హన్వాడ, వెలుగు: మండలంలోని పల్లెమోని కాలనీలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెను అర్ధరాత్రి కూల్చివేశారు. ఈ నెల 22న విగ్రహ ప్రతిష్ఠాపన కోసం దిమ్మెను నిర్మించారు. విగ్రహ ఏర్పాటు కోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తుండగా, స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. పనులను నిలిపివేసి విగ్రహ కోసం కృషి చేసిన సర్పంచ్ కొడుకు పల్లెమోని యాదయ్యను పోలీసులు శనివారం రాత్రి మహబూబ్ నగర్ డీఎస్పీ వద్దకు తీసుకెళ్లారు.
ప్రభుత్వం అధికారికంగా విగ్రహం ఏర్పాటు చేస్తుందని, అనుమతి లేకుండా చేపట్టిన పనులను నిలిపివేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ అనుమతితో పాటు స్థలం ఇస్తున్న రైతు అంగీకారం, తహసీల్దార్ కు అనుమతి కోసం అందజేసిన పత్రాలను చూపించినప్పటికీ పోలీసులు పనులు నిలిపివేయాలని ఆదేశించారు. కలెక్టర్ పర్మిషన్తో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పనులను నిలిపివేశారు. ఇదిలాఉంటే అప్పటికే పనులు పూర్తయిన దిమ్మెను అర్ధరాత్రి కూల్చివేయడం కలకలం రేపింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.