ప్రపంచానికి మోడీ సర్కారు సాహసోపేత సంస్కరణలు

అగ్రి చట్టాలతో మన రైతు ప్రపంచానికి తిండిపెడ్తడు

సన్నకారు రైతు మొదలు అందరికీ మేలు

భారీ సంస్కరణలను తీసుకువచ్చి దేశాన్ని మారుస్తాననే హామీతోనే ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండుసార్లు ఎన్నికయ్యారు. సంస్కరణలు, నిజాయతీ గల పని తీరు, దేశంలో మార్పు.. ఇది మోడీ ప్రభుత్వ పరిపాలనా ఎజెండా. దానికి కట్టుబడి బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఎంతో సాహసోపేతంగా వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలు తెచ్చింది. దీనికి సంబంధించి పార్లమెంట్ లోపల, బయటా చర్చలు, సునిశిత పరిశీలన ప్రక్రియ చేపట్టి.. చట్టాలు రూపొందించింది. మన దేశ వ్యవసాయ రంగంలో ఈ కొత్త చట్టాలు సమూల మార్పులు తెచ్చి చిన్న, సన్నకారు రైతులకు వారి ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని అవకాశాలు కల్పించి, వారి ఆదాయాన్ని పెంచి సాధికారత కల్పిస్తాయి. ఆంక్షలతో కూడిన మార్కెట్, మధ్య దళారులపై ఆధారపడటం నుంచి ఈ చట్టాలు విముక్తి కల్పిస్తాయి. కానీ రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా కొన్ని ప్రతిపక్షాలు తిరోగమన విధానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ చట్టాలతో రైతులకు జరిగే మంచిని తెలియనీకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉద్యమాలను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయి.

భారత ఆర్ధిక వ్యవస్థకు మూలాధారం వ్యవసాయం. దేశ జీడీపీలో దాని వాటా 18%. అంతేకాదు దాదాపు 50 శాతానికి పైగా జనాభాకు ఉపాధిని అందిస్తున్న ఏకైక రంగమిది. జీడీపీలో కీలక భాగస్వాములైన తయారీ, సేవా రంగపు ఉత్పాదకతకను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. 90ల్లో ప్రధాని పీవీ నరసింహరావు నేతృత్వంలో మన దేశం భారీ స్థూల ఆర్థిక సంస్కరణలను చూసింది. నాటి నుంచి,  ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దేశ పురోగతికి అవసరమైన సంస్కరణలు చేపట్టగా.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఏనాడు అడ్డుతగలలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల, ఉపాధి అవకాశాల కోసం చేపట్టిన సంస్కరణలకు సహకరిస్తూ వచ్చింది. ‘దేశం ముందు’ అనే సిద్ధాంతంపై నడిచే బీజీపీ.. దేశ ప్రగతికి అవసరమైన జాతీయ విధానాల రూపకల్పనలో అప్పటి ప్రభుత్వాలకు అండగా నిలిచింది. ఇది నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు వెళ్లేలా సంస్కరణలు చేపడుతూ జాతీయ విధానాలు రూపొందించేలా ఎన్నికైన ప్రభుత్వాలకు అధికారం, శక్తి ఉండాలి. కానీ, నేడు దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచి, వాళ్లకు స్వావలంబన కల్పించే వ్యవసాయం సంస్కరణలతో ముందడగు వేస్తున్న మోడీ సర్కారుకు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు తిరోగామి విధానాలతో అడ్డు తగులుతున్నాయి. ఆ పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం చిన్న, సన్నకారు రైతుల శ్రేయస్సును అడ్డుకుంటున్నాయి.

భవిష్యత్ తరాలకు మేలు

పెద్ద ఆసాములే కాదు.. చిన్న, సన్నకారు రైతులకు కూడా మేలు చేసేలా ప్రధాని మోడీ వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేశారు. ధైర్యంగా తీసుకుని వచ్చిన ఈ సంస్కరణల ఫలితంగా భారతదేశం మొత్తం ప్రపంచానికి వ్యవసాయ కేంద్రంగా మారుతుంది. కొత్త చట్టాల అమలుతో భారత రైతులు, వ్యవసాయ రంగపు శక్తి మొత్తాన్ని వెలికితీసే వీలు కలుగుతుంది. దీని ద్వారా భవిష్యత్ తరాలకు  భారీ మేలు జరుగుతుంది.ఈ చట్టాల అమలుతో మన దేశ రైతులు ప్రపంచం మొత్తానికి అన్నదాతలవుతారు.

తప్పుడు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షాలు

మోడీ ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, టీఎంసీ, ఎన్‌సీపీ, ఎస్ఏడీ, డీఎంకే, ఆర్జేడీ, టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ వంటి పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వాస్తవాలను తెలియనీయకుండా కొన్ని రైతు సంఘాలను ఈ చట్టాలను అడ్డుకునేందుకు రెచ్చగొడుతున్నాయి. పూర్తి ఊహాజనితమైన సమస్యల గురించి మాట్లాడుతూ రైతుల్లో భయాన్ని, అభద్రతను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పార్టీలు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరసనలు చేస్తూ తమ రాజకీయ అవసరాల కోసం వాటిని పెద్దవి చేస్తున్నాయి. ఈ సంస్కరణలు రైతుల పురోభివృద్ధికి దోహదపడతాయని తెలిసీ, ప్రతిపక్ష నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ తిరోగమన వాదులుగా మారారు. నాలుగైదు ప్రధానమైన అంశాలను పరిశీలిస్తే వారి అవకాశవాద రాజకీయం బట్టబయలవుతుంది.

1.సులభ ఆర్థశాస్త్రం:

ఏ వస్తువుకైనా సరైన మార్కెట్ ధర లభించాలంటే దాన్ని వాస్తవ డిమాండ్, సరఫరా పరీక్షకు గురిచేయాలి. డిమాండ్, సరఫరా ప్రభావం లేకుండా ఈ ప్రపంచంలో దీన్ని కూడా ఒక శాశ్వత ధరకు కొనడం, అమ్మడమన్నది జరగదు. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర పొందేందుకు వాటిని ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాస్తవ డిమాండ్, సరఫరా పరీక్షలకు గురిచేస్తే విషయం అర్థమవుతుంది. ఈ ధరలు స్థానిక మార్కెట్లలో దశాబ్దాలుగా దళారులు, మధ్యవర్తులకు అమాయక రైతులు అమ్ముతున్న ధరలకు ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందన్నది వాస్తవం. కొత్త చట్టాల వల్ల వ్యవసాయ రంగంలో ఓపెన్ మార్కెట్ కు అవకాశం వస్తుంది. దీంతో రైతులు వారి ఉత్పత్తులకు మంచి రేటు పొందగలుగుతారు. వ్యవస్థలో ఉన్న అనేక దళారీ వ్యవస్థను కొత్త చట్టాలు రూపుమాపి నేరుగా కొనుగోలుదారులు, మార్కెట్ ను రైతులు కలిసేలా చేస్తుంది. ఈ విషయానికి ప్రతిపక్షాలు లేనిపోని భ్రమలు కల్పించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి.

2. మార్కెటింగ్​లో సంస్కరణలు:

మోడీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ను ప్రభావితం చేస్తాయి. వ్యవసాయ రంగంలో ఇది అత్యంత కీలకమైన దశ. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై విపరీతమైన పెట్టుబడి పెట్టి, కఠినంగా శ్రమించి సాధించిన పంట దిగుబడిని భౌగోళికంగా ఆంక్షలతో కూడిన స్థానిక మార్కెట్లోని మధ్య దళారుల చేతిలో పెట్టి రైతు చితికిపోతున్నాడు. స్థానిక వ్యాపారులతో చేతులు కలిపి ఈ మధ్య దళారులు వ్యవసాయ ఉత్పత్తుల ధర నిర్ణయిస్తారు. ప్రభుత్వంలోని దిగువస్థాయి అవినీతి అధికారుల అండదండలు వీరికి ఉండనే ఉంటాయి. ఈ సంకెళ్ల నుంచి రైతులకు కొత్త చట్టాలు విముక్తి కల్పిస్తాయి. తమ ఉత్పత్తులు నేరుగా ఎక్కువ ధర చెల్లించే వారికి, ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ అమ్ముకునే వీలును కలుగుతుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటను ఎంచుకొని, శ్రమించి, ఎంతో రిస్క్ తీసుకొని పండించే రైతుకు ఈ ప్రక్రియ తగిన ప్రతిఫలాన్ని అందిస్తుంది. ఇది శాస్త్రీయమైనది, మార్కెట్ ఆధారితమైనది కూడా.

3.చిన్న రైతుల జీవితాల్లో మార్పు:

ప్రతీ పంట సీజన్ లో అత్యధికంగా నష్టపోయేది అతి తక్కువ పంట పొలాలు కలిగిన చిన్న , సన్నకారు రైతులే. వాతావరణం అనుకూలించి, సాగు సవ్యంగా సాగి చక్కని దిగుబడి అందుకున్నా వారి ఉత్పత్తులపై లాభం పొందేది అరుదే. కొన్ని సార్లు సాగు ఖర్చు కూడా రాదంటే అతిశయోక్తి కాదు. ఒకవేళ వాతావరణం ప్రతికూలంగా మారితే ఆ రైతు కష్టాలను మాటల్లో చెప్పలేం. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు వారికి పంట బీమా కూడా లేక దిక్కుతోచని స్థితిలో ఏటా దేశమంతా వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భారీస్థాయి సహకార వ్యవసాయం చేసేవారు లేదా పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ వ్యవసాయం చేసేవారు మాత్రమే మంచి లాభాన్ని అందుకుంటారు. మోడీ ప్రభుత్వం చేసిన చట్టాలు అమల్లోకి వస్తే చిన్న , సన్నకారు రైతులకు కూడా రాబడి హామీ, సబ్సిడీ ఆదాయం, సమాంతర ఉపాధి లభిస్తుంది. కొత్త సంస్కరణలతో కోట్లాది చిన్న, పేద రైతుల జీవితాల్లో మార్పు వస్తుంది. అప్పుల ఊబి నుంచి బయటపడి మంచి ఆదాయాన్ని అందుకుంటూ ఉజ్వల భవిష్యత్ చూస్తారు.

4.భారీ పెట్టుబడులు అవసరం:

గరిష్ఠ స్థాయిలో ఉత్పాదకత సాధించడానికి భారతీయ వ్యవసాయ రంగానికి భారీ పెట్టుబడులు అవసరం. వ్యవసాయ ఉత్పత్తిని ప్రామాణికీకరించేందుకు, పెట్టుబడులపై ఆదాయ అనిశ్చితి తొలగించేందుకు వ్యవసాయ పారిశ్రామిక పెట్టుబడుల అవసరం ఎంతైనా ఉంది. పరిశోధన, యాంత్రీకరణ, ఇన్‌పుట్ ప్రాసెస్, పంట యాజమాన్యం, దిగుబడి యాజమాన్యం, గిడ్డంగులు, రవాణా, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటివి ఇతర కీలక అంశాలు.

5.లోపాల సవరణ:

తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజాభిమతం వ్యతిరేకంగా ఉందని తెలిసినా.. ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ధైర్యంగా రిస్క్ తీసుకునేందుకు సాహసించారు. అందరికీ మంచి చేయాలనే సంకల్పం, కష్టాల నుంచి గట్టెక్కగలమనే ధైర్యం, దార్శనికత కలిగిన వారే గొప్ప నాయకులు. వ్యవసాయ రంగంలో ఉన్న లోపభూయిష్ట సంస్కరణలు రైతుల ఆదాయం పెంచడానికి పని చేయవని గుర్తించి, వాటిని చక్కదిద్ది ఈ కొత్త చట్టాల ద్వారా సమతూకం సాధించారు. ఏళ్ల క్రితమే వ్యవసాయ రంగంలో ఇన్ పుట్ పరిశ్రమల స్వేచ్చ మార్కెట్ కు తలుపులు తెరిచారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఫీడ్ వంటి వ్యవసాయ ఇన్ పుట్ పరిశ్రమలో బడా వ్యాపార సంస్థలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుమతించాయి. కానీ వ్యవసాయ రంగంలో పూర్తిస్థాయిలో సంస్కరణలు అమలు చేసే దార్శనికత, ధైర్యం కాంగ్రెస్ పార్టీలో కొరవడ్డాయి. అవరోధాలన్నింటినీ విచ్చిన్నం చేస్తూ పూర్తిస్థాయిలో ప్రధాని మోడీ చేపట్టిన సంస్కరణలు చారిత్రత్మకమైనవి. – కె.కృష్ణసాగర్ రావు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.