లో వెల్లడించింది. సువేందు అధికారి వంటి బలమైన నేత నిష్క్రమించడంతో టీఎంసీ బలహీనమవుతున్నదని, బీజేపీ బలం పెంచుకుంటుందనే సూత్రీకరణను సంకలనం చేసిన ఈ రిపోర్ట్‌‌‌‌ను డా.సజ్జన్ కుమార్ తోసిపుచ్చారు. అలాగే లోక్‌‌‌‌సభ ఎన్నికల టైంలో బీజేపీకి మంచి మద్దతు లభించినా, అసెంబ్లీ ఎన్నికల్లో అది రిపీట్‌‌‌‌ కాదనే వాదనను సైతం ఆయన వ్యతిరేకించారు. బెంగాల్ ఎన్నికలు దేశంలోనే ఒక అనూహ్య రాజకీయ మార్పుకు సంకేతం కాగలవని ఆయన అంచనా వేస్తున్నారు. 2019 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో మార్పు వైపు ప్రజలను నడిపించిన అంశాలే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారుతున్నట్లు ఈ రిపోర్ట్‌‌‌‌ స్పష్టం చేస్తోంది. టీఎంసీ వ్యతిరేకత 2018 పంచాయతీ ఎన్నికల నుంచి మొదలైనట్లు ఈ నివేదిక తెలిపింది.

బీజేపీకి ‘సంస్థాగత’ ఇబ్బందులు

బెంగాల్‌‌‌‌లో అధికారంలోకి వస్తామనే ధీమాను ప్రదర్శిస్తున్న బీజేపీకి సంస్థాగత ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. వీధిపోరాటాలతో ఎదిగిన మమతను ఎదుర్కొనే నాయకత్వం లోకల్‌‌‌‌గా బీజేపీకి లేదు. దీంతో వలస నేతలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. పైగా బీజేపీలోకి వచ్చిన ముకుల్‌‌‌‌రాయ్, సువేందు అధికారి వంటి అనేక మంది నేతలు అవినీతి ఆరోపణలు, సీబీఐ ముప్పు ఎదుర్కొంటున్న వారే. ‘ఆత్మరక్షణ’ కోసమే వారు బీజేపీలోకి వచ్చినట్లు కనిపిస్తున్నది. మమత పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా, ఆమెకు ధీటైన నాయకులు ఎవరూ ఇప్పుడు బెంగాల్ లో లేరు. మరోవైపు ఇప్పుడు బెంగాల్ బీజేపీలో పాత- కొత్త నాయకత్వాల మధ్య అంతరం ఏర్పడుతున్నది. అవకాశవాదం, అవినీతి మరకలు ఉన్న నేతలను చేర్చుకుంటూ తమను పక్కన పెట్టడాన్ని దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్న నేతలు సహించలేక పోతున్నారు. మమత, ఆమె మేనల్లుడిపై అనేక ఆరోపణలు చేస్తున్నా ఒక్కదానికి కూడా ఆధారాలు చూపలేక పోయారు.

ఒక్కటైన కాంగ్రెస్, లెఫ్ట్

50 ఏండ్ల పాటు ప్రత్యర్థులుగా తలపడిన కాంగ్రెస్, లెఫ్ట్‌‌‌‌ పార్టీలు.. ఒక్కటయ్యాయి. ఇస్లాం మత ప్రచారకుడు అబ్బాస్ సిద్దిఖ్వి ఏర్పాటు చేసిన ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో సీట్ల సర్దుబాటు చేసుకొనేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌తో పొత్తు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సిద్దిఖ్వి ప్రభావం దక్షిణ బెంగాల్‌‌‌‌లోని నాలుగు జిల్లాలకే పరిమితం. కాంగ్రెస్, సీపీఎం మద్దతుదారులు బీజేపీలోకి వలస వస్తున్న సమయంలో మతోన్మాద పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్నికలు సమీపించేసరికి బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, బీహార్‌‌‌‌లో అసదుద్దీన్ ఒవైసీని అడ్డుపెట్టుకుని పూర్వాంచల్‌‌‌‌లో ముస్లిం ఓట్లను చీల్చి ప్రయోజనం పొందడంలో విజయమైన బీజేపీ ఎత్తుగడలు బెంగాల్‌‌‌‌లో ఏమాత్రం సాగుతాయనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికి సాధారణ జీవనం గడుపుతూ, కాలి నడకతో ఎన్నికల ప్రచారం చేసే ఏకైక సీఎంగా ఉన్న మమత సామాన్య జనంలో సులువుగా కలిసిపోతుంటారు. వ్యక్తిగతంగా మచ్చలేని నేతగా గుర్తింపు పొందారు. ఈ గుర్తింపే ఆమెకు బలం. వీధి పోరాటాల్లో ఆరితేరిన మమత తేలికగా ఓటమిని అంగీకరిస్తారని అనుకోలేం. మరోవైపు ‘బెంగాల్ సెంటిమెంట్’తో ఆమెను ఓడించాలనే బీజేపీ ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి. ఏదిఏమైనా  బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. దేశంలో కొత్త రాజకీయ సమీకరణలకు ఈ ఎన్నికలు దారితీస్తాయని చెప్పవచ్చు.

సీఎం అభ్యర్థి లేకుండానే..

బెంగాల్‌‌‌‌లో మొత్తం అసెంబ్లీ సీట్లు 294. గత లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో 125 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత సాధించింది. మరో 25 సీట్లపై పట్టు సాధిస్తే అధికారంలోకి రావడమే అనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఏర్పడింది. అందుకే అమిత్‌‌‌‌షా, నడ్డా నుంచి బీజేపీ నేతలంతా 200 సీట్లు గెలుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే ‘మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి’ అంటూ మమతను ఢీకొనే నేత లేరనే ప్రచారం టీఎంసీ చేస్తున్నది. అయితే ప్రధాని మోడీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం, చరిష్మాతోనే బీజేపీ ముందుకొస్తూ ఉండడంతో మమత ఆత్మరక్షణలో పడుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ గెలుపొందింది. ఇప్పుడు బెంగాల్‌‌‌‌లోనూ అదే ప్లాన్‌‌‌‌ను ఫాలో అవుతోంది.

బెంగాల్ ఆడబిడ్డ.. బెంగాల్ మేనత్త

తన ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపి ప్రజల ముందు దోషిగా చూపుతున్న బీజేపీపై మమతలో అసహనం పెరుగుతున్నది. తనను తాను ‘బెంగాల్ ఆడబిడ్డ’గా చెప్పుకుంటూ బీజేపీని ‘బయటివారు’గా చిత్రీకరించే ప్రయత్నం ఆమె చేస్తున్నారు. తనను వ్యతిరేకించే వారెవరూ బెంగాలీలు కాదన్నట్లు మమత అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తమ ‘ఆడబిడ్డ’నే తిరిగి బెంగాల్ ప్రజలు ఎన్నుకొంటారని మమత చేసుకుంటున్న ప్రచారాన్ని తిప్పికొడుతోంది. తొమ్మిది మంది మహిళా నాయకులతో ఒక పోస్టర్ విడుదల చేసి.. వారంతా బెంగాల్ ‘ఆడబిడ్డ’లని, బెంగాల్ ప్రజలు ‘మేనత్త’ రాజ్యం వద్దనుకొంటున్నారని ఎద్దేవా చేసింది. ఆమె పార్టీలో, పాలనలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర వహిస్తుండడంతో ‘మేనత్త- మేనల్లుడు’ పాలనగా బీజేపీ విమర్శిస్తున్నది.                         – చలసాని నరేంద్ర, పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌