రివర్స్​ తీస్తుండగా కారు కింద పడ్డ బాలుడు

  • అక్కడికక్కడే మృతి
  • భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం భావోజితండాలో విషాదం

ఇల్లెందు(టేకులపల్లి), వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెం గ్రామ పంచాయతీలో కారు రివర్స్​చేస్తుండగా వెనక ఆడుకుంటున్న మూడేండ్ల బాలుడు దాని కింద పడి చనిపోయాడు. టేకులపల్లి ఎస్సై గన్ రెడ్డి రమణారెడ్డి కథనం ప్రకారం... ఇల్లెందు మండలంలోని భావోజితండాలో అజ్మీర విక్రమ్, మాధవి దంపతుల కొడుకు సిద్ధార్థ్(3) సోమవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అక్కడే  ఓ కారు పార్క్​ చేసి ఉంది.

అప్పుడే వచ్చిన డ్రైవర్​వెనక ఎవరున్నారో గమనించకుండా కారును రివర్స్​తీశాడు. దీంతో కారు బాలుడిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.