
వీధి కుక్కుల దాడిలో గాయపడిన బాలుడు మృతి
చికిత్స పొందుతూ 15 రోజుల తర్వాత తుదిశ్వాస
హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో ఘటన
వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. జూన్ నెలలో వీధికుక్కల దాడిలో గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం (జులై 12న) ప్రాణం విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాజీవ్ గృహకల్ప(కడిపికొండ)లో చోటుచేసుకుంది.
బాధితులు, స్థానికుల కథనం ప్రకారం...
కాజీపేట మండలం బట్టుపల్లి కొత్తపల్లి గ్రామానికి చెందిన పోలెపాక మచ్చాస్- కళ్యాణి దంపతులకు ఇద్దరు కుమారులు. నగరపాలక సంస్థలో వాటర్‌మెన్‌గా పని చేస్తున్న మచ్చాస్ కుటుంబంతో కలిసి రాజీవ్ గృహకల్ప వద్ద నివాసం ఉంటున్నారు. 15 రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న అతడి చిన్న కుమారుడు డేవిడ్ రాజ్(18 నెలలు)పై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 15 రోజులుగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డేవిడ్ రాజ్ మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.